సార్‌... మీ ఆరోగ్య రహస్యం చెప్పరూ ?

Sep 22 2021 @ 11:13AM

             - వాకింగ్‌కు వెళ్ళిన సీఎంను ప్రశ్నించిన మహిళ


చెన్నై: వాకింగ్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో కొంతమంది మహిళలు సరదాగా కబుర్లాడారు. రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలిస్తున్నారంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఎప్పుడూ ‘నిత్య మార్కండేయుడి (యువకుడి)లా కనిపిస్తున్న మీ ఆరోగ్యం వెనుక దాగిన రహస్యమేంటంటూ ప్రశ్నించారు. ఎరుపురంగు టీషర్టు, నలుపురంగు ఫ్యాంట్‌ ధరించి వాకింగ్‌కు వెళుతున్న స్టాలిన్‌తో మహిళలు కబుర్లాడుతున్న దృశ్యాలతో కూడిన వీడియో సామాజిక ప్రసారమాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. స్టాలిన్‌, ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యంతో కలిసి పోలీసుల హడావుడి లేకుండా అడయార్‌ థియోసాఫికల్‌ సొసైటీ ప్రాంగణంలో మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్ళారు. ఆ సమయంలో అక్కడ వాకింగ్‌ చేస్తున్న మహిళలు, యువకులు స్టాలిన్‌ను చుట్టుముట్టారు. ఓ మహిళ స్టాలిన్‌తో మాట్లాడుతూ ‘సార్‌ రెండేళ్లకు ముందు ఎయిర్‌పోర్ట్‌లో మిమ్మల్ని చూశాను. మీరు తప్పకుండా అధికారంలోకి వస్తారని చెప్పాను. మీరు అధికారంలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి పథకాన్ని నిశితంగా పరిశీలించి అమలు చేస్తున్నారు. ఈ పద్ధతి ఇలాగే కొనసాగాలి సార్‌’ అంటూ ప్రశంసించింది. అంతటితో ఆగకుండా ‘పుట్‌బాల్‌ పోటీలకు విదేశాలకు (స్పెయిన్‌కు) వెళ్ళిన మీ మనవడు విజయంతో తిరిగి రావాలని కోరుకుంటున్నాను. మీ మనవడు బీచ్‌లో శిక్షణ పొందుతున్నప్పుడు చూశాను’ అంటూ తెలిపింది. చివరగా ఆ మహిళ అడిగిన ప్రశ్న అందరినీ ఆశ్చర్యపరచింది. చివరగా ఓ ప్రశ్న అడగదలచానంటూ ఆ మహిళ ‘ఎప్పుడూ నిత్య మార్కండేయుడి(యువకుడి)లా ఎలా ఉండగలుగుతున్నారు సార్‌?’ అంటూ అడిగింది. అందుకు స్టాలిన్‌ నవ్వుతూ బదులిస్తూ తాను రోజూ వ్యాయామం చేస్తానని, ఆహారపు నియమాలు పాటిస్తానని చెప్పారు. వెంటనే అక్కడున్న మహిళలంతా మీరు ఎక్సర్‌సైజ్‌ చేసే వీడియోలను యూట్యూబ్‌లో చూశామంటూ చెప్పారు. ఆ తర్వాత అందరికీ నమస్కరించి స్టాలిన్‌ మంత్రి సుబ్రమణ్యంతో నడక సాగించారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.