ద్రావిడ తరహా పాలన దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2022-06-30T13:30:16+05:30 IST

రాష్ట్రంలో డీఎంకే ఆధ్వర్యంలోని ద్రావిడ తరహా పాలన దేశానికే ఆదర్శమని, తమప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు దేశమంతా

ద్రావిడ తరహా పాలన దేశానికే ఆదర్శం

                           - తిరుపత్తూరు సభలో Cm Stalin


చెన్నై, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డీఎంకే ఆధ్వర్యంలోని ద్రావిడ తరహా పాలన దేశానికే ఆదర్శమని, తమప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు దేశమంతా అమలు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. తిరుపత్తూరులో బుధవారం ఉదయం రూ.110 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టర్‌ కార్యాలయాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు రూ.103 కోట్ల విలువైన సంక్షేమ, నగదు సహాయాలు పంపిణీ చేశారు. తిరుపత్తూరు -వాణియంబాడి రహదారిలోని డాన్‌బాస్కో పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మునుపటి అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ఒక్కో పథకాన్ని ప్రారంభించేటప్పుడు భారీ సభలు నిర్వహించేవారని, డీఎంకే అధికారంలోకి వచ్చాక ఒకే సభలో పలు పథకాల ప్రారంభం, కొత్త పథకాలకు శంకుస్థాపనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తిరుపత్తూరు జిల్లాలో ఈ యేడాది 1073 మంది ఉచిత ఇంటి పట్టాలు అందుకున్నారని, 2052 మంది సహకార నగల తాకట్టు రుణమాఫీ కింద లబ్ధిపొందారని తెలిపారు. ప్రజల వద్దకే వైద్యం పథకం ద్వారా ఐదులక్షల మంది లబ్ధిపొందారని వెల్లడించారు. స్వాతంత్య్ర సంగ్రామం నుంచి ఇప్పటి వరకూ తమిళనాడు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని చెబుతూ మొదటి సిపాయిల తిరుగుబాటు వేలూరు జిల్లాలోనే జరిగిందని గుర్తు చేసుకున్నారు. దేశమంతా బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి డీఎంకే ప్రభుత్వమే కారణమన్నారు. ప్రజలవద్దకే పాలన పథకం ద్వారా తాను పర్యటించే అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలను స్వయంగా కలుసుకుని వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించి ఎప్పటికప్పుడు వారి సమస్యలను పరిష్కరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దురైమురుగన్‌, ఏవీ వేలు, జిల్లా కలెక్టర్‌ అమర్‌కుష్వాహ్‌, ఎమ్మెల్యేలు దేవరాజ్‌, నల్లతంబి తదితరులు పాల్గొన్నారు.


వేలూరు బస్‌స్టేషన్‌ ప్రారంభం

ఈ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి స్టాలిన్‌ కారులో వేలూరు బయలుదేరి వెళ్లారు. వేలూరులో రూ.54 కోట్లతో నూతనసొబగులు అద్దుకున్న బస్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దురైమురుగన్‌, ఎంపీ కదిర్‌ ఆనంద్‌, ఎమ్మెల్యేలు నందకుమార్‌, కార్తికేయన్‌, మేయర్‌ సుజాత, డిప్యూటీ మేయర్‌ సునీల్‌కుమార్‌, కలెక్టర్‌ కుమారవేల్‌ పాండ్యన్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం వేలూరు కోట మైదానంలో ఏర్పాటైన భారీ బహిరంగ సభలో ఆ జిల్లాలో రూ.62.10 కోట్లతో పూర్తయిన 17 పథకాలను ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రారంభించారు. రూ.32.89 కోట్లతో చేపట్టనున్న కొత్త పథకాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం 30423 మంది లబ్ధిదారులకు రూ.360,53 కోట్ల మేర సహాయాలు పంపిణీ చేశారు. ఈ సభల్లో పాల్గొన్నవారందరికీ కరోనా నిరోధక పరీక్షలు నిర్వహించారు. మూడు జిల్లాల్లోనూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ పర్యటన పురస్కరించుకుని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-06-30T13:30:16+05:30 IST