సీఎంల ‘ముందస్తు’ తంటాలు!

ABN , First Publish Date - 2022-05-15T05:49:55+05:30 IST

తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతున్నారా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికల విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ...

సీఎంల ‘ముందస్తు’ తంటాలు!

తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతున్నారా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికల విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మాత్రం ఆ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ‘వచ్చే ఏడాది ఎన్నికలు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి’ అని శాసనసభ్యులకు సంకేతాలు అందుతున్నాయి. ఇకపై శాసనసభ్యులందరూ ప్రజల్లోనే ఉండాలని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడంతో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమైనట్టే అని అధికార పార్టీ నాయకులు నిర్ధారణకు వచ్చారు. ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో సిద్ధం కాకముందే ఎన్నికలకు వెళ్లాలన్నది జగన్‌ ఆలోచనగా చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకోవడానికి అసలు కారణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని అధికార పార్టీ ముఖ్యుడు ఒకరు చెప్పారు. అప్పు చేసి పప్పు కూడు పెట్టే రాష్ర్టాల విధానాలకు కేంద్రం చెక్‌ పెడుతున్నందున రాష్ట్రంలో పందేరాలు ఎంతోకాలం సాగవని, పంపకాలు నిలిచిపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కనుక ముందుగానే ఎన్నికలకు వెళ్లి మరో టర్మ్‌ అధికారం తెచ్చుకోవాలనే ఆలోచనతో జగన్‌రెడ్డి ఉన్నారని చెబుతున్నారు. కేంద్రంలోని పెద్దలతో తనకు సత్సంబంధాలు ఉన్నందున ముందస్తుకు వారి అండదండలు లభిస్తాయని జగన్‌ నమ్మకంగా ఉన్నారట! తెలంగాణకు కొత్త అప్పులు ఇవ్వడానికి నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం ఐదు వేల కోట్ల కొత్త అప్పుకు అనుమతివ్వడం గమనార్హం! ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబరు లేదా నవంబరులో శాసనసభను రద్దుచేసి, వచ్చే ఏడాది మార్చిలోగా ఎన్నికలు జరిపించేలా కేంద్ర సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా జగన్‌ బాటలోనే అదే సమయంలో శాసనసభను రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నప్పటికీ... కేంద్ర సహకారం లభిస్తుందో లేదోనని శంకిస్తున్నారు. ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఈ కారణంగా శాసనసభను రద్దుచేస్తే ఎన్నికలు జరపడానికి ఎన్నికల కమిషన్‌ సిద్ధపడకపోవచ్చునని, రాష్ట్రపతి పాలన విధించే అవకాశం లేకపోలేదని కేసీఆర్‌ అనుమానిస్తున్నారు. అయితే... జగన్‌రెడ్డి నిజంగానే అక్టోబరు లేదా నవంబరులో అసెంబ్లీని రద్దుచేస్తే తాను కూడా శాసనసభను రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్‌ ప్రస్తుతం భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తుకు అనుమతించి తెలంగాణలో నిరాకరిస్తే బీజేపీని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టవచ్చునని కేసీఆర్‌ అండ్‌ కో లెక్కలు వేసుకుంటున్నారు. కొత్త అప్పులు పుట్టకపోతే ప్రభుత్వం ప్రకటించిన పలు పథకాలు నిలిచిపోతాయి. అదే జరిగితే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉందని కేసీఆర్‌ భయపడుతున్నారు. మామూలుగా అయితే తెలంగాణలో వచ్చే ఏడాది నవంబరులో ఎన్నికలు జరగాలి. పథకాల అమలు నిలిచిపోతే అప్పటికి ప్రజల్లో వ్యతిరేకత రావడం సహజం. అందువల్లే, జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళితే తాను కూడా వెళ్లాలన్నట్టు కేసీఆర్‌ భావిస్తున్నట్టు చెబుతున్నారు. కొన్ని రోజులుగా ఫామ్‌ హౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌ రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతున్నారు.


