రాజకీయ గ్రహణంలో సహ చట్టం

ABN , First Publish Date - 2022-01-22T06:08:44+05:30 IST

జాతీయ స్థాయిలో సమాచార హక్కు చట్టం (సహ చట్టం) కోసం జరిగిన ఉద్యమాలకు నాయకత్వం వహించిన సామాజిక ఉద్యమకారులు అరుణా రాయ్, నిఖిల్ డే, శంకర్ సింగ్‌ల నేతృత్వంలో- సహ చట్టం–2గా పిలవబడుతున్న...

రాజకీయ గ్రహణంలో సహ చట్టం

జాతీయ స్థాయిలో సమాచార హక్కు చట్టం (సహ చట్టం) కోసం జరిగిన ఉద్యమాలకు నాయకత్వం వహించిన సామాజిక ఉద్యమకారులు అరుణా రాయ్, నిఖిల్ డే, శంకర్ సింగ్‌ల నేతృత్వంలో- సహ చట్టం–2గా పిలవబడుతున్న ‘సామాజిక జవాబుదారీ చట్టాన్ని’ ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేస్తూ రాజస్థాన్ రాష్ట్రంలో ఉద్యమం జరుగుతోంది. ‘సామాజిక జవాబుదారీ చట్టం’ సాధారణ పౌరులకు తమ దగ్గర ఉన్న సమాచారం ఉపయోగించి చర్యలు తీసుకునే హక్కును కల్పిస్తుంది. -ప్రజల హక్కుల సాధన కోసం జవాబుదారీ చట్టం ఒక భూమికను ఇస్తుంది. 


గత 10సంవత్సరాలలో రాజస్థాన్ ప్రభుత్వం పౌరసమాజం ఒత్తిడితో- పౌరులు సహ చట్టం క్రింద దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేకుండా సమాచారం పొందడానికి ‘జన్ సూచన’ అనే సమాచార వేదిక, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ సదుపాయం ఏర్పాటు చేసింది. నిజానికి దేశంలో సహ చట్టం అమలులో 10 సంవత్సరాల క్రితం వరకు రాజస్థాన్, అవిభక్త ఆంధ్రప్రదేశ్ పోటాపోటీగా ఉండేవి. సహ చట్టం అమలుపై జరిగిన అధ్యయనం ‘రాగ్ 2011–13’ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇక రాజస్థాన్‌లో సహ చట్టం అమలు దూసుకుపోతుంటే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు నిలకడగా క్షీణిస్తూ వస్తున్నాయి.


ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన జిల్లా కలెక్టర్ల మొదటి సమావేశంలో మాట్లాడుతూ సహ చట్టం అమలు తమ ప్రభుత్వ ఎజెండాలో కీలక అంశమని, పౌరులు కోరిన సమాచారం అందేటట్లుగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఐతే ఆ మాటలు చేతలుగా మాత్రం రూపాంతరం చెందలేదు.


ప్రజలవద్దకే పాలన పేరుతో గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకువచ్చి రెండు సంవత్సరాలు పూర్తయినా, నేటివరకు సచివాలయాలలో సహ చట్టం క్రింద పౌర సమాచార అధికారులు, సహాయ పౌర సమాచార అధికారులు, మొదటి అప్పీలేటు అధికారులెవరో స్పష్టత లేదు. సమాచార హక్కు అమలుకు సంబంధించి బోర్డులు కాని, సెక్షన్ 4(1)(బి) క్రింద 17 అంశాల రిజిష్టరు నిర్వహించడంలేదు. అసలు సహ చట్టం దరఖాస్తులు స్వీకరణకు ఎలాంటి ఏర్పాటు జరగలేదు.


సహ చట్టం లక్ష్యం- పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడం ద్వారా అవినీతిని తగ్గించడం. పరిపాలనలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తెలుసుకోవడం ప్రజలకు చట్టపరంగా సంక్రమించిన హక్కు. అందుకనే స్వచ్ఛంద సమాచార వెల్లడి గురించి వివరించే సెక్షన్ 4(1)(బి) అనేది చట్టం అమలుకు గుండెవంటిది అంటారు. దానిని అనుసరించి అధికారుల అధికారాలు, విధులు, జీతభత్యాలు, బడ్జెట్ కేటాయింపులు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు పాటించే విధివిధానాల వివరాలు తదితర అంశాలు పౌరులకు స్వచ్ఛందంగా వెల్లడిచేయాలి. ఇది సక్రమంగా జరిగితే అసలు సమాచారం కోసం దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం చాలా మటుకు తగ్గిపోతుంది.


