మాతృభాషలో బోధించండి

ABN , First Publish Date - 2022-05-28T15:05:58+05:30 IST

రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థలు మాతృభాషలో విద్యను బోధించేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పిలుపునిచ్చారు. పల్లిక్కరణైలో శుక్రవారం ఉదయం డీఏవీ

మాతృభాషలో బోధించండి

                   - ప్రైవేటు పాఠశాలలకు సూచించిన స్టాలిన్‌


చెన్నై: రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థలు మాతృభాషలో విద్యను బోధించేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పిలుపునిచ్చారు. పల్లిక్కరణైలో శుక్రవారం ఉదయం డీఏవీ గ్రూపు ఆధ్వర్యంలో ఏర్పాటైన కొత్త పాఠశాలను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ డీఏవీ పాఠశాలకు, తమ కుటుంబ సభ్యులకు అవినాభావ సంబంధం ఉందన్నారు. ఆ పాఠశాలలో సీటు సులువుగా లభించదని, తాను జన్మించిన గోపాలపురంలోని డీఏవీ పాఠశాలలో తన కుమార్తె సెందామరైకి సీటు లభించినా, తన సోదరుడి కుమార్తె పూంగుళలికి మాత్రం అప్పట్లో డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్నా తీవ్రంగా ప్రయత్నించిన తర్వాతే సీటిచ్చారని తెలిపారు. ఐదు దశాబ్దాలకు పైగా నాణ్యమైన విద్య నందించటం వల్లే డీఏవీ పాఠశాలల్లో సీటు కోసం పోటీ అధికంగా ఉంటోందన్నారు. ప్రస్తుతం డీఏవీ గ్రూపు ప్రభుత్వ పాఠశాలలను కూడా మెరుగుపరిచేందుకు చర్యలు ప్రారంభించిందని, ఆ మేరకు ట్రిప్లికేన్‌లోని లేడీ వెలింగ్టన్‌ ఉన్నతపాఠశాల, సైదాపేటలోని ప్రభుత్వ ఆదర్శ ఉన్నతపాఠశాలకు విద్యాపరమైన సహాయ సహాకారాలను అందించేలా ఒప్పందం కుదుర్చుకుందని స్టాలిన్‌ తెలిపారు. రాష్ట్రంలో డీఏవీ గ్రూపు వంటి ప్రైవేటు విద్యాసంస్థ మాతృభాషకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ దిశగా మాతృభాషలో విద్యనందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. డీఏవీ విద్యా సంస్థలు చేపడుతున్న విద్యా ప్రాజెక్టులకు తమిళ పేర్లు పెట్టాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎం.సుబ్రమణ్యం, అన్బిల్‌ మహేశ్‌ పొయ్యామొళి, ఎంపీ తమిళచ్చి తంగపాండ్యన్‌, ఎమ్మెల్యే అరవింద్‌ రమేష్‌, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ మహేష్ కుమార్‌, డీఏవీ పాఠశాలల గ్రూపు చైర్మన్‌ వినయ్‌ పారిక్‌, పాఠశాల నిర్వాహక కమిటీ సభ్యులు వెంకటవరదన్‌, రాజీవ్‌ చౌదరి తదితరులు కూడా పాల్గొన్నారు.

Updated Date - 2022-05-28T15:05:58+05:30 IST