Chief Minister: వరుస పర్యటనలతో స్టాలిన్‌ బిజీబిజీ

ABN , First Publish Date - 2022-09-09T13:47:51+05:30 IST

తిరునల్వేలి జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్‌(Chief Minister MK Stalin) గురువారం రూ.330 కోట్లతో చేపట్టిన వివిధ రకాల

Chief Minister: వరుస పర్యటనలతో స్టాలిన్‌ బిజీబిజీ

- రూ.330 కోట్లతో అభివృద్ధి పనుల ప్రారంభం 

- తిరునల్వేలి జిల్లాలో పలు పథకాలకు శంకుస్థాపన


అడయార్‌(చెన్నై), సెప్టెంబరు 8: తిరునల్వేలి జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్‌(Chief Minister MK Stalin) గురువారం రూ.330 కోట్లతో చేపట్టిన వివిధ రకాల అభివృద్ధి పనులను ప్రారంభించారు. అదేవిధంగా మరికొన్ని అభివృద్ధి నిర్మాణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. స్మార్ట్‌ సిటీలో భాగంగా తిరునల్వేలిలో పూర్తయిన పనులను కూడా ఆయన ప్రారంభించారు. బుధవారం కన్నియాకుమారి వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో సీఎం స్టాలిన్‌ పాల్గొన్నారు. అక్కడ నుంచి ఆయన నెల్లైకు చేరుకుని రాత్రి నెల్లై వాషర్‌మెన్‌పేటలోని పర్యాటక శాఖ అతిథిగృహంలో బస చేశారు. గురువారం ఉదయం 9.30 గంటలకు సీఎం  నెల్లై పర్యటన ప్రారంభమైంది. అతిథి గృహం నుంచి ప్రభుత్వ వైద్య కళాశాల వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేరకు వెయ్యిమంది సంగీత కళాకారులతో భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ స్వాగత ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం 9.45 గంటలకు ప్రభుత్వ వైద్య కాలేజీ గ్రౌండ్‌కు చేరుకున్న ఆయన రూ.330.30 కోట్లతో పూర్తి చేసిన అభివృద్ధి నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే పలువురు లబ్ధిదారులకు సంక్షేమ సహాయాలను పంపిణీచేశారు. ఈ సందర్భంగా బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన పాలంయకోట పోలీస్‌ స్టేషన్‌ను కూడా అప్పటి నిర్మాణం చెక్కుచెదరకుండా ఆధునీకరించగా, దాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇదే కార్యక్రమంలో పలువురు హిజ్రా(Hijra)లకు స్వయం ఉపాధి పథకం కింద రుణాలు, 78 మంది గిరిజన కుటుంబాలకు ఇళ్ళపట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌ అప్పావు, పట్టణాభివృద్ధి శాఖామంత్రి కేఎన్‌ నెహ్రూ, బీసీ సంక్షేమ శాఖామంత్రి రాజకన్నప్పన్‌, రెవెన్యూ మంత్రి కేకేఎ్‌సఎ్‌సఆర్‌ రామచంద్రన్‌, పరిశ్రమల శాఖామంత్రి తంగం తెన్నరసు, స్త్రీశిశు సంక్షేమ శాఖామంత్రి గీతా జీవన్‌, పశుసంవర్థక శాఖామంత్రి అనితా రాధాకృష్ణన్‌, ఐటీ మంత్రి మనో తంగరాజ్‌, ప్రభుత్వ ఉన్నతాధికారులు, నెల్లై జిల్లా కలెక్టర్‌ తదితరులు పాల్గొన్నారు. నెల్లైలో తన పర్యటన పూర్తిచేసిన సీఎం స్టాలిన్‌.. లింగంపేటలో కొత్తగా పారిశ్రామికవాడ నిర్మించేందుకు నిధుల కేటాయింపుపై ప్రకటన చేశారు. ఆ తర్వాత కోవిల్‌పట్టి ప్రభుత్వ వైద్య కాలేజీలో కొత్తగా నిర్మించిన భవనాలను ఆయన ప్రారంభించి, అక్కడే ఉన్న అగ్గిపెట్టల తయారీ పరిశ్రమను పరిశీలించారు. ఇక్కడ పనిచేసే కార్మికులతో ఆయన మాట్లాడారు. అక్కడ నుంచి విరుదునగర్‌ బయలుదేరి వెళ్ళారు.


1400 మందితో భద్రత 

సీఎం స్టాలిన్‌ జిల్లా పర్యటనను పురస్కరించుకుని జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర శాంతిభద్రల పరిరక్షణ విభాగం ఏడీజీపీ తామరైకన్నన్‌ పర్యవేక్షణలో భద్రతా చర్యలు చేపట్టారు. ఈ భద్రత కోసం దాదాపు 1400 మంది పోలీసులను వినియోగించారు. వీరితో పాటు నెల్లై పోలీస్‌ కమిషనర్‌; డీఐజీలు, ఎస్పీలు, తూత్తుక్కుడి, తెన్‌కాశి, విరుదనగర్‌, రామనాథపురం, మదురై, తేని, దిండిగల్‌, తిరుపూరు, తిరుచ్చితో సహా 12 జిల్లాల నుంచి దాదాపు 600 మంది పోలీసులను సీఎం పర్యటన  కోసం వినియోగించారు. సీఎం పాల్గొన్న సభా ప్రాంగణాన్ని పోలీసులు పూర్తిగా తమ నియంత్రణలో ఉంచుకున్నారు.  పోలీసు జాగిలాలు, బాంబు స్క్వాడ్‌తో కార్యక్రమం జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 

Updated Date - 2022-09-09T13:47:51+05:30 IST