Inquiry Report: ‘స్మార్ట్‌ అవినీతి’పై ఏం తేల్చారో?

ABN , First Publish Date - 2022-08-21T13:46:51+05:30 IST

‘స్మార్ట్‌ సిటీ’ ప్రాజెక్ట్‌ అవినీతిపై సాగిన దర్యాప్తు నివేదిక ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin)కు అందింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన

Inquiry Report: ‘స్మార్ట్‌ అవినీతి’పై ఏం తేల్చారో?

- సీఎంకు అందిన విచారణ నివేదిక

- అధికారుల గుండెల్లో గుబులు!


చెన్నై, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ‘స్మార్ట్‌ సిటీ’ ప్రాజెక్ట్‌ అవినీతిపై సాగిన దర్యాప్తు నివేదిక ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin)కు అందింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన ఏకసభ్య కమిషన్‌ శనివారం నివేదికను ముఖ్యమంత్రికి అందజేయడంతో స్టాలిన్‌ తీసుకునే చర్యల పట్ల అధికారుల్లో గుబులు రేగుతోంది. కేంద్రప్రభుత్వ సహకారంతో దేశంలోని ప్రధాన నగరాలను సుందరీకరించేలా ‘స్మార్ట్‌ సిటీ’ పథకం అమలుచేస్తున్న విషయం తెలిసిందే. 2015 జూన్‌ 25వ తేదీ ప్రారంభమైన ఈ పథకంలో దేశవ్యాప్తంగా 100 నగరాలు ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టారు. రాష్ట్రంలో చెన్నై, కోయంబత్తూర్‌, మదురై, తంజావూరు, సేలం, వేలూరు, తిరుప్పూర్‌, తూత్తుకుడి, తిరునల్వేలి, తిరుచ్చి, ఈరోడ్‌ తదితర 11 నగరాల్లో స్మార్ట్‌ సిటీ(Smart City) పనులు జరుగుతున్నాయి. ఈ పథకంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చెరిసగం నిధులు కేటాయిస్తున్నాయి. చెన్నైలో టి.నగర్‌ ప్రాంతాన్ని తొలిగా స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలోని పాండిబజార్‌లో వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు, పార్కింగ్‌ సౌకర్యం తదితరాలను కల్పించారు. ఈ నేపథ్యంలో, గత ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో కురిసిన భారీవర్షాలకు టి.నగర్‌ తీవ్ర ముంపునకు గురైంది. వరద నీరు వెళ్లేందుకు తగిన కాలువలు లేకపోవడంతో రోడ్లపై నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడాల్సివచ్చింది. టినగర్‌లోని వరద బాధిత ప్రాంతాలను పరిశీలించిన ముఖ్యమంత్రి స్టాలిన్‌.. స్మార్ట్‌ సిటీ పథకంలో పేర్కొన్న పనులేవీ అక్కడ జరగలేదని గుర్తించారు. ఆ కారణంగా టి.నగర్‌ ముంపునకు గురవుతోందని గ్రహించారు. ఆ ప్రాజెక్టు కోసం వ్యయం చేసిన నిధులేమయ్యాయని ఆరా తీయగా, అందులో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. దీంతో ఈ వ్యవహారంపై విచారణకు మాజీ ఐఏఎస్‌ అధికారి దేవధర్‌(Devdhar) నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. స్మార్ట్‌ సిటీ పనుల కేటాయింపులో నిబంధనలు పాటించారా? పనులను అధికారులు సక్రమంగా పర్యవేక్షించారా? పనులు సక్రమంగా లేకపోతే సదరు కాంట్రాక్టర్లపై ఎందుకు చర్యలు చేపట్టలేదు? టెండర్లలో పారదర్శకత పాటించారా.. తదితర కోణాల్లో కమిషన్‌ దర్యాప్తు చేపట్టింది. అలాగే, సేలం, మదురై(Salem, Madurai) సహా స్మార్ట్‌ సిటీ పనులు జరుగుతున్న నగరాల్లోనూ కమిషన్‌ పర్యటించి విచారించింది. విచారణ పూర్తిచేసిన అనంతరం మూడు నెలల్లో నివేదిక సిద్ధం చేసిన దేవధర్‌.. శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలుసుకుని నివేదిక అందజేశారు. 

Updated Date - 2022-08-21T13:46:51+05:30 IST