పెట్టుబడుల కోసమే దుబాయ్ పర్యటన

ABN , First Publish Date - 2022-04-07T13:55:44+05:30 IST

రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని, ఆ ఆశయసాథన కోసమే తాను ఇటీవల దుబాయ్‌లో పర్యటించి పెట్టుబడులు సమీకరించానని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు.

పెట్టుబడుల కోసమే దుబాయ్ పర్యటన

చెన్నై: రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని, ఆ ఆశయసాథన కోసమే తాను ఇటీవల దుబాయ్‌లో పర్యటించి పెట్టుబడులు సమీకరించానని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. బుధవారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరావళి జరిగింది. అది ముగియగానే ఆయన సభా నిబంధన 110 కింద ఓ సుదీర్ఘ ప్రకటన చేశారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకే అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ఏర్పాటుచేస్తామని, ఆ దిశగా పెట్టుబడులను సమీకరిస్తామని తాను ప్రకటించానని, ఆ మేరకు గత పది నెలలుగా కొత్తగా పరిశ్రమలు స్థాపించేందుకు దేశ విదేశాల్లో పెట్టుబడులను సమీకరిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది డిసెంబర్‌ నెలాఖరుకు రాష్ట్రంలోనే అంతర్జాతీయ పెట్టుబడిదారుల మహానాడు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్టు డీఎంకే సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. గతేడాది జూలై 20న చెన్నైలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో రూ.17,141 కోట్ల పెట్టుబడులుతో 55064 మందికి ఉపాథి కల్పించేలా 35 సంస్థలతో అవగాహన ఒప్పందాలు, అదే యేడాది సెప్టెంబర్‌ 22న చెన్నైలో జరిగిన ఎగుమతుల ప్రోత్సాహక సదస్సులో రూ.1880 కోట్ల పెట్టుబడులతో 39150 మందికి ఉపాధి కల్పించేలా 15 సంస్థలతో ఒప్పందాలు, నవంబర్‌ 23న కోవైలో నిర్వహించిన సదస్సులో రూ.35,208 కోట్ల పెట్టుబడితో 76,795 మందికి ఉపాథి కల్పించేలా 50 సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వివరించారు. అదేవిధంగా ఈ యేడాది మార్చి 7వ తేదీ తూత్తుకుడిలో ఫర్నిచర్‌ పార్కుకు శంకుస్థాపన చేసినప్పడు రూ.4,488 కోట్ల పెట్టుబడితో 15,103 మందికి ఉపాథి కల్పించేలా 14 అవగాహన ఒప్పందాలు, డీపీ వరల్డ్‌, శ్యామ్‌సంగ్‌ సంస్థలతో రూ.3558 కోట్ల పెట్టుబడులతో 4600 మందికి ఉపాధి కల్పించేలా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. మార్చి 26 నుంచి 28 వరకు దుబాయ్‌లో పర్యటించి అక్కడి సంస్థలతో రూ.6100 కోట్ల పెట్టుబడులతో 15,100 మందికి ఉపాధి కల్పించేలా 14 అవగాహన ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్టు వెల్లడించారు. ఎన్నికల సమయంలో రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చేసి హామీ మేరకు ప్రస్తుతం ఈ సంస్థలన్నీ చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, రాణిపేట, తిరుపత్తూరు, సేలం, ఈరోడ్‌, కోయంబత్తూరు, తిరుప్పూరు, తిరువణ్ణామలై, విల్లుపురం, కృష్ణగిరి, ధర్మపురి, మదురై, కరూరు, నామక్కల్‌, దిండుగల్‌, పుదుకోట, తేని, తూత్తుకుడి, తిరుచ్చి, తిరునల్వేలి, విరుదుగనర్‌, కన్నియాకుమారి జిల్లాల్లో కొత్త పరిశ్రమలు నెలకొల్పనున్నాయని ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులను సమీకరించడం తనకెంతో గర్వకారణంగా ఉందన్నారు. 