పొత్తులు... పైఎత్తులు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖాయం అన్నట్టుగా సంకేతాలు వస్తున్నందున, అందుకు అనుగుణంగా జగన్‌ వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. బీజేపీ కలసి వచ్చినా రాకపోయినా తెలుగుదేశం పార్టీతో జతకట్టాలని జన సేనాని పవన్‌ కల్యాణ్‌ దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారని తెలిసింది. తాము తెలుగుదేశం పార్టీతో చేతులు కలపబోమని, తమ పొత్తు జనసేనకే పరిమితమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నాయకులు కూడా సీరియస్‌గా తీసుకోవడం లేదు. త్యాగాలకు తాము సిద్ధంగా లేమన్న వీర్రాజు వ్యాఖ్యలను జనసేన, తెలుగుదేశం నాయకులు ఎగతాళి చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు జరిగినా జరగకపోయినా తెలుగుదేశం జనసేన మధ్య పొత్తు ఉంటుందని జగన్‌రెడ్డి మాత్రం బలంగా నమ్ముతున్నారు. ఈ కారణంగానే దమ్ముంటే అన్ని స్థానాలకూ పోటీ చేయాలని పవన్‌ కల్యాణ్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలను వైసీపీ నాయకులు మొదలెట్టారు. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసి జగన్‌ను ఎదుర్కోలేదని కూడా ప్రచారం చేస్తున్నారు. ఏ కారణం వల్లనైనా పొత్తు కుదరకపోతే ఈ ప్రచారం తమకు ఉపయోగపడుతుందని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు తెలుగుదేశం వైపు మొగ్గు చూపనంత వరకు తాను సేఫ్‌ అని జగన్‌రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుకు ముందుగానే కేంద్ర పెద్దల ఆశీస్సులు కావాలనుకుంటున్నారు. తెలుగుదేశం–జనసేన మధ్య పొత్తు కుదరకపోతే తాను మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని జగన్‌ భావిస్తున్నారు. అయితే, ముందస్తు ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో భాగంగా చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పలుచోట్ల శాసనసభ్యులను ప్రజలు నిలదీయడం జగన్‌ను కలవరపెడుతోంది. కొంతకాలం క్రితం ముఖ్యమంత్రి జరిపించుకున్న అంతర్గత సర్వేలో పరిస్థితి ఆశాజనకంగా లేదని స్పష్టం కావడం కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ఒక కారణం అని చెబుతున్నారు. నెలలు గడిచేకొద్దీ పరిస్థితులు మరింత క్షీణిస్తాయని జగన్‌ అండ్‌ కో ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. అయితే... తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని సతాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం జగన్‌ ప్రభుత్వం విషయంలో ఉదారంగా వ్యవహరిస్తున్నందున, కేంద్ర పెద్దల ఆశీస్సులు లేకుండా జగన్‌ ఒక్క అడుగు కూడా ముందుకు వేయరని వైసీపీకి చెందిన ముఖ్య నేత ఒకరు చెప్పారు.


