సిటీ బస్సులో Cm Stalin సందడి

ABN , First Publish Date - 2022-05-08T13:52:40+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సిటీ బస్సెక్కి సందడి చేశారు. శనివారం ఉదయం మంత్రులతోపాటు శాసనసభ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన పయనమయ్యారు. మైలాపూరు రాధాకృష్ణ

సిటీ బస్సులో Cm Stalin సందడి

చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సిటీ బస్సెక్కి సందడి చేశారు. శనివారం ఉదయం మంత్రులతోపాటు శాసనసభ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన పయనమయ్యారు. మైలాపూరు రాధాకృష్ణన్‌ రోడ్డులో వెళుతున్నప్పుడు ఉన్నట్టుండి కారులో నుంచి కిందకు దిగి ఆ చోట నిలిచి వున్న 29సీ సిటీ బస్సులో కాసేపు ప్రయాణం చేసి వస్తానని మంత్రులకు తెలిపారు. దీంతో మంత్రులంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత స్టాలిన్‌ ఆ వైట్‌బోర్డు సిటీ బస్సెక్కారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఉన్నట్టుండి బస్‌ ఎక్కడంతో ప్రయాణికులు పెద్దపెట్టున సీఎం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో ఆ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలను ఆయన ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా మహిళలు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. ఆ మహిళలతో స్టాలిన్‌ మాట్లాడుతూ తన ఏడాది పాలన ఎలా వుందంటూ ప్రశ్నించగానే.. చాలా సక్రమంగా పరిపాలిస్తున్నారంటూ.. వారంతా బదులిచ్చారు. తమ ప్రాంతాల్లో వైట్‌బోర్డు సిటీ బస్సులు తక్కువగా తిరుగుతున్నాయని, వీటి సంఖ్యను పెంచాలని మహిళలు ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఆ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటానని ఆయన బదులిచ్చారు. కాసేపు ప్రయాణించాక ఆయన బస్సు దిగి కారులో అసెంబ్లీకి బయలుదేరారు. ఈ విషయాన్ని స్టాలిన్‌ శాసనసభలో ప్రస్తావిస్తూ 29సీ సిటీ బస్సును తన జీవితంలో ఎన్నడూ మరచిపోలేనని చెప్పారు. ఆ బస్సులోనే తాను రోజూ గోపాలపురం నుంచి  పాఠశాలకు వెళ్లేవాడినని చెప్పారు. స్టెల్లా మేరీస్‌ కాలేజీ బస్టాపులో ఆ బస్సెక్కి స్టెర్లింగ్‌ రోడ్డు దాకా వెళ్ళి అక్కడి దిగి నడచుకుంటూ చెట్‌పట్‌లోని పాఠశాలకు వెళ్లేవాడినని తెలిపారు. శనివారం ఉదయం ఆ బస్సులో తాను ప్రయాణించినప్పుడు మహిళలు తమకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడం వల్ల నెలకు సగటున రూ.600 నుంచి రూ.850 వరకూ ఆదా అవుతోందని కూడా చెప్పారని స్టాలిన్‌ తెలిపారు.


కరుణ సమాధి వద్ద నివాళి

డీఎంకే ప్రభుత్వం ఏడాదిపాలన ముగిసిన సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ సహచర మంత్రులతో కలిసి మెరీనాబీచ్‌లోని దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సమాధి వద్ద నివాళులర్పించారు. అంతకు ముందు ఆయన గోపాలపురంలోని కరుణ నివాసగృహానికి వెళ్ళారు. కరుణానిధి చిత్రపటానికి పూలమాలవేసి కుటుంబసభ్యులతోపాటు అంజలి ఘటించారు. ఆ తర్వాత తన మాతృమూర్తి దయాళు అమ్మాళ్‌ ఆశీస్సులందుకున్నారు. ఆ సందర్భంగా స్టాలిన్‌ ఆమెను ఆప్యాయంగా ముద్దాడారు. ఏడాదిపాలన పూర్తయిన సందర్భంగా గోపాలపురం నివాసగృహంలోనూ, అసెంబ్లీ భవనంలోనూ విద్యుద్దీపాలంకరణ చేశారు.



Read more