ఐదు విదేశీ వర్సిటీల్లో తమిళ పీఠాలు

ABN , First Publish Date - 2022-08-23T14:26:15+05:30 IST

ఈ యేడాదిలోగా ఐదు విదేశీ విద్యాలయాలల్లో తమిళ పీఠాలను నెలకొల్పనున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) ప్రకటించారు.

ఐదు విదేశీ వర్సిటీల్లో తమిళ పీఠాలు

- తమిళ భాషాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం 

- వ్యవహారికంలోనూ అచ్చమైన తమిళం ఉండేలా చర్యలు

- ముఖ్యమంత్రి స్టాలిన్‌ 

- తమిళ పరిశోధకులకు కలైంజర్‌ సెమ్మొళి అవార్డుల ప్రదానం


చెన్నై, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ఈ యేడాదిలోగా ఐదు విదేశీ విద్యాలయాలల్లో తమిళ పీఠాలను నెలకొల్పనున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) ప్రకటించారు. రీయూనియన్‌ దీవి విశ్వవిద్యాలయం, ఇండోనేషియాలోని సముద్ర ఉత్తార విశ్వవిద్యాలయం, కంబోడియాలోని సీకేఎస్‌ పరిశోధన కేంద్రం, వియత్నాంలోని భాషలు, సంస్కృతీ పరిశోధన విశ్వవిద్యాలయం (యూఎల్‌ఐఎస్‌), థాయ్‌లాండ్‌లోని సులాలోంగోర్న్‌ విశ్వవిద్యాలయంలో తమిళ పీఠాలు ఏర్పాటు చేయనున్నట్లు సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. తమిళం అన్యభాషలకు సంబంధించిన పదాలు లేకుండా దినదినాభివృద్ధి చెందుతోందని, వ్యవహారికంలోనూ అచ్చమైన తమిళ పదాలనే ప్రజలు ఉపయోగించేలా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. తమిళ ప్రాచీన పరిశోధనా సంస్థలో దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Former Chief Minister Karunanidhi) కోటి రూపాయల కార్పస్‌ ఫండ్‌తో నెలకొల్పిన ‘కలైంజర్‌ సెమ్మొళి అవార్డు’లను సోమవారం ప్రదానం చేసిన సీఎం ప్రసంగిస్తూ.. మూడువేల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన తమిళ భాషకు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఎంతో పోరాడి ప్రాచీన హోదా సాధించారని గుర్తు చేశారు. అంతేకాకుండా మైసూరులో ఏర్పాటైన ప్రాచీన తమిళ పరిశోధనా సంస్థ కార్యాలయాన్ని చెన్నైకి తెప్పించిన ఘనత కూడా కరుణానిధి(Karunanidhi)కే దక్కుతుందన్నారు. నగరంలో ఈ సంస్థకు సొంత భవనం కోసం పెరుంబాక్కంలో 16.5 ఎకరాల స్థలం కేటాయించింది కూడా డీఎంకే ప్రభుత్వమేనని వెల్లడించారు. ఆ స్థలంలో నిర్మించిన భవన సముదాయానికి జనవరి 12న ప్రదాన మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగిందన్నారు. తమిళ భాషాభివృద్ధికి పాటుపడుతున్న ప్రాచీన తమిళ పరిశోధనా సంస్థకు తమ ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉందని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తంగం తెన్నరసు, ఎం.సుబ్రమణ్యం, ఎంపీ తమిళచ్చి తంగపాండ్యన్‌, శాసనసభ్యుడు అరవింద్‌ రమేష్‌, తమిళభాషాభివృద్ధి, సమాచార శాఖ కార్యదర్శి మహేశన్‌ కాశిరాజన్‌, సెమ్మొళి తమిళ పరిశోధన కేంద్రం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్‌ సుందరమూర్తి, డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ చంద్రశేఖరన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

2009 నుంచి  సెమ్మొళి అవార్డులు

ప్రాచీన తమిళ చరిత్ర తెలిపే శిలాశాసనాలపై పరిశోధనలు చేసే తమిళ పండితులు, పరిశోధకులకు ఈ అవార్డులను 2009 నుంచి అందజేస్తున్నారు. ‘కలైంజర్‌ సెమ్మొళి అవార్డు’ను తమిళ భాషా పరిశోధకుడు ప్రొఫెసర్‌ ఎం.రాజేంద్రన్‌, ప్రొఫెసర్‌ నెడుంజెళియన్‌కు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను శాలువలతో ఘనంగా సత్కరించి, ఒక్కొక్కరికి రూ.10లక్షల నగదు, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. తమిళ భాష, సాహిత్యంపై పరిశోధనలు, అనువాద సాహిత్యం,  2010 నుంచి 2019 వరకు ఎంపికైన తమిళ పరిశోధకులకు ఈ యేడాది జనవరి 22న స్టాలిన్‌ అవార్డులను అందజేశారు. ఈ నేపథ్యంలో 2020 సంవత్సరానికిగాను తమిళ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ రాజేంద్రన్‌కు, 2021 సంవత్సరానికిగాను తంజావూరు తమిళ విశ్వవిద్యాలయం తమిళవిభాగం మాజీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ నెడుంజెళియన్‌కు ఈ అవార్డులను ప్రదానం చేశారు. 2022 సంవత్సరానికి గాను ‘తొల్‌కాప్పియం’ను ఫ్రెంచి భాషలో అనువదించిన ఫ్రాన్స్‌ దేశానికి చెందిన పరిశోధకుడు యాన్‌ లూయక్‌ను ఎంపిక చేయగా, ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా అవార్డును అందుకోలేకపోయారు.

Updated Date - 2022-08-23T14:26:15+05:30 IST