ప్రజలే మాకు యజమానులు..

ABN , First Publish Date - 2022-03-12T13:54:02+05:30 IST

ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు ప్రజలే యజమానులని, వారి సంక్షేమం కోసం అమలు చేసే ప్రతిపథకం మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా అందినప్పుడే అది సమర్థవంతమైన పాలన అవుతుందని

ప్రజలే మాకు యజమానులు..

- పథకాల ఫలితాలు వారందరికీ చేరాలి

- కలెక్టర్లకు సీఎం స్టాలిన్‌ హితవు


చెన్నై: ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు ప్రజలే యజమానులని, వారి సంక్షేమం కోసం అమలు చేసే ప్రతిపథకం మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా అందినప్పుడే అది సమర్థవంతమైన పాలన అవుతుందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. సచివాలయంలో సమీపంలోని నామక్కల్‌ కవింజర్‌ భవన సముదాయం హాలులో శుక్రవారం జరిగిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల రెండో రోజు సమావేశంలో సీఎం ప్రసంగించారు. ప్రభుత్వ పథకాలు సత్ఫలితాలి వ్వాలంటే జిల్లా కలెక్టర్ల సహాయ సహకారాలు అవసరమని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించి ప్రభుత్వానికి నివేదికలు పంపాల్సిన బాధ్యత వారి పైనే ఉందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతోపాటు ఆయా జిల్లాలకు అవసరమైన ప్రత్యేక పథకాలను కూడా అమలు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం పథకాలకోసం కేటాయించే నిధుల్లో ఒక్క రూపాయి కూడా వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా జిల్లా కలెకర్లదేనని స్పష్టం చేశారు. అవినీతి అక్రమాలకు తావులేని నిజాయితీపరమైన పారదర్శకమైన పరిపాలన అందించటమే తన ప్రధాన ధ్యేయమని, ఇందుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మారుమూల గ్రామాల్లోని ప్రజలకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలితాలు అందినప్పుడే సమర్థవంతమైన ప్రభుత్వంగా పేరుగడించగలదని చెప్పారు. జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల్లో లభిస్తున్న వనరుల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు కూడా చర్యలు చేపట్టవచ్చని, వారు తమ అభిప్రాయాలను, సూచనలను అందిస్తే తప్పకుండా స్వీకరిస్తానని స్టాలిన్‌ చెప్పారు. జిల్లాల్లో రైతులు, కార్మికులు, కుటీర పరిశ్రమల నిర్వాహకులు, పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఏవైనా పథకాలను రూపొందించి పంపితే వాటిని త్వరితగతిన పరిశీలించి ఆమోదం తెలుపుతానని కలెక్టర్ల హర్షధ్వానాల మధ్య ఆయన ప్రకటించారు. కలెక్టర్లు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సమష్టిగా ప్రభుత్వ పథకాలన్నీ సక్రమంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ సదస్సులో మంత్రులు దురైమురుగన్‌, కేఎన్‌ నెహ్రూ, ఎం.సుబ్రమణ్యం, రాజకన్నప్పన్‌, గీతా జీవన్‌, తంగం తెన్నరసు, పొన్ముడి, పళనివేల్‌ త్యాగరాజన్‌, కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌, ఈవీ వేలు, దామో అన్బరసన్‌, పెరియసామి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జె.రాధాకృష్ణన్‌, డీజీపీ శైలేంద్రబాబు, గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌జివాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-12T13:54:02+05:30 IST