కొత్త ఎత్తులతో ముందుకు

క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఆశాజనకంగా లేనందున ముఖ్యమంత్రి జగన్‌ కొత్త ఎత్తుగడలకు తెరదీయబోతున్నట్టు చెబుతున్నారు. ప్రజల ముందు అమాయకత్వాన్ని నటించి వారి ఓట్లు కొల్లగొట్టడానికి అలవాటుపడిన జగన్‌రెడ్డి... ఇప్పుడు కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీని ఎదిరించి సొంత పార్టీ పెట్టుకున్నాక జరిగిన ఉప ఎన్నికల్లో తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను ప్రయోగించి తండ్రి రాజశేఖర రెడ్డిని సోనియాగాంధీ హత్య చేయించారని చెప్పించి ప్రజల సానుభూతి పొందారు. దీంతో సానుభూతి రాజకీయాల రుచి ఆయనకు తెలిసివచ్చింది. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడం యాదృచ్ఛికం కాదని ప్రజలను నమ్మించడంలో అప్పట్లో జగన్‌ కృతకృత్యులయ్యారు. తాను జైలులో ఉన్నప్పటికీ ఉప ఎన్నికల్లో సానుభూతి కారణంగా ఫలితాలు ఏకపక్షంగా రావడంతో ఆ తరహా వ్యూహాలకే జగన్‌ పదును పెడుతున్నారు. 2014 ఎన్నికల్లో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం వలన ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత తప్పు తెలుసుకొని ప్రజల సానుభూతి తిరిగి పొందడం కోసం పాదయాత్ర చేపట్టారు. తండ్రిని గుర్తుచేస్తూ అంతకంటే మంచి పాలన ఇస్తానని జగన్‌ నమ్మించారు. మరో వైపు ప్రశాంత్‌ కిశోర్‌ వంటి వారితో విష ప్రచారం చేయించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ‘దివంగత మహానేత రాజశేఖర రెడ్డి’ అని పెద్దగా ఉచ్చరించడం లేదు. అధికారంలో వాటా ఇవ్వడం ఇష్టం లేక తల్లిని, చెల్లిని కూడా దూరం పెట్టారు. అవసరానికి వాడుకొని వదిలేయడం అంటే ఇది కాదా? ఇప్పుడు మది నిండా ముందస్తు ఆలోచనలు ముసురుకోవడంతో మళ్లీ ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం మొదలెట్టారు. ‘‘పేద ప్రజల సంక్షేమం కోసం తాను నిరంతరం పరితపిస్తున్నందుకే అందరూ తనపై కత్తిగట్టి తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని జగన్‌ ప్రగాఢంగా విశ్వసిస్తారు. తనకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించే, ప్రసారం చేసే పత్రికలు, ప్రసార సాధనాలు తనపై కుట్ర చేస్తున్నాయని ఆయన భావిస్తారు. తనను విమర్శించే, లోపాలు ఎంచే, తనను తప్పుబట్టే వారంతా తనపై కుట్రలు చేసే వారితో చేతులు కలుపుతున్నట్టు భావిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు, అన్ని పత్రికలు, అన్ని ఛానళ్లు.. చివరికి కోర్టులు కూడా తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయని అనుకుంటారు. తాను ప్రజల పక్షాన నిలిచినందునే వారంతా తనపై కక్ష కట్టారన్న భావనను జగన్‌ కఠిన వాస్తవాలుగా విశ్వసించడమే కాదు; అత్యంత చాకచక్యంతో, తర్కబద్ధమైన వాదనతో, వక్రీకరణతో తన చుట్టూ ఉన్న వారిని కూడా నమ్మించగలుగుతారు’’ అని రెండు రోజుల క్రితం తుదిశ్వాస విడిచిన ప్రముఖ మనో వైజ్ఞానిక నిపుణులు సి.నరసింహారావు 2014కు ముందే జగన్‌ వ్యక్తిత్వాన్ని విశ్లేషించారు. ఇప్పటిదాకా జగన్‌ పోకడలను గమనిస్తే ఇదంతా అక్షర సత్యమని రుజువవుతోంది కదా! ఒక్కటే తేడా! తనకు వ్యతిరేకంగా ఎవరెవరో కుట్ర చేస్తున్నారని జగన్‌ స్వయంగా విశ్వసించరు. ప్రజలు మాత్రమే నమ్మేలా చేస్తారు. తనకు ఏమి కావాలో, తాను ఏమి చేస్తున్నానో జగన్‌కు బాగా తెలుసు. అందరూ భావిస్తున్నట్టు ఆయన సైకో కాదు. సైకో లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ... ప్రజల ముందు మాత్రం తాను పేదలకోసం పరితపిస్తుంటే దుష్ట శక్తులు అడ్డుకుంటున్నాయని ప్రచారం చేస్తున్నారు. అతిగా ఆశపడే వాడు అతిగా మోసపోతాడని తత్వవేత్త అరిస్టాటిల్‌ ఎప్పుడో చెప్పారు. అప్పుడు జగన్‌ చెప్పిన మాటలు నమ్మి ప్రజలు అతిగా ఆశపడ్డారు. ముందస్తు ఎన్నికల ఆలోచన చేస్తున్నందున జగన్‌రెడ్డి తన సహజసిద్ధమైన ఎత్తుగడలతో మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారు. ఈసారి ప్రజలు ఏం చేస్తారో!


అడ్డుకున్నది ఎవరు...

