సీఎంల పోటీ.. రాష్ట్రాలు దివాలా!

ABN , First Publish Date - 2021-07-25T08:49:57+05:30 IST

హుజూరాబాద్‌ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నదా? అంటే అవునని తెలంగాణలో ఎవరిని అడిగినా చెబుతారు....

సీఎంల పోటీ.. రాష్ట్రాలు దివాలా!

హుజూరాబాద్‌ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నదా? అంటే అవునని తెలంగాణలో ఎవరిని అడిగినా చెబుతారు. మంత్రివర్గం నుంచి తాను బర్తరఫ్‌ చేసిన ఈటల రాజేందర్‌ను ఓడించడానికై ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేయడానికి సైతం కేసీఆర్‌ సిద్ధపడుతున్నారా? తెలంగాణపై తన పట్టు సడలుతోందని ఆయన భయపడుతున్నారా? గజ్వేల్‌ మినహా మిగతా నియోజకవర్గాల్లో కూడా ఉపఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారా? వంటి ప్రశ్నలకూ అవుననే సమాధానం లభిస్తోంది. దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల తర్వాత ఏ ఎన్నిక వచ్చినా కేసీఆర్‌ హైరానా పడుతున్నారు. ఆకాశమే హద్దుగా హామీలు ఇస్తున్నారు. సరికొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి బాటలోనే కేసీఆర్‌ కూడా సంక్షేమ పథకాల కోసం అప్పులు చేస్తూ ధనిక రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చుతున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం తనకు వ్యతిరేకంగా ఉందన్న అనుమానం కేసీఆర్‌లో ఏర్పడటం వల్లనే ఆందోళన చెందుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఏడాదిన్నరపాటు పరిపాలనను, పార్టీని గాలికి వదిలేయడం వల్లనే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని టీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి. దుబ్బాక ఫలితం తర్వాత తత్వం బోధపడటంతో కేసీఆర్‌ ఒక్కసారిగా మేలుకున్నారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌కు ఉపఎన్నిక జరగనుండడంతో ‘దళితబంధు’ పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలను వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని ప్రకటించారు. ముందుగా హుజూరాబాద్‌లోని ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు పంచుతామని ప్రకటించారు. ఇందుకోసం దాదాపు 2వేల కోట్ల రూపాయలు అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అంటే ఒక్క హుజూరాబాద్‌లో గెలవడం కోసం ప్రభుత్వ సొమ్ముతో దళితుల పేరిట ఓట్ల కొనుగోలుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని భావించాలి. స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడం కోసం ప్రజాధనాన్ని ఇలా ఖర్చు చేయడం ఇదే ప్రథమం కాబోలు. ఉప ఎన్నికలు లేదా సాధారణ ఎన్నికల్లో ఓటర్లకు రాజకీయపార్టీలు డబ్బు పంచడం చాలాకాలంగా జరుగుతోంది. ఇప్పుడు అది కూడా పోయి ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా నగదు బదిలీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి  తన ఓటుబ్యాంకును సుస్థిరం చేసుకోవడానికై సంక్షేమం పేరిట డబ్బు పంపిణీ మొదలుపెట్టారు. ఇప్పుడు అదే బాటలో కేసీఆర్‌ నడుస్తున్నారు. గ్రేటర్‌ ఎన్నికల సమయంలో మొదటిసారిగా వరద సహాయం పేరిట ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయల పంపకానికి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. ఎన్నికల కోడ్‌ కారణంగా కొంతమందికే సహాయం అందించిన కేసీఆర్‌...  ఎన్నికల తర్వాత మిగతా కుటుంబాలకు సహాయం చేస్తానని నమ్మబలికారు. ఎన్నికలు జరిగాయి. టీఆర్‌ఎస్‌కు ఆశించిన విజయం లభించలేదు. అయినా మేయర్‌ పీఠం సొంతం చేసుకున్నారు. అయితే, పదివేల సహాయం గురించి మాత్రం ప్రభుత్వం మరిచిపోయింది. అంటే, ఎన్నికల అవసరం తీరిపోయింది కనుక ప్రభుత్వానికి ఆ విషయం గుర్తుకు రాలేదు. గ్రేటర్‌ను  హస్తగతం చేసుకోవాలన్న ఉద్దేశంతో వరద సహాయం పేరిట ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పంచిపెట్టడానికి కేసీఆర్‌ సిద్ధపడ్డారు. అయినా పరాభవమే మిగిలింది. ఇప్పుడు హుజూరాబాద్‌కు ఉపఎన్నిక రాబోతున్నది. క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా లేదనీ, ఈటల రాజేందర్‌ వైపే మొగ్గు ఉందనీ నివేదికలు రావడంతో కేసీఆర్‌లో చురుకు పుట్టింది. మంత్రివర్గం నుంచి తాను బర్తరఫ్‌ చేసిన రాజేందర్‌ను ఓడించలేకపోవడాన్ని మించిన పరాభవం ఏముంటుందని మధనపడుతూ తన మస్తిష్కానికి పదును పెట్టారు. అంతే... దళితబంధు పథకం పుట్టుకొచ్చింది. హుజూరాబాద్‌లో దళితులు అధికంగా ఉండటమే ఇందుకు కారణం కావొచ్చు. ఒక్కో దళిత కుటుంబానికి పదిలక్షలు వంతున పంచిపెట్టి వారి జీవితాలను మార్చేస్తానని కేసీఆర్‌ ఘనంగా ప్రకటించారు. రాష్ట్రంలోని దళితులందరికీ దశలవారీగా ఈ పథకం అమలు చేస్తామనీ, ఇందుకోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని ఆయన తెలిపారు. అంతటితో దళిత జనోద్ధారకుడిగా ప్రశంసలు అందుకున్నారు. ఆ వెంటనే ముందుగా హుజూరాబాద్‌లోని దళితులందరికీ ఈ పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో ఆయన లక్ష్యం ఏమిటో బోధపడింది. కేసీఆర్‌ ప్రకటించిన పథకాన్ని రాష్ట్రంలోని దళితులందరికీ అమలు చేయాలంటే దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలు అవసరమని అధికారులు లెక్కలు కట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ పథకం అమలుకు సహకరించదు. అయినా హుజూరాబాద్‌ గండం గట్టెక్కాలన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి ఆ నియోజకవర్గానికే పరిమితం చేశారు. ఉపఎన్నిక తర్వాత కూడా రాష్ట్రంలోని మిగతా దళిత కుటుంబాలకు ఈ సహాయం అందుతుందా? లేక గ్రేటర్‌ హైదరాబాద్‌లోవలె ఆగిపోతుందా.. అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని సంతృప్తస్థాయిలో అమలు చేయాలంటే లక్షన్నర కోట్లు అవసరమని అధికారులు అంచనా