స్వచ్ఛంద సమాచార వెల్లడిలో వెబ్‌సైట్‌ల పాత్ర చాలా కీలకం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌ల నిర్వహణ అధ్వాన్నంగా ఉంది. ఉదాహరణకు ప్రభుత్వ భాషలో పరిపాలనా రాజధాని అయిన విశాఖపట్నం జిల్లా వెబ్‌సైట్‌ను చూద్దాం. అక్టోబర్ నెలలో బదిలీపై వెళ్లిపోయిన ‘జి. సృజన ఐఏఎస్’ ఇంకా జీవీఎంసీ కమీషనర్‌గా ఉన్నట్లు వెబ్‌సైట్‌లో ఉంది. అలాగే కార్పొరేట్ స్కూళ్ల భరతం పడతామని చెప్పుకునే ఈ ప్రభుత్వ హయాంలో ఈ వెబ్‌సైట్‌లో స్కూళ్ల జాబితాలో ఒక్క శ్రీ చైతన్య స్కూల్ పేరు మాత్రమే, ఆసుపత్రుల జాబితాలో కెజిహెచ్ మినహా కేవలం ప్రైవేటు ఆసుపత్రుల పేర్లు మాత్రమే ఎందుకు ఉన్నాయో ఆ సింహాద్రి అప్పన్నకే ఎరుక. దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల వెబ్‌సైట్‌ల పరిస్థితి అలానే ఉంది. ఇక రాష్ట్రస్థాయి ప్రభుత్వశాఖల వెబ్‌సైట్‌ల పరిస్థితి మరీ ఘోరం. ఉదాహరణకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్, ఎస్సీ / ఎస్టీ కమిషన్, వైద్య విధానపరిషత్ వెబ్‌సైట్‌లు లేవు లేదా పనిచేయడం లేదు.


ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు తెలియజేయడానికి ప్రభుత్వం ప్రారంభించిన వెబ్‌సైట్‌ను వాడకూడదని జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వచ్ఛంద సమాచార వెల్లడికి శరాఘాతంగా పరిణమించింది. ఈ చర్య సహ చట్టంలోని సెక్షన్ 4 (1)(ఎ), 4 (2)ల ఉల్లంఘనే.


ఇక ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, ఆధిపత్య పోరాటాల వల్ల చట్టం అమలు క్షేత్రస్థాయిలో చతికిలపడుతుంది. ఉదాహరణకు గ్రామపంచాయితీల పరిధిలోని ప్రభుత్వ భూములు కాపాడే బాధ్యత ఆయా గ్రామపంచాయితీలదేనని సుప్రీంకోర్టు (సివిల్ అప్పీల్ నం.1132 ఆఫ్ 2011) ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఆదేశాలు అనుసరిస్తూ పంచాయితీరాజ్- గ్రామీణాభివృద్ధి శాఖ, జి.ఓ.ఎమ్.ఎస్.నం. 188 ఉత్తర్వులు జారీచేసింది. కాని, గ్రామపంచాయితీ కార్యాలయాలకు గ్రామ పటాలు, పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూముల సర్వే నంబర్లతో కూడిన జాబితాలు రెవెన్యూ శాఖ గాని, భూమి సర్వే, కొలతల శాఖ గాని అందచేయలేదు.


అలానే ప్రభుత్వ భూములు, అసైన్‌మెంట్ భూములు, పట్టా భూముల జాబితాలలో నేటి వరకు స్పష్టతలేదు. ముఖ్యంగా విశాఖ, విజయనగరం ప్రాంతాలలో అనేక భూములకు సంబంధించి పూర్వ రికార్డులు లేవనే సమాచారం అధికారులు ఇస్తున్నారు. దానితో కీలక సమాచారం ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది.


