CM YS Jagan ఆదేశాలు బేఖాతర్‌..!

ABN , First Publish Date - 2022-02-15T16:42:58+05:30 IST

ఒక సమస్యను పరిష్కరించమని చెప్తే మరో సమస్యను తెచ్చిపెట్టిన...

CM YS Jagan ఆదేశాలు బేఖాతర్‌..!

  • నిండుకుండలా దర్శనమిస్తున్న కుంటతిప్ప డ్రెయిన్‌
  • మురుగు పారుదల కాకపోవడమే ప్రధాన కారణం!
  • స్పందనలో వీఎంసీ కమిషనర్‌కు గ్రామస్థుల ఫిర్యాదు

విజయవాడ/గుణదల : ఒక సమస్యను పరిష్కరించమని చెప్తే మరో సమస్యను తెచ్చిపెట్టిన అధికారుల తీరుతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే ఆటోనగర్‌.. ఎన్‌టీఆర్‌ సర్కిల్‌ నుంచి వచ్చే మురుగునీరంతా కుంటతిప్ప డ్రెయిన్‌ ద్వారా రామవరప్పాడు, ప్రసాదంపాడు గ్రామాల మీదుగా రైవస్‌ కాల్వలోకి చేరుకుంటుంది. రెండు నెలల క్రితం ఈ మురుగునీటి ప్రవాహం నుంచి వచ్చే దుర్వాసన ప్రసాదంపాడు ఎస్‌ఈఆర్‌ సెంటర్‌ వద్ద సీఎం కాన్వాయ్‌లో ఉన్న సీఎం జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి వెళ్లింది. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని క్రిస్మస్‌ పండుగకు ముందుగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో సీఎంవో కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు, కలెక్టర్‌, వీఎంసీ కమిషనర్‌, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి హుటాహుటిన కుంటతిప్ప డ్రెయిన్‌ వద్దకు వచ్చి పరిశీలించారు. అనంతరం కుంటతిప్ప డ్రెయిన్‌ నుంచి దుర్వాసన ప్రబలకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. 


అందులో భాగంగానే శక్తి కల్యాణమండపం వద్ద కుంటతిప్ర డ్రెయిన్‌లోకి చెత్త చెదారం చేరకుండా ఇనుప జాలీని డ్రైయిన్‌లో లాకుల తరహాలో అమర్చారు. దీంతో డ్రెయిన్‌లో నీరు సజావుగా పారుదల కావటమే కాకుండా డ్రైయిన్‌ నిండుకుండలా దర్శనమిస్తోంది. ఇదే సమయంలో డ్రెయిన్‌లోని మురుగునీరంతా డ్రెయిన్‌కు పక్కనే ఉన్న ఖాళీగా ఉన్న నివేశన స్థలాల్లోకి వచ్చి చేరడంతో ప్రసాదంపాడులోని ఖాళీ స్థలాలు చెరువులను తలపిస్తున్నాయి. అండర్‌గ్రౌండ్‌ వాటర్‌ కలుషితం అవుతుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


దుర్వాసన ఎక్కువై నివాస యోగ్యతకు భంగంగా ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి విజ్ఞప్తి మేరకు సర్పంచ్‌ సర్నాల గంగారత్నం, ఉప సర్పంచ్‌ గూడవల్లి నరసయ్య వీఎంసీ కమిషనర్‌ను సోమవారం కలిసి స్పందనలో ఫిర్యాదు చేశారు. శక్త కల్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన లాకులను పరిశీలించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి మురుగునీరు సజావుగా పారుదల అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరినట్టు గూడవల్లి నరసయ్య విలేకరులకు తెలిపారు.

Updated Date - 2022-02-15T16:42:58+05:30 IST