ఇదేంది జగనన్నా!

ABN , First Publish Date - 2022-06-28T05:42:30+05:30 IST

సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటనతో సామాన్యులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ముందే నగరాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రహదారులకు ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో దుకాణాలు తెరవలేక వ్యాపారులు.. షాపులకు వెళ్లలేక వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. దీనికితోడు ప్రజలు ప్రధాన రోడ్డుపైకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆటోలనూ రానివ్వలేదు. దీంతో అత్యవసర పనుల మీద వచ్చేవారు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. భానుడి ప్రతాపానికి తట్టుకోలేక సీఎం సభకు వచ్చిన విద్యార్థిని, ఇద్దరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు.

ఇదేంది జగనన్నా!
శ్రీకాకుళంలో నిలిచిన ట్రాఫిక్‌

సీఎం పర్యటనకు తరలిపోయిన బస్సులు
ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
సభకు వచ్చి సొమ్మసిల్లిన బాలిక, మహిళలు
నగరంలో రోడ్డుకిరువైపులా బారికేడ్లు
రోడ్డుపైకి వచ్చేందుకు ప్రజలకు అవస్థలు
దుకాణాలు తెరవలేక వ్యాపారుల ఇక్కట్లు


కలెక్టరేట్‌, జూన్‌ 27:

సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటనతో సామాన్యులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ముందే నగరాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రహదారులకు ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో దుకాణాలు తెరవలేక వ్యాపారులు.. షాపులకు వెళ్లలేక వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. దీనికితోడు ప్రజలు ప్రధాన రోడ్డుపైకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆటోలనూ రానివ్వలేదు. దీంతో అత్యవసర పనుల మీద వచ్చేవారు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. భానుడి ప్రతాపానికి తట్టుకోలేక సీఎం సభకు వచ్చిన విద్యార్థిని, ఇద్దరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు.
--------------------

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లావాసులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. శ్రీకాకుళంలోని కేఆర్‌ స్టేడియంలో బహిరంగ సభకు భారీ జన సమీకరణకు వైసీపీ నాయకులు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వైసీపీ కార్యకర్తలతో  పాటు విద్యార్థులు, స్వయం శక్తి సంఘాల సభ్యులను 212 ఆర్టీసీ బస్సుల్లో తరలించారు. వీటితో పాటు వివిధ పాఠశాలలు, ప్రైవేటు సంస్థలకు చెందిన మరో 350 బస్సులను వినియోగించారు. దీంతో శ్రీకాకుళం, టెక్కలి, పలాస, తదితర డిపోల్లో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. శ్రీకాకుళంలో ట్రాఫిక్‌ ఆంక్షలతో ఆటోలు, ప్రైవేటు వాహనాలు కూడా సక్రమంగా నడవక పోవడంతో గమ్యస్థానాలు చేరుకునేందుకు నానా అవస్థలు ఎదుర్కొన్నారు. అధికారులు తమకు కనీస ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సీఎం బహిరంగ సభకు దూరంగా బస్సులు, ప్రైవేటు వాహనాలను నిలిపివేశారు. అక్కడ నుంచి స్వయం సహాయక సంఘాల సభ్యులు, విద్యార్థులను సభాస్థలికి కాలినకడనే తరలించారు.

సొమ్మసిల్లిపోయారు
సీఎం పర్యటనలో భానుడి ప్రభావం తట్టుకోలేక ఓ విద్యార్థిని, మరో ఇద్దరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. పక్కన ఉన్నవాళ్లు, పోలీసులు సపర్యలు చేసి.. వారిని నీడ ప్రదేశానికి తరలించారు.  మిట్ట మధ్యాహ్నం బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో చాలా మంది మండుటెండలో ఇబ్బందులు పడ్డారు. టెంట్లు సక్రమంగా లేకపోవడం, నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.  కొంతమంది చెట్లు, వాహనాల నీడలో తలదాచుకున్నారు. మరికొంతమంది ప్రభుత్వ పురుషులు డిగ్రీ కళాశాల ప్రాంగణానికి చేరారు. కేఆర్‌ స్టేడియంలోకి ప్రవేశించేందుకు కూడా ఇబ్బందులు ఎదురవడంతో కొంతమంది అసంతృప్తితో వెనుదిరిగారు. ఉదయం 11 గంటల తర్వాత సీఎం బహిరంగ సభ వద్దకు చేరుకోగా.. ఆయనను చూడకుండానే కొంతమంది వెనక్కి వెళ్లిపోయారు.

నగరం.. అష్ట దిగ్బంధం
శ్రీకాకుళం నగరం.. అష్టదిగ్బంధమైంది. సోమవారం వేకువజాము నుంచే నగరాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ నుంచి 80 అడుగుల రహదారి, పాత బస్టాండ్‌, ఏడురోడ్ల జంక్షన్‌, డేఅండ్‌ నైట్‌ జంక్షన్‌ మీదుగా కోడి రామ్మూర్తి స్టేడియం వరకూ రహదారులకు ఇరువైపులా భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలు రహదారులపైకి రాకుండా అడ్డుకున్నారు. ట్రాఫిక్‌ను సైతం ఎక్కడికక్కడే మళ్లించారు. ఆటోలను అడ్డుకున్నారు. దీంతో అత్యవసర పనుల నిమిత్తం వచ్చేవారికి అవస్థలు తప్పలేదు. రహదారులకిరువైపులా బారికేడ్లతో దుకాణాలు మూతపడ్డాయి. వ్యాపారులకు ఇబ్బందులు తప్పలేదు.
 

Updated Date - 2022-06-28T05:42:30+05:30 IST