రూ. 300 కోట్లతో ‘నమక్కు నామే’

ABN , First Publish Date - 2021-12-12T13:59:16+05:30 IST

రాష్ట్రంలో రూ.300 కోట్ల నిధులతో ‘నమక్కు నామే’ పేరుతో ప్రత్యేక పథకాన్ని అమలు చేయనున్నారు. సేలం శీలనాయకన్‌పట్టిలో శని వారం ఉదయం ఏర్పాటైన ప్రత్యేక సభలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఈ పథకాన్ని లాంఛనంగా

రూ. 300 కోట్లతో ‘నమక్కు నామే’

                         - ‘సేలంలో ప్రారంభించిన సీఎం స్టాలిన్‌


చెన్నై: రాష్ట్రంలో రూ.300 కోట్ల నిధులతో ‘నమక్కు నామే’ పేరుతో ప్రత్యేక పథకాన్ని అమలు చేయనున్నారు. సేలం శీలనాయకన్‌పట్టిలో శని వారం ఉదయం ఏర్పాటైన ప్రత్యేక సభలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద చెన్నై కార్పొరేషన్‌ సహా రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, పట్టణ పంచాయతీలలో నీటివనరుల అభివృద్ధి, చెరువులు, కొలనులలో పూడికతీత పనులు ఉద్యానవనాల ఏర్పాటు, చెట్ల పెంపకం, పాఠశాలలు, రహదారుల అభివృద్ధి, వీధుల్లో విద్యుత్‌ దీపాల ఏర్పాటు వంటి పనులను చేపట్టను న్నట్టు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి స్వంత జిల్లా సేలంలో డీఎంకే ప్రభుత్వ ఆధ్వర్యంలో శనివారం ఉదయం భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం స్టాలిన్‌ చెన్నై నుంచి విమానంలో బయల్దేరి సేలంకు వెళ్ళారు. ఆ జిల్లాల్లో పూర్తయిన పథకాలను ప్రారంభించడం, కొత్త పథకాలకు శంకుస్థాపన చేయడం, వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు సహాయాలు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. సేలం శీలనాయకన్‌పట్టి వద్ద లక్ష చదరపుటుడుగుల విస్తీర్ణంలో భారీ పందిరిని కూడా నిర్మించారు. ఈ ప్రత్యేక వేదికపై స్టాలిన్‌ ‘నమక్కు నామే’ పథకాన్ని ప్రారంభిం చారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ఎస్‌. కార్మేగం అధ్యక్షత వహించారు. మంత్రులు కేఎన్‌ నెహ్రూ, పొన్ముడి, ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం, ముత్తుసామి, ఏవీ వేలు, వలర్మతి, మదివేందన్‌, సేలం కార్పొరేషన్‌ కమిషనర్‌ డి. క్రీస్తురాజ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ రూ.100 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నగరాభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా సేలం జిల్లాల్లో రూ.54 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 60 కొత్త పథకాలనకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.38.52 కోట్ల వ్యయంతో పూర్తి చేసిన 83 పథకాలను ప్రారంభించారు. ఆ తర్వాత జిల్లాకు చెందిన 30,837 మంది లబ్ధ్దిదారులకు రూ.168.64 కోట్ల విలువైన సహాయాలు పంపిణీ చేశారు. రూ.21.99లక్షల విలువైన మూడు ప్రభుత్వ వాహనాలను ప్రారంభించారు. ఈ సభలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ సేలం జిల్లాకు సంబంధించినంతవరకూ మొత్తం రూ.261 కోట్ల నిధులతో పూర్తయిన పథకాలను ప్రారంభించారు. ఇక ఒక వేదికపై ముప్పైవేల మందికిపైగా లబ్ధ్దిదారులకు సహాయాలు పంపిణీ చేసి డీఎంకే ప్రభుత్వం రికార్డు సృష్టించిందని మంత్రి కేఎన్‌ నెహ్రూ తెలిపారు. ఈ కార్యక్రమంలో సేలం ఎంపీ ఎస్‌ఆర్‌ పార్దీబన్‌, కళ్లకుర్చి ఎంపీ గౌతమ్‌ శిఖామణి, పీఎంకే శాసనసభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత సేలం ఐదురోడ్ల కూడలి వద్ద రత్నవేల్‌ జయకుమార్‌ కల్యాణమండపంలో డీఎంకే ఎన్నికల కమిటీ మాజీ నేత వీరపాండి ఎ. రాజా చిత్రపటాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి పరట్యనను పురస్కరించుకుని కోయంబత్తూరు జోన్‌ ఐజీ సుధాకర్‌, సేలం పోలీసు కమిషనర్‌ నజ్మల్‌ గోడా నాయకత్వంలో గట్టి పోలీసుభద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

Updated Date - 2021-12-12T13:59:16+05:30 IST