వచ్చే యేడాది ప్రపంచ పెట్టుబడిదారుల మహానాడు

 ఈ ఏడాది మేలో స్విట్జర్లాండ్‌లో జరుగనున్న ప్రపంచ ఆర్థిక సంస్థల వార్షిక సదస్సులో, జర్మనీలోని హనోవర్‌లో నిర్వహించనున్న పారిశ్రామిక సదస్సులో, జూన్‌లో ఇంగ్లాండులో నిర్వహించే గ్లోబల్‌ ఆఫ్‌ షోర్‌ విండ్‌’ సదస్సులో, జూలైలో అమెరికాలో నిర్వహించనున్న పెట్టుబడిదారుల సదస్సులోనూ రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటకుగాను తమ ప్రభుత్వం మరిన్ని అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు తగు చర్యలు ప్రారంభించిందని స్టాలిన్‌ తెలిపారు. ఇక వచ్చే యేడాది డిసెంబర్‌లో రాష్ట్రంలోనే ప్రపంచ పెట్టుబడిదారుల మహానాడు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని, ఆ మహానాడులోనూ రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా రానున్నాయని చెప్పారు.


ఆస్తి పన్ను పెంపు అనివార్యం

తప్పని పరిస్థితుల్లో భారమైన హృదయంతోనే ఆస్తి పన్ను పెంచాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. కార్పొరేషన్లు, మున్సి పాలిటీల్లో ప్రస్తుతం ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వ నిధుల కోసం వేచి వుండాల్సి వస్తోందని, అందుకు మరో మార్గం లేక అనివార్య పరిస్థితుల్లో ఆస్తి పన్ను పెంచామని ఆయన వివరణ ఇచ్చారు. బుధవారం ఉదయం శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే సభాపక్ష నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి ఆస్తిపన్నుపై సావధాన తీర్మానం ప్రతిపాదించారు. రెండేళ్లపాటు కరోనా లాక్‌డౌన్‌, వైరస్‌ వ్యాప్తి వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, ఈ పరిస్థిత్లుఓ్ల ఆస్తిపన్ను పెంచి వారిని మరింతగా కష్టపెట్టడం న్యాయమేనా అని ప్రశ్నించారు. దానిపై బీజేపీ, కాంగ్రెస్‌, డీపీఐ, ఎండీఎంకే సీపీఐ, సీపీఎం సభ్యులు కూడా ఆస్తిపన్ను పెంపుపై పునఃసమీక్షించాలని కోరారు. ఆస్తి పన్నుపెంచడానికి గల కారణాలను నగరపాలక శాఖా మంత్రి కేఎన్‌ నెహ్రూ వివరించారు. చివరగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ బదులిస్తూ .. ఆరేళ్లుగా స్థానిక సంస్థల్లో  ప్రజా ప్రతినిధులు లేకపోవడం వల్ల అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని, ప్రజలకు మౌలిక సదుపాయాలు సమకూర్చటం కష్టతరంగా మారిందని, నిధుల లేమితో సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోతున్నారన్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో ఎన్నికైన ప్రజా ప్రతినిధులున్నారని, కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, పంచాయతీల్లో అభివృద్ధికి బడ్జెట్‌ ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వం నుంచి నిధుల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. పేద, సాధారణ, మధ్యతరగతి ప్రజలపై ప్రభావం పడకుండా ఆస్తి పన్ను పెంచామని, ఆస్తి పన్ను పెంపుదల అనివార్యమన్నారు. 83 శాతం జనాభాపై దీని ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో నిధుల కొరత నెలకొనడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రాభివృద్ధికోసం తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై ప్రతిపక్షాలు ఎలాంటి రాజకీయం చేయకూడదని, ఆస్తిపన్నును ఎందుకు పెంచాల్సి వచ్చిందో అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2022-04-07T13:55:44+05:30 IST