పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-05-20T13:31:36+05:30 IST

డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పారిశ్రామికాభివృద్ధిపైనే ప్రత్యేక దృష్టి సారిస్తోందని, కొత్త పరిశ్రమలు స్థాపించేందుకు స్వదేశీ, విదేశీ సంస్థలకు పలు రాయితీలు

పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యం

- రూ.1132కోట్లతో కోవై విమానాశ్రయం అభివృద్ధి 

- సీఎం స్టాలిన్‌ ప్రకటన


చెన్నై: డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పారిశ్రామికాభివృద్ధిపైనే ప్రత్యేక దృష్టి సారిస్తోందని, కొత్త పరిశ్రమలు స్థాపించేందుకు స్వదేశీ, విదేశీ సంస్థలకు పలు రాయితీలు కల్పిస్తోందని, మహనాడుల ద్వారా పెట్టుబడులను విరివిగా సమీకరిస్తోందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తెలిపారు. కోయంబత్తూరులో గురువారం ఉదయం జరిగిన ఈరోడ్‌, కోయంబత్తూరు, తిరుప్పూరు జిల్లాలకు చెందిన పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన మాట్లాడుతూ వాణిజ్య నగరమైన కోయంబత్తూరు విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో పెంచేందుకు రూ.1132 కోట్ల మేర కేటాయించినట్లు ప్రకటించారు. జౌళి, ఇంజనీరింగ్‌, ఐటీ రంగాలు, ఆటోమొబైల్‌ విడిభాగాల తయారీ, మోటారు పంపులు, వెట్‌ గ్రైండర్లు, బంగారు నగలు, ఆభరణాలు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న కోవై నగరం రెండవ వాణిజ్యనగరంగా పేరుపొందిందన్నారు. ఈ నగరంలో 700  పైగా వెట్‌గ్రైండర్‌ పరిశ్రమలున్నాయని,, ఈ ఉత్పత్తులు దేశవిదేశాలకు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. డీఎంకే అధికారంలోకి వచ్చినప్పడి నుంచి ఇప్పటి వరకూ ఐదు పెటుబడిదారుల మహానాడులు నిర్వహించిందని, వాటిలో ఒకటి కోయంబత్తూరులో జరిపామని తెలిపారు. యేడాది పాలనలో తమ ప్రభుత్వం రూ.69,375 కోట్ల మేర పెట్టుబడులను సమీకరణ ద్వారా 2.25లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా 131 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఆయన వివరించారు. తమ ప్రభుత్వం భారీ పరిశ్రమలకే కాకుండా కుటీర, చిన్నతరహా పరిశ్రమలకు కూడా తగిన ప్రాధాన్యత కల్పిస్తోందని తెలిపారు. ఈ సదస్సులో మంత్రులు తంగం తెన్నరసు, దామో అన్బరసన్‌, సెంథిల్‌బాలాజీ, ఎన్‌.కయల్‌విళి సెల్వరాజ్‌, కోయంబత్తూరు మేయర్‌ ఎ. కల్పన, ఎంపీ ఎ.రాజా, పరిశ్రమల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఎస్‌.కృష్ణన్‌, కోయంబత్తూరు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జీఎస్‌ సమీరాన్‌ మూడు జిల్లాలకు చెందిన పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T13:31:36+05:30 IST