మీ ఇంటికొస్తే భోజనం పెడతారా?

ABN , First Publish Date - 2022-03-18T16:35:35+05:30 IST

మీ ఇంటికి వస్తే భోజనం పెడతారా అని రాష్ట్ర ముఖ్యమంత్రే అడగడంతో ఆ విద్యార్థినుల ఆనందానికి అవధులు లేవు. ఈ సంఘటన గురువారం ఆవడి ప్రాంతంలో

మీ ఇంటికొస్తే భోజనం పెడతారా?

                         - సుగాలీ విద్యార్థినులతో స్టాలిన్‌


పెరంబూర్‌(చెన్నై): మీ ఇంటికి వస్తే భోజనం పెడతారా అని రాష్ట్ర ముఖ్యమంత్రే అడగడంతో ఆ విద్యార్థినుల ఆనందానికి అవధులు లేవు. ఈ సంఘటన గురువారం ఆవడి ప్రాంతంలో జరిగింది.  ఆవడి ప్రాంతానికి చెందిన మంత్రి నాజర్‌ గురువారం ఉదయం తన నియోజకవర్గం పరిధిలో నివసిస్తున్న సుగాలీల కుటాంబాల దగ్గరకు వెళ్లి అక్కడ వివిధ పాఠశాలలు, కళాశాలలలో చదువుతున్న విద్యార్థినులను కలుసుకున్నారు. ఆ సందర్శంగా వారు సీఎం స్టాలిన్‌తో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేపట్టారు. కొద్ది సమయానికి వీడియోకాల్‌ చేసిన స్టాలిన్‌ను చూసి ఆ విద్యార్థినులంతా సంబరపడ్డారు. బుధవారం సచివాలయంలో తమ ప్రాంతానికి చెందిన సుగాలీ విద్యార్థినులతో మాట్లాడటం తమకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. అదే సమయంలో తమ ఇళ్ళకు వస్తే చాలా సంతోషిస్తామన్నారు. విద్యార్థినుల కోరికను మన్నించిన స్టాలిన్‌ శుక్రవారం నుంచి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు జరుగనుండటంతో వెంటనే రాలేనని, వారంలోగా ఆవడికే వచ్చి వారిని కలుసుకుంటానని చెప్పారు. వెంటనే ఆ విద్యార్థినులు నిజంగా మా ఇళ్ళకు వస్తారా అని ప్రశ్నించగా ‘తప్పకుండా మీ ఇళ్ళకు వస్తాను. వస్తే భోజనం పెడతారా?’ అని నవ్వుతూ స్టాలిన్‌ అడిగారు. వెంటనే విద్యార్థినులు తప్పకుండా రండి మీకు రుచికరమైన మాంసాహార భోజనమే పెడతామని బదులిచ్చారు. తమ ఉన్నత చదువులకు వీలుగా తమ కులాలను ఎంబీసీల జాబితా నుంచి తొలగించి ఎస్టీల్లో చేర్చాలని విద్యార్థినులు కోరారు. ఆ విషయమై న్యాయనిపుణులతో మాట్లాడి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని స్టాలిన్‌ వారికి తెలిపారు. ముఖ్యమంత్రి తమతో మాట్లాడటంతో మంత్రి నాజర్‌కు విద్యార్థినులు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2022-03-18T16:35:35+05:30 IST