Cm Stalinపై కేసుల రద్దు

ABN , First Publish Date - 2022-01-22T15:37:43+05:30 IST

గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో స్టాలిన్‌పై పెట్టిన 18 కేసులు రద్దు చేస్తూ మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అన్నాడీఎంకే ప్రభుత్వంపై విమర్శలు, టెండర్లలో అవినీతి, వాకీ టాకీల కొనుగోలులో అవినీతిపై

Cm Stalinపై కేసుల రద్దు

పెరంబూర్‌(చెన్నై): గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో స్టాలిన్‌పై పెట్టిన 18 కేసులు రద్దు చేస్తూ మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అన్నాడీఎంకే ప్రభుత్వంపై విమర్శలు, టెండర్లలో అవినీతి, వాకీ టాకీల కొనుగోలులో అవినీతిపై ప్రకటనలు చేసిన అప్పటి ప్రతిపక్ష నేత స్టాలిన్‌కు వ్యతిరేకంగా 18 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ ప్రకటనలు ప్రచురించిన ‘మురసోలి’ ఎడిటర్‌ సెల్వం, ‘కలైంజర్‌’టీవీ ఎడిటర్‌ తిరుమావేలన్‌ తదితరులపై కూడా కేసులు నమోదయ్యాయి. ఎంపీ, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులు విచారిస్తున్న ప్రత్యేక న్యాయస్థానంలో ఈ కేసుల విచారణ జరుగుతుండగా, తనపై ఉన్న కేసులు రద్దుచేయాలని సీఎం స్టాలిన్‌ దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన ప్రత్యేక కోర్టు కేసుల విచారణపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో, అధికారం చేపట్టిన డీఎంకే ప్రభుత్వం, గత ప్రభుత్వ హయాంలో పార్టీ నేతలపై ఉన్న అన్ని కేసులు ఉపసంహరించుకున్నట్లు జీవో జారీచేసింది. అలాగే, స్టాలిన్‌పై ఉన్న 18 కేసులను కూడా ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది. తనపై ఉన్న కేసులు రద్దుచేయాలని కోరుతూ స్టాలిన్‌ దాఖలుచేసిన పిటిషన్‌ను గతంలో విచారించిన జడ్జి నిర్మల్‌కుమార్‌, స్టాలిన్‌పై ఉన్న 18 క్రిమినల్‌ కేసులు ఉపసంహరించుకుంటున్న అఫిడివిట్‌ దాఖలుచేయాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేసి, తీర్పు వాయిదావేశారు. దీంతో, ఈ కేసులపై న్యాయమూర్తి నిర్మల్‌కుమార్‌ శుక్రవారం వెలువరించిన తీర్పులో, కేసుల ఉపసహరించుకున్నట్లు ప్రభుత్వం సమర్పించిన అఫిడివిట్‌, స్టాలిన్‌ తరఫున దాఖలైన పిటిషన్‌ను పరిగణలోకి తీసుకొని, ఆయనపై ఉన్న కేసులు రద్దు చేస్తున్నట్లు తీర్పు చెప్పారు.

Updated Date - 2022-01-22T15:37:43+05:30 IST