CM statement: ఒకే భాష, ఒకే మతం అసాధ్యం

ABN , First Publish Date - 2022-07-31T13:46:51+05:30 IST

దేశానికి ఒకే భాష, ఒకే మతం అమలు చేయడం సాధ్యం కాదని, కేంద్రప్రభుత్వం ఫెడరలిజాన్ని గౌరవిస్తూ వ్యవహరించాలని సూచించిన ముఖ్యమంత్రి

CM statement: ఒకే భాష, ఒకే మతం అసాధ్యం

                                      - ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌


చెన్నై, జూలై 30 (ఆంధ్రజ్యోతి): దేశానికి ఒకే భాష, ఒకే మతం అమలు చేయడం సాధ్యం కాదని, కేంద్రప్రభుత్వం ఫెడరలిజాన్ని గౌరవిస్తూ వ్యవహరించాలని సూచించిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంసమృద్ధి సాధించినప్పుడే దేశం బలపడుతుందన్నారు. కేరళలోని త్రిశూర్‌లో శనివారం ఉదయం నిర్వహించిన మనోరమా మీడియా సదస్సు లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్న స్టాలిన్‌ ప్రసంగిస్తూ తమిళ, మలయాళ భాషల మధ్య అవినాభావ సంబంధం ఉందని, మాజీ ప్రధాని నెహ్రూ(Former Prime Minister Nehru) వివిధ భాషలు మాట్లాడే ప్రజలు సామసర్యంగా జీవించేందుకు భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫెడరలిజాన్ని గౌరవించి నడచుకోవాలని, దేశానికి ఒకే భాష, ఒకే మతం సాధ్యపడదని, దేశంలోని అన్ని భాషలను, అన్ని రాష్ట్రాలను పరిరక్షిస్తేనే దేశాన్ని రక్షించినట్లవుతుందన్నారు. ప్రజల నిత్యావసరాలేమిటో ప్రత్యక్షంగా పరిశీలించి వాటిని సకాలంలో సమకూర్చేవి రాష్ట్ర ప్రభుత్వాలేనని స్పష్టం చేశారురు.  బలమైన రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి బలమే తప్ప బలహీనం కావన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటే చాలదని, మరో వందేళ్లపాటు దేశం పటిష్ఠంగా ఉండేందుకు పథకాలు, ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని స్టాలిన్‌(Stalin) ఉద్ఘాటించారు. భిన్నత్వంలో ఏకత్వమే దేశం పటిష్ఠంగా ఉండటానికి ప్రధాన కారణమని, అలాంటప్పుడే ఒకే భాష, ఒకే మతం అంటూ ఏకైక విధానాన్ని అమలు చేయడం తగదన్నారు. ఒకే భాష, ఒకే మతం, ఒకే సంస్కృతిని అమలు చేయాలంటూ దేశ సమైక్యతకు భంగం కలిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అలా దేశసమైక్యతకు భంగం కలిగించేవారంతా దేశానికి శత్రువులే అవుతారన్నారు. ఈ విచ్చిన్నకర శక్తుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, వామపక్షాలతో కూడిన కూటమి లక్ష్యాల ఆధారంగా ఏర్పాటైందని, భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతుందని స్టాలిన్‌(Stalin) స్పష్టం చేశారు. 


గవర్నర్లతో ద్వంద్వపాలన...

కేంద్రంలోని బీజేపీ పాలకులు రాష్ట్రాల్లో గవర్నర్ల ద్వారా ద్వంద్వ పాలనను ప్రోత్సహిస్తున్నారని సీఎం ఆరోపించారు. నీట్‌ విధానాన్ని అమలు చేసి నిరుపేదలకు ఉన్నతవిద్య అందకుండా చేస్తున్నారని, నూతన విద్యా విధానం వలన  రాష్ట్రాలకు నష్టమే కలుగుతుందన్నారు. 

Updated Date - 2022-07-31T13:46:51+05:30 IST