వేసినందున... యేటా పదివేల కోట్లను ఇందుకోసం కేటాయించినా 15 ఏళ్లు పడుతుంది. అప్పటిదాకా ఈ పథకం ఉంటుందో, ఉండదో తెలియదు. కేవలం ఒక ఉపఎన్నికలో గెలుపు కోసం దళితులను అడ్డు పెట్టుకుని ప్రజాధనాన్ని పంచిపెట్టే తెంపరితనానికి కేసీఆర్‌ తెగబడ్డారు. అదేమంటే, దళితులకు సహాయం చేస్తామంటే కొందరికి కళ్లు మండుతున్నాయని ఆయన తిట్టిపోస్తారు. అయితే హుజూరాబాద్‌లోని దళితులకు మాత్రమే డబ్బు పంచితే రాష్ట్రంలోని దళితులందరూ బాగుపడతారా? అన్న ప్రశ్నకు కేసీఆర్‌ సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఓట్ల కోసం ఇలాంటి పథకాలకు రూపకల్పన చేసే నైతికత ముఖ్యమంత్రులకు ఉంటుందా? ఎన్నికల్లో గెలిచి అధికారంలో కొనసాగడం కోసం సహేతుకంకాని పథకాల అమలుకు పూనుకుని రాష్ర్టాలను దివాలా తీయించడం బాధ్యతారాహిత్యం కాదా? ఇంత చేసినా ఎన్నికల్లో గెలిచి తీరుతారన్న గ్యారంటీ ఉండదు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు ‘పసుపు–కుంకుమ’ పేరిట అప్పు చేసి మరీ పదివేల కోట్ల రూపాయలు పంచినా ఓడిపోయారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ఐదువందల కోట్ల రూపాయలు పంచినా టీఆర్‌ఎస్‌కు పరాభవమే మిగిలింది. అయినా ఆశ చావని ముఖ్యమంత్రులు సరికొత్త పథకాలకు రూపకల్పన చేస్తున్నారు. మిగులు నిధులతో ఈ పథకాలను అమలు చేస్తున్నారా? అంటే అదీ లేదు. అందినకాడికి అప్పులు చేసి ప్రజలకు సంక్షేమం పేరిట పంచిపెడుతున్నారు. 


ఏపీ బాటలోనే...

ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతున్నదో చూస్తున్నాం. అప్పుల కోసం ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి, అధికారులు ఢిల్లీకే పరిమితం అవుతున్నారు. రాష్ర్టాభివృద్ధి కార్పొరేషన్‌ పేరిట తెచ్చిన అప్పులను... అందుకోసం కాకుండా అమ్మఒడి, ఆసరా వంటి పథకాలకు ఖర్చు చేశామని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి స్వయంగా ప్రకటించారు. రాజకీయ లబ్ధి కోసం అప్పులు చేసి మరీ సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా రాష్ర్టాన్ని దివాలా తీయించే అధికారం ముఖ్యమంత్రులకు ఉంటుందా? అదేమంటే అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు కూడా అదేపని చేశారు కదా? అని ప్రశ్నిస్తున్నారు. అలా చేసినవాళ్లు ఇంటికి వెళ్లారు. అయినా అప్పులు చేయడంలో పోటీ పడటం ఏమిటి? ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉండేవాళ్లు చేస్తున్న అప్పులకు 15 నుంచి 20 సంవత్సరాల వ్యవధిలో తిరిగి చెల్లిస్తామని హామీలు ఇవ్వవచ్చా? భవిష్యత్తులో అప్పులు కూడా పుట్టని పరిస్థితి కల్పిస్తే తర్వాత వచ్చే ప్రభుత్వాల పరిస్థితి ఏమిటి? ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా అదే బాటను ఎంచుకోవడం దురదృష్టం. