వచ్చే వారం ఢిల్లీకి Cm ?

ABN , First Publish Date - 2022-07-15T13:02:05+05:30 IST

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ వచ్చే వారం ఢిల్లీ వెళ్ళనున్నారు. చెన్నై నగర శివారు ప్రాంతమైన మహాబలిపురంలో జరిగే చెస్‌ ఒలంపియాడ్‌ ప్రారంభోత్సవానికి

వచ్చే వారం ఢిల్లీకి Cm ?

అడయార్‌(చెన్నై), జూలై 14: ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ వచ్చే వారం ఢిల్లీ వెళ్ళనున్నారు. చెన్నై నగర శివారు ప్రాంతమైన మహాబలిపురంలో జరిగే చెస్‌ ఒలంపియాడ్‌ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించేందుకు ఆయన హస్తిన వెళ్లనున్నారు. మహాబలిపురం వేదికగా 44వ చెస్‌ ఒలంపియాడ్‌ జరుగనుంది. ఈ నెల 28న ప్రారంభమయ్యే ఈ పోటీలు ఆగస్టు 10వ తేదీ వరకు జరుగుతాయి. ఈ పోటీలు మన దేశంలో జరగడం ఇదే తొలిసారి కావడంతో ఏర్పాట్లు చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా చేపడుతున్నారు. దాదాపు 187 దేశాలకు చెందిన 2500 మందికి పైగా చదరంగ క్రీడాకారులు హాజరుకానున్నారు. ఈ పోటీలను విజయవంతం చేసేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో అన్ని శాఖల కార్యదర్శులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే, పూంజేరిలో ఇండోర్‌ ఆడిటోరియం కూడా నిర్మించారు. అలాగే, క్రీడాకారులకు వారి వ్యక్తిగత ర్యాంకుల ఆధారంగా బస ఏర్పాట్లు చేయనున్నారు. 


19న జ్యోతి ప్రజ్వలన

ఈ పోటీల ప్రారంభ సూచకంగా ఈ నెల 19న ఢిల్లీలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగనుంది. ఈ జ్యోతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెలిగిస్తారు. ఆ తర్వాత దేశంలోని 26 రాష్ట్రాల్లో 75 ముఖ్య నగరాల్లో ప్రయాణించి చివరగా మహాబలిపురానికి చేరుకుంటుంది. అలాగే, ఈ చెస్‌ పోటీల ప్రారంభ వేడుకల సందర్భంగా నగరంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ప్రారంభ వేడుకలను ఈ నెల 28వ తేదీ సాయంత్రం అట్టహాసంగా జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. సీఎం స్టాలిన్‌ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో 44వ చెస్‌ ఒలంపియాడ్‌ పోటీలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.  


29న మహాబలిపురానికి ప్రధాని

ఈ నెల 29వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహాబలిపురానికి వెళ్ళి అక్కడ చెస్‌ పోటీలను ప్రారంభిస్తారు. 28, 29 తేదీల్లో జరిగే ప్రారంభ వేడుకలకు ప్రధానిని ఆహ్వానించేందుకు సీఎం స్వయంగా ఢిల్లీ వెళ్ళనున్నారు. సీఎం వెంట మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా హస్తినకు వెళ్ళనున్నారు. కాగా గురువారం స్టాలిన్‌ కరోనా కారణంగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. అయితే ఆయన త్వరలోనే కోలుకుంటారని, అనంతరం ఆయన ఢిల్లీ వెళ్లి లాంఛనంగా ప్రధానిని ఆహ్వానిస్తారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 

Updated Date - 2022-07-15T13:02:05+05:30 IST