విద్యార్థుల కోసం విమానాలు

ABN , First Publish Date - 2022-03-08T15:48:51+05:30 IST

ఉక్రెయిన్‌ నుంచి ఢిల్లీ చేరుకునే తమిళ విద్యార్థులను ఎప్పటికప్పుడు వారి స్వస్థలాలకు వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున విమాన సదుపాయం కల్పిస్తున్నట్లు ఎంపీల పర్యవేక్షక కమిటీ అధ్యక్షుడు, ఎంపీ తిరుచ్చి శివ ప్రకటించారు.

విద్యార్థుల కోసం విమానాలు

- ఉక్రెయిన్‌ నుంచి వచ్చే వారికోసం ఏర్పాటు: తిరుచ్చి శివ  

- రాష్ట్రానికి చేరుకున్న మరో 136 మంది స్టూడెంట్స్‌


చెన్నై: ఉక్రెయిన్‌ నుంచి ఢిల్లీ చేరుకునే తమిళ విద్యార్థులను ఎప్పటికప్పుడు వారి స్వస్థలాలకు వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున విమాన సదుపాయం కల్పిస్తున్నట్లు ఎంపీల పర్యవేక్షక కమిటీ అధ్యక్షుడు, ఎంపీ తిరుచ్చి శివ ప్రకటించారు. ఉక్రెయిన్‌లో ఆహారం లేకుండా ప్రాణ భయంతో కొట్టుమిట్టాడుతున్న తమిళ విద్యార్థులను స్వస్థలాలకు చేర్చే విధంగా కేంద్రప్రభుత్వ అధికారులు, మంత్రులతో చర్చించి, సహాయ చర్యలు చేపట్టే నిమిత్తం ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఎంపీల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తిరుచ్చి శివ నాయకత్వం వహిస్తున్న ఆ కమిటీలో ఎంపీలు డాక్టర్‌ కళానిధి వీరాసామి, ఎంఎం అబ్దుల్లా, ఏకేఎస్‌ విజయన్‌ సభ్యులుగా ఉన్నారు. సోమవారం ఉదయం ఈ కమిటీ సమావేశం ఢిల్లీలోని తమిళనాడు హౌస్‌లో తిరుచ్చి శివ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత తిరుచ్చి శివ మీడియాతో మాట్లాడుతూ ఉక్రెయిన్‌ నుంచి ఢిల్లీ చేరుకునే తమిళ విద్యార్థులను తమిళనాడు హౌస్‌కు చేర్చి వారికి భోజన సదుపాయాలు అందిస్తున్నామని, ఆ తర్వాత వారికి ప్రభుత్వం తరఫున టికెట్లు కొనుగోలు చేసి విమానాల్లో చెన్నై పంపుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 1196 మంది విద్యార్థులను స్వస్థలానికి చేర్చామని చెప్పారు. ఉక్రెయిన్‌ నుండి స్వంత ఖర్చుతో తిరిగి వచ్చిన 255 మంది విద్యార్థులు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో తిరిగివచ్చిన 136మంది ప్రస్తుతం తమిళనాడు హౌస్‌లో ఉన్నారని, వీరందరినీ విమానం లో పంపుతున్నట్లు తెలిపారు. ఢిల్లీ నుంచి తమను స్వస్థలాలకు తరలించేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ చేపడుతున్న చర్యలకు ఆ విద్యార్థులంతా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారని తెలిపారు. కాగా శివ బృందం సోమ వారం మధ్యాహ్నం విద్యార్థులను విమానాశ్రయానికి తీసుకెళ్లి చెన్నై పంపించింది.  ఇదిలా వుండగా దక్షిణాది జిల్లాల పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన నలుగురు తిరునల్వేలిలో ఇంటికెళ్లి పరామర్శించారు. వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 


బాంబు దాడుల మధ్య 12 కి.మీ నడక

 - మహమ్మద్‌ ఆదీమ్‌

బాంబు దాడుల మధ్య 12 కి.మీ నడిచామని ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ చదువుతున్న రామనాథపురం విద్యార్థి మహమ్మద్‌ ఆదీమ్‌ తెలిపాడు. సోమ వారం స్వగ్రామం ఉచ్చిపుల్లికి చేరుకున్న ఆదీమ్‌కు కుటుంబసభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆదీమ్‌ మాట్లాడుతూ... ‘‘కార్గివ్‌ మీడ్వెల్‌ నగరంలో ఉన్న వైద్యకళాశాలలో నాలుగో ఏడాది చదుతున్నాను. మేం ఉంటున్న హాస్టల్‌ పక్కనే క్షిపణుల దాడి జరిగింది. మా భవనం పక్కనే ఉన్న 11 అంతస్తుల భవనం, సూపర్‌మార్కెట్‌ నేల మట్టం అయ్యాయి. నాతో పాటు రాష్ట్రానికి చెందిన 67 మందితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 260 మంది ఉధృతంగా పడుతున్న బాంబుల మధ్య ఉక్రెయిన్‌ నుంచి 12 కి.మీ నడచి రుమేనియా చేరుకున్నాం. మేము నడిచే సమయంలో 100 మీటర్ల దూరంలో బాంబు పడింది. అయినా ఎలాగోలా తప్పించుకున్నాం. ఇప్పుడు ఇంటికి చేరుకున్నానంటే నమ్మకం కుదరడం లేదు’’ అని వివరించాడు. 

Updated Date - 2022-03-08T15:48:51+05:30 IST