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ నిజంగానే ధనిక రాష్ట్రం. ఆ తర్వాత కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నిర్మాణానికి అప్పు చేశారు. ఇందులో తప్పు లేదు కూడా. ఈ నెలలోనే బాండ్ల వేలం ద్వారా ౩వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన కేసీఆర్‌ ప్రభుత్వం.. ఇప్పుడు హుజూరాబాద్‌లో దళితబంధు పథకం కోసం అవసరమైన 2వేల కోట్ల రూపాయలను ఎక్కడి నుంచి సమకూర్చుకుంటుంది? రాష్ట్రంలో మిగులు బడ్జెట్‌ ఉంటే బాండ్లు అమ్మి అప్పు చేయాల్సిన అవసరం ఉండదు కదా? హైదరాబాద్‌లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. వాటిని ఎప్పటిలోగా బాగు చేస్తారని హైకోర్టు ఈ మధ్యనే కేసీఆర్‌ ప్రభుత్వానికి తలంటింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కొన్నింటిని కేసీఆర్‌ ఇప్పటికీ అమలు చేయలేదు. ఈ దశలో దళితబంధు వంటి భారీ వ్యయంతో కూడిన పథకాలు అమలు చేయగలరా? హుజూరాబాద్‌లో దళితులు అధికంగా ఉంటున్నారని ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్న కేసీఆర్‌.. భవిష్యత్తులో ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గానికి ఉపఎన్నిక వస్తే వారి కోసం ఇంకో పథకం ప్రకటిస్తారా? నిజానికి రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌ పాతబస్తీలో ముస్లింలు అత్యంత పేదరికంలో ఉన్నారు. అలాగే వెనుకబడిన తరగతులకు చెందినవారిలో కూడా పలువురు పేదరికంలోనే ఉన్నారు. దళితుల అభ్యున్నతికి ముందుగా చర్యలు చేపట్టడంలో తప్పు లేదు. అయితే ప్రభుత్వం ప్రకటించే పథకాలు స్వయం ఉపాధి కల్పనకు దోహదపడాలే కానీ డబ్బులు పంచడం వంటి పథకాలు ఎలా మేలు చేస్తాయి? ఖాతాల్లో డబ్బులు వేసిన తర్వాత వాటిని ఖర్చు చేసే తీరుపై అధికారుల పర్యవేక్షణ ఉంటుందని కేసీఆర్‌ చెబుతున్నప్పటికీ ఆచరణలో ఏం జరుగుతుందో మనకు తెలియదా? ఒక వర్గం ఓట్ల కోసం ప్రయత్నిస్తే మిగతావర్గాలు దూరం కావన్న గ్యారంటీ ఉండదు. ఇంత చేసినా హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. హుజూరాబాద్‌లో లబ్ధి పొందడానికి దళితబంధును అక్కడ ముందుగా అమలు చేయాలని నిర్ణయించామని కేసీఆర్‌ బాహాటంగానే చెప్పుకొచ్చారు. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టుగా ఈటల రాజేందర్‌ను అంత హడావుడిగా తొలగించడం ఎందుకు? తొలగించితిరిపో... ఆయనపై ఆగమేఘాల మీద దర్యాప్తునకు ఆదేశించడం ఏల? ఈటల రాజీనామాను అంత హడావుడిగా ఆమోదింపజేయడం ఎందుకో? చివరకు ఉప ఎన్నికను కొనితెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఖజానాకు టెండర్‌ పెడుతున్నారు. ధనిక రాష్ట్రం పేద రాష్ట్రంగా తయారైతే అందుకు కేసీఆర్‌ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఓట్ల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు పంపిణీ చేసే విధానానికి ఎక్కడో ఒక దగ్గర చెక్‌ పడాల్సిందే. లేనిపక్షంలో ముఖ్యమంత్రులు ఒకరికొకరు పోటీ పడుతూ రాష్ర్టాలను దివాలా తీయిస్తారు.