ఇటీవలి కాలంలో జగన్‌ పాల్గొంటున్న సభలలో ఆయన చెబుతున్న విషయాలు దివంగత సి.నరసింహారావు విశ్లేషణను గుర్తుచేయడం లేదా? అక్క చెల్లెమ్మలను ఆదుకుందామనుకుంటే దుష్ట చతుష్టయం అడ్డుకుంటోందని ప్రజలను జగన్‌ నమ్మించే ప్రయత్నం మొదలెట్టారు. అవాస్తవాలను వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారు. ఉదాహరణకు ఇంగ్లిష్‌ మీడియమే తీసుకుందాం! పాఠశాలల్లో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టవద్దని సుప్రీంకోర్టు కూడా చెప్పలేదు. మాతృ భాష అయిన తెలుగులో కూడా విద్యాబోధన జరగాలని సూచించింది. దీన్ని వక్రీకరించి ఇంగ్లిష్‌ మీడియం తీసుకువస్తే అడ్డుకుంటున్నారని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం సి.నరసింహారావు విశ్లేషించినట్టుగానే... రాజకీయ పార్టీలను, మీడియాను, న్యాయస్థానాలను, విమర్శకులను కుట్రదారులుగా అభివర్ణించే ప్రయత్నాలను జగన్‌ మళ్లీ మొదలెట్టారు. సమాజాన్ని పేదలు, పేదల వ్యతిరేకులుగా విభజించే కుట్రలకు తెరలేపారు. మీడియా విశ్వసనీయత దెబ్బతీసేందుకు... ప్రజలను వారి వ్యతిరేకులుగా మలచే ప్రయత్నం చేస్తున్నారు. తాను తరచుగా నిందిస్తున్న మీడియాలో వచ్చిన వార్తలు తప్పు అని మాత్రం ముఖ్యమంత్రి ఎప్పుడూ ఖండించకపోవడం గమనార్హం. మీడియా వాస్తవాలు చెబుతున్నా ప్రజలు వాటిని నమ్మకుండా చేయడమే ఆయన లక్ష్యం! అందుకే ఈ తరహా ప్రచారం చేస్తున్నారు. తాను మాత్రమే నిజాయితీపరుడినని చెప్పుకొంటూ, ఇతరులు అవినీతిపరులని, వారిని అడ్డుకోవడం వల్లనే తనను ఇబ్బంది పెడుతున్నారని నమ్మించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కష్టపడి పన్నులు కట్టే ప్రజలను సంక్షేమ పథకాలకు వ్యతిరేకులుగా ముద్ర వేయడం గమనించారా? పేదల పట్ల తన నిబద్ధత ప్రశ్నించలేనిదని నమ్మబలుకుతున్న జగన్‌రెడ్డి ఎప్పుడైనా తన జేబులోంచి తీసి ప్రజలకు సహాయం చేయడం చూశారా? ఓటు బ్యాంకులుగా మాత్రమే ఉండాలనుకొనే వారిపట్ల బహిరంగంగా ప్రేమ కురిపిస్తూ... అధికారాన్ని, వనరులను తాను మాత్రమే అనుభవించడాన్ని గమనించారా? విచిత్రమేమంటే, జగన్‌రెడ్డి నటనను ఇప్పటికీ కొంతమంది నమ్ముతుండటం! కరువు పరిస్థితులకూ చంద్రబాబు అధికారంలో ఉండటానికీ ముడిపెట్టి ప్రచారం చేసిన ఈ ముఠానే... ఇప్పుడు జగన్‌కూ కరోనాకూ, ఉక్రెయిన్‌ యుద్ధానికీ, ఎండలు మండటానికీ ముడిపెట్టి ప్రచారం జరుగుతోందని గుండెలు బాదుకుంటున్నారు. సమాజాన్ని కులాలు, వర్గాలుగా విభజించడంకోసమే జగన్‌రెడ్డి కుట్ర సిద్ధాంతాలను తెరమీదకు వదులుతుంటారు. జగన్‌ నిజరూపాన్ని అర్థం చేసుకుంటే జనం బాగుపడతారు. లేని పక్షంలో ఆయన మాయలో పడిపోయి సోమరులుగా మిగిలిపోతారు. కష్టపడి సంపాదించేవారు రాష్ట్రం విడిచి వెళ్లిపోతారు.


