Chief Minister: మనమే ఆదర్శం

ABN , First Publish Date - 2022-08-25T13:14:42+05:30 IST

అభివృద్ధి పథకాల అమలులో తమిళనాడు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా వుందని, ఇతర రాష్ట్రాలన్నీ మనవైపే చూస్తున్నాయని ముఖ్యమంత్రి ఎంకే

Chief Minister: మనమే ఆదర్శం

- అభివృద్ధి పథకాల అమలులో ముందున్నాం 

- అన్ని రాష్ట్రాల చూపు మనవైపే

- ప్రతిపక్షాలకు మాత్రం అభివృద్ధి కనిపించడం లేదు

- కోయంబత్తూరు సభలో సీఎం స్టాలిన్‌


చెన్నై, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పథకాల అమలులో తమిళనాడు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా వుందని, ఇతర రాష్ట్రాలన్నీ మనవైపే చూస్తున్నాయని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) పేర్కొన్నారు. డీఎంకే ప్రభుత్వం గత పదిహేను నెలలుగా రాష్ట్ర పురోభివృద్ధికి అమలు చేస్తున్న విప్లవాత్మకమైన ప్రజాసంక్షేమ పథకాలపై ఇతర రాష్ట్రాలన్నీ దృష్టిసారిస్తున్నాయన్నారు. స్వల్పకాలంలో ఎన్నికల హామీలను ఎలా నెరవేరుస్తున్నారంటూ సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కోయంబత్తూరు ఈచ్చనారి ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కోయంబత్తూరు(Coimbatore) జిల్లాలో రూ.271.25 కోట్లతో నిర్మించిన వివిధ పథకాలకు సంబంధించిన కార్యాలయాలు, విద్యాసంస్థల భవనాలను ఆయన ప్రారంభించారు. ఇదే విధంగా ఆ జిల్లాలో రూ.662.50 కోట్లతో నూతన పథకాలకు శంకుస్థాపన చేశారు. వివిధ ప్రభుత్వ సంక్షేమపథకాల అమలులో భాగంగా లక్షా ఏడువేలమందికిపైగా లబ్దిదారులకు రూ.589.24 కోట్ల విలువైన సహాయాలను పంపిణీ చేశారు. అనంతరం సీఎం ప్రసంగిస్తూ ... రాష్ట్రంలో పదిహేను నెలలుగా అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపడుతున్నా జాతి గౌరవం, ఆత్మగౌరవం ఇసుమంత కూడా లేని ప్రతిపక్షాలు పనిగట్టుకుని తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులు ప్రజలవద్దకు వెళ్ళి తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గురించి అడిగి తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిటీ బస్సు(City bus)ల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలు, ఇళ్లవద్దకే వైద్యం అందుకుంటున్నవారు, ఉచిత విద్యుత్‌ పొందుతున్న లక్షమంది అన్నదాతలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కరవు భత్యం పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు, నాన్‌ముదల్వన్‌ పథకం ద్వారా ప్రతిభాపాటవాలను పెంపొందించుకుంటున్న విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాలవారు తమ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారన్నారు. ఏదో కాలయాపన కోసం ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తాను పెద్దగా పట్టించుకోనని, అదే సమయంలో వారి విమర్శలు రాష్ట్రా అభివృద్ధికి అడ్డుగా నిలిస్తే సహించనని స్టాలిన్‌ హెచ్చరించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తాను కోవై జిల్లాల్లో ఐదు సార్లు పర్యటించి పథకాలను ప్రారంభించానని సీఎం గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు స్వామినాధన్‌, సెంథిల్‌బాలాజీ, ఎన్‌.కయల్‌విళి సెల్వరాజ్‌, ఎంపీలు పీఆర్‌ నటరాజన్‌, అందియూరు సెల్వరాజ్‌, కే షణ్ముగసుందరం, శాసనసభ్యుడు వీఆర్‌ ఈశ్వరన్‌, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జీఎస్‌. సమీరన్‌, కార్పొరేషన్‌ మేయర్‌ కల్పన, డిప్యూటీ మేయర్‌ ఆర్‌. వెట్రిసెల్వన్‌, కమిషనర్‌ ఎం. ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-25T13:14:42+05:30 IST