ఇకనైనా ‘అమరావతి’

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వద్దాం. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బలు అలవాటుగా మారాయి. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరిట భారీ కుంభకోణం జరిగిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొదలుపెట్టి అధికారంలోకి వచ్చాక కూడా నానా హడావిడి చేశారు. ఒక అబద్ధాన్ని పదేపదే చెబితే నిజమని నమ్ముతారు. దీన్నే గోబెల్స్‌ ప్రచారం అంటారు. అమరావతి విషయంలో కూడా ఇదే జరిగింది. సుప్రీంకోర్టు తన తాజా తీర్పులో అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వంటి కుంభకోణం జరగలేదని స్పష్టం చేసింది. ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీల్లో ఫిర్యాదులు లేకపోయినా ప్రభుత్వం ఎందుకు తలదూర్చుతున్నదని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో... ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ విరుచుకుపడుతూ వచ్చినవారి నోళ్లు మూగబోయాయి. అయితే జగన్‌ అండ్‌ కో చేసిన దుష్ప్రచారం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టం జరిగింది. కుంభకోణం జరిగింది కనుకే అమరావతి ప్రజా రాజధాని కాకుండా పోయిందనీ, అందుకే మూడు రాజధానుల ఆలోచన చేస్తున్నామనీ జగన్‌ రెడ్డి ప్రకటించారు. అమరావతి ఉసురు తీసే వరకు అసత్య ప్రచారాన్ని అలుపెరగకుండా చేశారు. దీనివల్ల ప్రత్యక్షంగా నష్టపోయింది భూములిచ్చిన రైతులు, లేదా భూములు కొనుగోలు చేసినవారు మాత్రమే అనుకుంటే పొరపాటు. జగన్‌ అండ్‌ కో వైఖరి వల్ల రాష్ట్ర ప్రజలందరూ నష్టపోయారు. రాష్ర్టానికి రాజధాని లేకుండా అమరావతిని చంపేయడం వల్ల చంద్రబాబుకు వ్యక్తిగతంగా పోయింది ఏమీ లేదు. అమరావతిని అలాగే కొనసాగించి ఉంటే ప్రభుత్వానికి ఆదాయం పెరిగి ఉండేది. వేలాది మందికి ఉపాధి లభించేది. హైదరాబాద్‌లో ఖాళీ భూములకు కేసీఆర్‌ ప్రభుత్వం నిర్వహించిన వేలంలో ఎకరానికి 30 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయల వరకు ధర పలికింది. అమరావతిలో భూముల ధరలు కూడా ఈ స్థాయికి చేరి ఉండేవి. ఇప్పుడు అక్కడ భూములు కొనేవారే కరువయ్యారు. తన చర్య ద్వారా జగన్‌ రెడ్డి ఏం సాధించారో ఆయనను సమర్థించేవారు చెప్పాలి. అద్భుతమైన రాజధానిని నిర్మించుకునే అవకాశాన్ని రాష్ట్రం కోల్పోయింది. పదివేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన నిర్మాణాలు నిలిచిపోయి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇందుకు జగన్‌ అండ్‌ కో కారణం కాదా? ఎవరి మీదో కోపంతో ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి వ్యవహరిస్తున్నందున ‘ఆ ఎవరికి’ కూడా ఏమీ కాదు. ఇప్పటికైనా  ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని మార్చుకుని అమరావతినే రాజధానిగా కొనసాగించడం మంచిది. కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన విశాఖపట్టణాన్ని ఏమైనా ఉద్ధరించారా? అంటే అదీ లేదు. అధికార పార్టీ నాయకుల చర్యల కారణంగా అక్కడి ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఇదంతా ఎందుకోసం చేస్తున్నారో తెలియదు. ‘మనకు మేలు చేసే నాయకుడు ముఖ్యమంత్రిగా మనల్ని పాలిస్తున్నాడు. అతడిని మనం కాపాడుకోవాలి అనే ఆలోచన ప్రజలందరి మనసుల్లో నాటుకోవాలి’ అని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా సెలవిచ్చారు. అప్పులు చేసి పంచిపెట్టడమే జగన్‌ రెడ్డి చేస్తున్న మేలు అని అంటే చేయగలిగింది ఏమీ ఉండదు. ‘సలహాదారులు రాజకీయాలు మాట్లాడటం ఏమిటి? అయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా 50 నుంచి 60 మంది సలహాదారులను నియమించడం ఏమిటి?’ అని హైకోర్టు తాజాగా ఆక్షేపించింది. సున్నితంగా ఆలోచించే ఏ ప్రభుత్వమైనా ఇలాంటి సందర్భాలలో స్పందిస్తుంది. అయితే న్యాయ వ్యవస్థపై వ్యతిరేకత పెంచుకున్న జగన్‌ అండ్‌ కో అలాంటి వ్యాఖ్యలను తమకు ఇస్తున్న సర్టిఫికెట్‌లా భావిస్తోంది. దిక్కూదివాణం లేని అనేక కార్పొరేషన్లను సృష్టించి వాటికి చైర్మన్లను నియమించడాన్ని కూడా ఘనకార్యంగా జగన్‌ ప్రభుత్వం ప్రకటించుకుంది. అస్తిత్వం ఉండి, నిధులు ఉండే కార్పొరేషన్లకు చైర్మన్లుగా తన సామాజికవర్గానికి చెందినవారినే నియమించి... కనీసం కార్యాలయాలు కూడా లేని కార్పొరేషన్లను బడుగు బలహీన వర్గాల వారికి కట్టబెట్టారు. 