జగన్‌రెడ్డి ఇప్పటిదాకా వేసిన ఎత్తుగడలకు తోడు రానున్న ఎన్నికల్లో మరికొన్ని సరికొత్త ఎత్తుగడలను అమలు చేయబోతున్నారు. పార్టీ టికెట్ల కేటాయింపుల్లో అగ్రవర్ణాలకు ప్రాధాన్యం తగ్గించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అధిక సంఖ్యలో టికెట్లు ఇవ్వబోతున్నారు. జనాభాలో 50 శాతం పైగా ఉన్న మహిళలను ఆకర్షించేందుకు ఈ వర్గాలలో కూడా మహిళలకే ప్రాధాన్యం ఇవ్వబోతున్నారని తెలిసింది. వచ్చే ఎన్నికల్లో దాదాపు ఇరవై శాతం టికెట్లను మహిళలకు కేటాయించబోతున్నారట! ఎన్నికలు సమీపించే కొద్దీ ఇటువంటి ఎత్తుగడలతో పాటు సరికొత్త నాటకాలకు జగన్‌ తెరతీయడం ఖాయం. పారాహుషార్‌!


ఎవరి నోట... ఏం మాటలు!!!

ఇప్పుడు నేరాల విషయంలో జగన్‌ ద్వంద్వ వైఖరి ఎలా ఉంటుందో పరిశీలిద్దాం! నేరస్థులను కఠినంగా శిక్షించడమే జగన్‌ ప్రభుత్వ విధానమని సకల శాఖల మంత్రిగా ప్రచారం పొందుతున్న సజ్జల రామకృష్ణా రెడ్డి సెలవిచ్చారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణను సరైన ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారు. న్యాయమూర్తి ఆయనకు బెయిలు ఇవ్వడాన్ని కూడా సజ్జల తప్పుపట్టారు. నారాయణ విద్యా సంస్థల చైర్మన్‌ పదవికి నారాయణ 2014కి ముందే రాజీనామా చేశారు. అయినా సదరు సంస్థకు చెందిన సిబ్బంది ప్రశ్నపత్రాలను వాట్సాప్‌లో షేర్‌ చేశారని, నారాయణ ప్రోద్బలంతోనే ఇది చేశారంటూ అరెస్టు చేశారు. సాక్షి మీడియాతో తనకు సంబంధం లేదని జగన్‌రెడ్డి గతంలో న్యాయస్థానానికి అఫిడవిట్‌ సమర్పించారు. సదరు అఫిడవిట్‌ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది కూడా! అటువంటప్పుడు చైర్మన్‌ పదవిలో లేని నారాయణను సిబ్బంది చేసిన పనులకు ఎలా బాధ్యులను చేస్తారో సజ్జల చెప్పాలి. పోలీసులు అరెస్టు చేసిన తర్వాత నారాయణ చెబితేనే తాము ఆ పని చేశామని గిరిధర్‌ రెడ్డి వగైరా సిబ్బంది చెప్పినందున నారాయణను అరెస్టు చేసినట్టు సజ్జల చెప్పుకొచ్చారు. అలా అయితే వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకు ప్రధాన సూత్రధారులు ఎంపీ అవినాశ్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి అని దస్తగిరి అనే నిందితుడు కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టం చేశాడు కదా? అయినా అవినాశ్‌ రెడ్డిని, భాస్కర్‌ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయడం లేదని సజ్జల ప్రశ్నించడం లేదే? పైపెచ్చు వివేకా కేసులో సీబీఐ వైఖరిపై న్యాయ పోరాటం చేస్తామంటూ ఇదివరకే సజ్జల ప్రకటించారు. రెండు మూడు రోజుల క్రితం సీబీఐ అధికారుల వాహనాన్ని నడిపే డ్రైవర్‌ను ఒక ముసుగు వీరుడు బెదిరించినా చర్యలు ఎందుకు లేవో చెప్పాలి కదా? సీబీఐ అధికారులనే బెదిరించే తెంపరితనం ఎలా వచ్చిందో, ఎవరివల్ల వచ్చిందో సజ్జల చెప్పగలరా? డ్రైవర్‌ ఫిర్యాదును స్థానిక పోలీసులు స్వీకరించడానికి