26న సీఎం రాక

ABN , First Publish Date - 2022-08-19T06:30:12+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఈనెల 26న నగరానికి రానున్నారు.

26న సీఎం రాక

విశాఖపట్నం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఈనెల 26న నగరానికి రానున్నారు. ప్లాస్టిక్‌ నిషేధం కోసం మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) చేపడుతున్న కార్యక్రమాలు, బీచ్‌క్లీనింగ్‌లో ఆయన పాల్గొననున్నారు. అదే సందర్భంగా బీచ్‌లో లేదా ఇండోర్‌ ఆడిటోరియంలో సమావేశం నిర్వహణకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు.


సెల్ఫీ హాజరు 5ులోపే...

ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని ఉపాధ్యాయులు

ఉపాధ్యాయ సంఘ నేతలతో అమరావతిలో మంత్రి బొత్స సమావేశం

చర్చలు 27కు వాయిదా

అప్పటివరకూ ఇదే పరిస్థితి


విశాఖపట్నం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల సెల్ఫీ హాజరుపై ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఈ విషయంలో ప్రభుత్వ ఆదేశాలను వరుసగా మూడో రోజు కూడా ఉపాధ్యాయులు పట్టించుకోలేదు. ఉమ్మడి జిల్లాలో కేవలం ఐదు శాతం మంది మాత్రమే గురువారం షేషియల్‌ స్కానింగ్‌ యాప్‌ ద్వారా సెల్ఫీ తీసుకుని హాజరు వేయించుకున్నట్టు సమాచారం. సొంత ఫోన్లతో సెల్ఫీ తీసుకుని హాజరు వేయాలన్న ఉత్తర్వులను రాష్ట్రవ్యాప్తంగా టీచర్లు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి రెండు రోజుల మాదిరిగానే గురువారం కూడా టీచర్లు సెల్ఫీ హాజరును బహిష్కరించారు. తొలి రెండు రోజులు పనిచేయని ఫేషియల్‌ స్కానింగ్‌ యాప్‌ గురువారం కొంత వరకు పనిచేసినా ఉపాధ్యాయులు దాని జోలికివెళ్లలేదు.  యథావిధిగా గతంలో మాదిరిగా మిగిలిన యాప్‌లలో విద్యార్థుల హాజరు, ఇతర అంశాలను అప్‌లోడ్‌ చేశారు. ఇదిలావుండగా ప్రభుత్వ నిర్ణయంపై ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత రావడంతో విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం అమరావతిలో ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. అయితే మంత్రితో చర్చలు అసంపూర్తిగా ముగిశాయని, ఈనెల 27కు వాయిదా పడ్డాయని జిల్లాలకు సమాచారం అందింది. అప్పటివరకు సెల్ఫీ యాప్‌ డౌన్‌లోడ్‌, రిజిస్ట్రేషన్‌, హాజరుపై ఏ విషయం తేలదని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. విద్యా శాఖ అధికారుల నుంచి గట్టిగా ఒత్తిడి వస్తే ఆందోళన చేయాలన్న ఆలోచనతో కొన్ని సంఘాలు ఉన్నాయి. 


‘హయగ్రీవ’ తవ్వకాలను పరిశీలించిన గనుల శాఖ

తవ్విన మట్టిని అనుమతి లేకుండా తరలిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరిక


విశాఖపట్నం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఎండాడలో ‘హయగ్రీవ’ సంస్థకు కేటాయించిన కొండ ప్రాంతాన్ని గనుల శాఖ విజిలెన్స్‌ ఏడీ వంశీధర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం గురువారం పరిశీలించింది.   నిబంధనల మేరకు తవ్విన మట్టిని బయటకు తరలించాలనుకుంటే అనుమతి తీసుకోవాలని అక్కడున్న సిబ్బందికి సూచించింది. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవలసి వుంటుందని హెచ్చరించినట్టు తెలిసింది. 


సెయిల్‌లో ఉక్కు విలీనం కోసం యత్నిస్తా

స్టీల్‌ ప్లాంట్‌ అధికారుల సంఘానికి ఎమ్మెల్సీ మాధవ్‌ హామీ


విశాఖపట్నం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): అందరి ప్రయోజనాలు కాపాడుతూ విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా విలీనం కోసం ప్రయత్నిస్తామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ హామీ ఇచ్చారు. ఆయన గురువారం స్టీల్‌ప్లాంటుకు వెళ్లి అధికారుల సంఘం సమావేశంలో మాట్లాడారు. గతంలో బీహెచ్‌పీవీని భెల్‌లో, హిందూస్థాన్‌ షిప్‌యార్డును డిఫెన్స్‌లో విలీనం చేశారని, అలాగే విశాఖ ఉక్కును సెయిల్‌, ఎన్‌ఎండీసీలలో విలీనం చేయాలని అధ్యక్ష, కార్యదర్శులు కె.చంద్రరావు, కేవీడీ ప్రసాద్‌ కోరారు. దానికి మాధవ్‌ స్పందించారు. ఈ రకమైన విలీనం వల్ల ఉభయులకూ మేలు జరుగుతుందని, విశాఖ ఉక్కుకు ముడి ఇనుము కొరత తీరుతుందని, సెయిల్‌కు ఉత్పత్తి లక్ష్యాలు చేరుకోవడం, తీరప్రాంత సౌలభ్యం వుండడం వల్ల విదేశాలకు ఎగుమతులు పెంచుకోవచ్చునని విశ్లేషించారు. ఇవన్నీ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి అందరికీ ఆమోదయోగ్యమైన విలీనం కోసం ప్రయత్నిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే దీర్ఘకాలంగా అమలు కాని వేతన ఒప్పందం, పదోన్నతుల ప్రక్రియ గురించి కూడా ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు సీహెచ్‌ వెంకటేశ్వరరావు, కోశాధికారి లోకోఏశ్‌, పూర్వపు అధికారులు అంతా పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-19T06:30:12+05:30 IST