అంతర్గత ఆవేదన

ఈ విషయం అలా ఉంచితే, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పోకడలు నచ్చక అనేక మంది ఎమ్మెల్యేలు మధనపడుతున్నారు. ప్రజలు ఒత్తిడి తెస్తున్నా అభివృద్ధి పనులను మంజూరు చేయించలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. రహదారుల దుస్థితిపై తమను నిలదీస్తున్న ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదని వాపోతున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఒక సీనియర్‌ ఎమ్మెల్యే అతికష్టం మీద ఉపాధి హామీ నిధులతో రహదారి నిర్మాణానికి అనుమతి పొందారు. అయితే సదరు రహదారికి ఉద్దేశించిన నిధులను కూడా ప్రభుత్వం మళ్లించడంతో ఆయన ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులను ఎవరిని కదిలించినా ఇలాంటి ఉదంతాలు పుంఖానుపుంఖాలుగా చెబుతున్నారు. అయినా, సంక్షేమరాజ్యం బ్రహ్మాండంగా ఉందనీ, జగన్‌ పాలన అద్భుతమనీ కీర్తించేవాళ్లు కీర్తించుకోవచ్చు. అప్పులు పుట్టే పరిస్థితి కనపడకపోవడంతో జగన్‌ అండ్‌ కో ఇప్పుడు సరికొత్త ఎత్తుగడకు తెరతీయబోతోంది. తాము అప్పు చేసైనా సంక్షేమం కోసం ప్రజలకు డబ్బు పంపిణీ చేద్దామనుకుంటే చంద్రబాబు అండ్‌ కో అడ్డు పడుతున్నారని ప్రచారం మొదలుపెట్టారు. చంద్రబాబు చెబితేనో, మరొకరు ఫిర్యాదు చేస్తేనో కాదు... అర్హత ఉంటే అప్పులు అవే లభిస్తాయి. లెక్కకు మించి అప్పులు చేయడం వల్ల ఆ మొత్తాలను రికవరీ చేస్తామని కేంద్రం హెచ్చరించడంతో ఒకేసారి కాకుండా దశలవారీగా జమ చేసుకోవాల్సిందిగా కేంద్ర పెద్దలను ఒప్పించడానికై ఆర్థికమంత్రి బుగ్గన ఢిల్లీలో కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. వాస్తవాలను మరుగుపరిచి అబద్ధాలను ప్రచారం చేసుకుంటూ పోవడం ఎల్లకాలం ఫలించదు. ఏబీఎన్‌ చానెల్‌పై నమోదు చేసిన రాజద్రోహం కేసునే తీసుకుందాం! రెబల్‌ ఎంపీ రఘురామరాజుతో కలిసి మేం ఏదో కుట్ర చేశామని ప్రచారం చేశారు. దీనిపై మేం సుప్రీంకోర్టును ఆశ్రయించడం విదితమే. మా పిటిషన్‌కు కౌంటర్‌ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... మాపై నమోదు చేసిన కేసుకు బలం చేకూర్చే ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయింది. రఘురాజు నాకు ఏదో మెసేజ్‌ పంపారని ఆ కౌంటర్లో పేర్కొన్నారు. ఈ మెసేజ్‌కు నేను బదులు ఇవ్వలేదు కూడా! అలాగే ఏబీఎన్‌ ప్రతినిధి వెంకటకృష్ణకు, రఘురాజుకు మధ్య మెసేజ్‌లు పంపుకోవడం జరిగిందని ఏదో గొప్ప విషయం కనుక్కున్నట్టుగా చెప్పుకొచ్చారు. అందులో అభ్యంతరకరమైనవి ఏమిటో ఏలినవారే చెప్పాలి. ఇక రఘురాజు ప్రతిరోజూ ప్రభుత్వాన్ని తిట్టడానికై మరో చానెల్‌ యాజమాన్యం పది లక్షల యూరోలు (దాదాపు 8.8 కోట్ల రూపాయలు) ఆయనకు చెల్లించిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఆరోపణను రేపు సుప్రీంకోర్టులో రుజువు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంటుంది. 