నిరాకరిస్తే సీబీఐ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని వేడుకోవలసిన పరిస్థితి ఏమిటి? నేరస్తులు ఎవరైనా జగన్‌ ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందంటే ఇలాగేనా? ఇప్పుడు ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి వద్దాం! ఈ వ్యవహారం మీడియాలో వచ్చినప్పుడు లీకేజీ కాలేదని మంత్రి బొత్స ప్రకటించారు. నిజం కూడా అదే! విద్యార్థుల చేతికి ప్రశ్నపత్రం అందిన తర్వాత కొంతమంది ఉపాధ్యాయులు దాన్ని వాట్సాప్‌లో షేర్‌ చేశారు. పరీక్ష ప్రారంభానికి ముందే ఇలా జరిగివుంటే లీకేజీ అనవచ్చు. పరీక్ష మొదలయ్యాక బయటికి వస్తే అది లీకేజీ ఎలా అవుతుంది? నారాయణను దృష్టిలో ఉంచుకునే కాబోలు లీకేజీ జరిగిందని ప్రభుత్వం మాట మార్చింది. నారాయణ విద్యా సంస్థలో ఎవరో చేసిన దానికి నారాయణ బాధ్యుడయ్యే పక్షంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు చేసిన పనికి మంత్రి బొత్స రాజీనామా చేయాలి కదా? ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రశ్నపత్రం లీక్‌ అవడంతో అప్పుడు విద్యా శాఖ మంత్రిగా ఉన్న గాలి ముద్దుకృష్ణమనాయుడు మంత్రి పదవికి రాజీనామా చేశారు. జర్నలిస్టుగా ఉద్యోగం వెలగబెట్టిన సజ్జలకు ఈ విషయం ఎందుకు గుర్తుకు లేదో? రాజకీయ ప్రత్యర్థులను వేధించడమే లక్ష్యంగా సాగుతున్న జగన్‌ ప్రభుత్వం... కేసుల్లో పసలేకపోయినా అరెస్టులకు పూనుకోవడం వల్లనే న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ వాస్తవాలను మరుగుపరచి కోర్టులు కూడా తనకు వ్యతిరేకమని చెప్పుకొంటూ జగన్‌ బతికేస్తున్నారు. అమరావతి చుట్టూ ప్రతిపాదించిన రింగురోడ్డు కాగితాలకే పరిమితమైనప్పటికీ అక్కడ ఏదో జరిగిపోయిందని సొంత పార్టీ ఎమ్మెల్యేతో ఫిర్యాదు చేయించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై కేసు పెట్టడం హాస్యాస్పదంగా లేదా? న్యాయస్థానం ముందు ఏమాత్రం నిలబడని ఇలాంటి కేసులు నమోదుచేసి, టార్గెట్‌గా పెట్టుకున్న వారిని అరెస్టు చేసి, వారిని జైలుకు పంపలేకపోయామే అని ఏడ్చి ప్రయోజనం ఏమిటి? నారాయణ విద్యా సంస్థలు రాత్రికి రాత్రి ఈ స్థాయికి రాలేదు. అవి ఈ స్థాయికి రావడానికి మూడు దశాబ్దాలు పట్టింది. ముఖ్యమంత్రి జగన్‌ ఆస్తులు మాత్రం అధికారంలో ఉన్నప్పుడే పెరుగుతాయి. అయినప్పటికీ అతడిని సక్సెస్‌ఫుల్‌ వ్యాపారవేత్తగా కీర్తించేవారు ఇతరులను ద్రోహులుగా చిత్రీకరించడం విషాదం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు జగన్‌ ఆర్థిక పరిస్థితి ఏమిటో చెప్పగలరా? ఈ ఒక్క విషయం ప్రజలకు వివరిస్తే దోచుకున్నదీ, దోచుకుంటున్నదీ, దాచుకుంటున్నదీ ఎవరో ప్రజలకు స్పష్టమవుతుంది. ముఖ్యమంత్రి జగన్‌కు గానీ, సజ్జల రామకృష్ణా రెడ్డికి గానీ ఆ పని చేసే ధైర్యముందా?

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2022-05-15T05:49:55+05:30 IST