ప్రజల మధ్యకు వెళ్తే ప్రచారమంటారా?

ABN , First Publish Date - 2022-07-01T15:15:38+05:30 IST

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీలైనప్పుడల్లా తన అధికారిక పర్యటనల్లో భాగంగా ఆయా ప్రాంతాల ప్రజల సమస్యలను

ప్రజల మధ్యకు వెళ్తే ప్రచారమంటారా?

- ప్రతిపక్షాలపై సీఎం స్టాలిన్‌ ధ్వజం 

- రాణిపేటలో కొత్త కలెక్టరేట్‌ ప్రారంభం


చెన్నై, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీలైనప్పుడల్లా తన అధికారిక పర్యటనల్లో భాగంగా ఆయా ప్రాంతాల ప్రజల సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు పరిష్కరిస్తుంటే అదంతా ప్రచార స్టంట్‌ అంటూ కొంతమంది విమర్శిస్తున్నారని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాణిపేటలో రూ.118.40 కోట్లతో నిర్మించిన కొత్త కలెక్టర్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం.. ఆ జిల్లాలో రూ.32.18 కోట్లతో పూర్తయిన 23 పథకాలకు ప్రారంభోత్సవం, రూ.22.18 కోట్లతో చేపట్టనున్న పథకాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం వివిధ సంక్షేమ పథకాల కింద 71 వేలమందికి పైగా లబ్ధిదారులకు రూ.257.10 కోట్ల విలువైన సహాయకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ వైష్ణవ దివ్యదేశాల్లో ఒకటైన షోళింగర్‌ కేత్రం కలిగి ఉన్న రాణిపేట జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని తోళ్ల ఎగుమతుల్లోనూ ఈ జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. ఇంతటి విశేషాలు కలిగిన ఈ జిల్లాలోని పనపాక్కంలో రూ.400 కోట్లతో 250 ఎకరాల విస్తీర్ణంలో పాదరక్షల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నామని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఈ కర్మాగారం ఏర్పాటైతే సుమారు 20 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగాను ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన యేడాదిలోపే 80 శాతం ఎన్నికల హామీలను నెరవేర్చిందన్నారు. డీఎంకే ప్రభుత్వం ప్రగతిపథంలో పయనిస్తుండటం చూసి ఓర్వలేని ప్రధాన ప్రతిపక్షనేతలు కాబోయే ముఖ్యమంత్రులు తామేనంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తన పర్యటనల్లో సామాన్య ప్రజలను స్వయంగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నానని, ఇటీవల సుగాలీలు, వడ్డెర కులస్థుల కుటుంబాలను తాను కలుసుకోవడం ప్రచారం కోసమేనని ప్రతిపక్షనేతలు విమర్శించటం సమంజసం కాదన్నారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు దురైమురుగన్‌, వీవేలు, ఆర్‌ గాంధీ, ఎంపీలు జగద్రక్షగన్‌, కదిర్‌ ఆనంద్‌, శాసనసభ్యులు మునిరత్నం, ఈశ్వరప్పన్‌, నందకుమార్‌, కార్తికేయన్‌, జిల్లా కలెక్టర్‌ భాస్కరపాండ్యన్‌ తదితరులు పాల్గొన్నారు.


పాఠశాలలో తనిఖీ...

 బహిరంగ సభ అనంతరం తిరుగు ప్రయాణంలో రాణిపేట సమీపంలోని ప్రభుత్వ బాలుర సంరక్షణ కేంద్రాన్ని సీఎం స్టాలిన్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ కేంద్రంలోని పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఆ సందర్భంగా డ్యూటీకి రాని సంరక్షణ కేంద్రం సూపరింటెండెంట్‌ను సస్పెండ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2022-07-01T15:15:38+05:30 IST