50 నుంచి 60 మంది సలహాదారులు, డజన్ల కొద్దీ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ఉండి కూడా జగన్‌ ప్రభుత్వం ఇలా తలాతోక లేని పనులు ఎందుకు చేస్తున్నదో తెలియదు! ప్రభుత్వంలో ఎవరూ కూడా మెదళ్లు వాడుతున్నట్టు కనిపించడం లేదు. తప్పులు ఎత్తిచూపే వారిపై బూతులతో విరుచుకుపడే బదులు ప్రభుత్వం తెలివిగా వ్యవహరించే సూచనలు చేస్తే బాగుంటుంది. రాజధాని భూములకు సంబంధించిన ఒక కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది... తమకు ఇప్పుడే తెలివి వచ్చిందని న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అదీ పరిస్థితి!


ఈ విషయం అలావుంచితే, దేశంలో పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్‌ చేస్తున్నారన్న విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. పార్లమెంటులో ప్రతిపక్షాలు రెండు రోజులుగా ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. అయితే దేశంలో ఫోన్ల ట్యాపింగ్‌ అనేది సర్వసాధారణం అయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. చివరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సైతం తమకు కేటాయించిన ఫోన్ల ద్వారా స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి లేదు. కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రుల ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు మినహాయింపు కాదు. దీంతో పలువురు ప్రముఖులు ఐఫోన్‌ కొను క్కుని ఫేస్‌ టైమ్‌లో మాట్లాడుకుంటున్నారు. ఇది ఎంతవరకు సురక్షితమో తెలియదు. తమ ఫోన్‌ సంభాషణలు సురక్షితం కాదని ఈ దేశంలోని ప్రముఖులందరికీ తెలుసు. ముఖ్యమంత్రులకు సన్నిహితంగా ఉండేవారు సైతం తమ ఫోన్లకు మినహాయింపు ఉంటుందని భావించడం లేదు. మీరు పంపే మెసేజ్‌లు, మీకు వచ్చే మెసేజ్‌లను నేను ఎప్పటికప్పుడు చదవగలను అని ఒక ముఖ్యమంత్రి తనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరితో అన్నారు. దీన్నిబట్టి వాస్తవ పరిస్థితి ఏమిటో తెలుస్తోంది కదా! మొత్తానికి పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ పుణ్యమా అని ఫోన్‌ ట్యాపింగ్‌ దేశంలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ట్యాపింగ్‌ వ్యవహారాన్ని సర్వసాధారణ విషయంగా పరిగణిస్తున్న రాజకీయ, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు దాన్ని సీరియస్‌గా తీసుకుంటాయో లేదో చూడాలి. ప్రధాని, ముఖ్యమంత్రుల నిఘాలో ఉన్నవారు తమ కదలికలు తెలియకుండా ఉండటానికై తమతో సెల్‌ఫోన్లను వెంట తీసుకువెళ్లడం లేదు. గన్‌మెన్‌ కూడా లేకుండా ప్రైవేట్‌ వాహనాల్లో వెళ్లి కలవాల్సిన వారిని కలిసి వస్తున్నారు. ఈ పరిస్థితి మారుతుందని నమ్మవచ్చో లేదో తెలియదు!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2021-07-25T08:49:57+05:30 IST