ఇక పౌర సమాచార అధికారులుగా తక్కువ హోదా కలిగిన వారిని నియమించడం ద్వారా చట్ట ప్రాధాన్యత తగ్గించడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. ఉదాహరణకు ఒకప్పుడు మండల కార్యాలయాలలో, కలెక్టర్ కార్యాలయాలలో ప్రజా సమాచార అధికారులుగా తహసీల్దారులు, జిల్లా రెవెన్యూ అధికారులు ఉండేవారు. కానీ ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్, పరిపాలన అధికారి- పౌర సమాచార అధికారులుగా పనిచేస్తున్నారు. అలానే గతంలో సహ చట్టం అమలు సమీక్షించడానికి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రధాన సమాచార కమిషనర్, సామాజిక కార్యకర్తలతో హై పవర్ కమిటీ సహ చట్టం అమలు సమీక్షించేది. ఇలాంటి కమిటీలు జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షులుగా పనిచేసేవి. ఇప్పుడు అలాంటివేవీ లేవు. ఈ కమిటీలు పౌర సమాజానికి, అధికారులకు మధ్య వారధిగా పనిచేసేవి. చట్టం అమలులో ఏవైనా అడ్డంకులు ఉంటే వాటి పరిష్కరణకు సమిష్టిగా పనిచేసేవారు. చట్టం దుర్వినియోగం కాకుండా చూడడానికి అవకాశం చిక్కేది. ఐతే రాష్ట్ర విభజన తర్వాత వాటికి మంగళం పాడేశారు.


అలానే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిషాత్మకంగా రూపొందించి, అమలు చేస్తున్నామన్న సంక్షేమ పథకాలైన నవరత్నాల వివరాలు ఆయా శాఖల వెబ్‌సైట్‌లో వెల్లడించడం లేదు. ఉదాహరణకు రైతు భరోసా పథకంలో జిల్లాల వారీగా ఎంతమంది రైతులు లబ్ధిపొందారన్న సమాచారం వెబ్‌సైట్‌లో అందుబాటులో లేదు. తమకు ప్రభుత్వ పథకాలు ఎందుకు అందడం లేదో అడిగితే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. గత ప్రభుత్వ హయాంలో అన్ని పథకాల సమాచారం ఒకే చోట అందించే ముఖ్యమంత్రి డాష్‌బోర్డు ఇపుడు పనిచేయడం లేదు.


ఇక సహ చట్టం దరఖాస్తుదారులపై పెరుగుతున్న దాడులు ఆందోళన కలుగజేస్తున్నాయి. దాడులు జరిగినపుడు ఎస్పీ స్థాయి అధికారి కేసు దాఖలు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు (మెమో నం.33086/ఆర్టిఐఏ/జిపిఎం అండ్ ఏఆర్/2010–1, తేదీ. 30.09.2010) తెలియజేస్తుంది. కానీ దాడులు అప్రతిహతంగా జరుగుతున్నా పోలీసు శాఖ గుడ్లప్పగించి చూడడం మినహా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. రాష్ట్రంలో సహ చట్టం అమలు సక్రమంగా జరిగేటట్లు చూడాల్సిన సమాచార కమిషన్- ప్రజలతో, పౌర సమాజంతో సమావేశాలు నిర్వహించడం మానేసింది. అందువలన చట్టం అమలు దిగువ స్థాయిలో ఎలా జరుగుతుందో తెలుసుకునే అవకాశం పోయింది.


ప్రభుత్వ శాఖలు తమ వార్షిక నివేదికలు పంపకపోవడంతో సమాచార కమిషన్ ప్రచురించాల్సిన వార్షిక నివేదికలు ప్రచురించలేని దుస్థితిలో ఉంది. దీనిని బట్టి రాష్ట్రంలో సీనియర్ అధికారులకు సహ చట్టంపై, సమాచార కమిషన్‌పై ఏపాటి గౌరవం ఉందో తెలుస్తుంది.


రాష్ట్రంలో రాజకీయ పార్టీలలో రాజ్యాంగ విలువల పట్ల ఉదాసీనత, సహ చట్టం అమలు పట్ల రాజకీయ సంకల్పం లోపించడం, సహ చట్టం ఒక అవరోధంగా, దరఖాస్తుదారులను అభివృద్ధి నిరోధకులుగా భావించడం ఈ దుస్థితికి ప్రధాన కారణం. ఇక రాష్ట్ర విభజనతో పౌర సమాజ సంస్థలు కూడా చీలిక పేలికలు అయిపోవడం -పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి.


రాజస్థాన్ తరహాలో ప్రజలకు కావాల్సిన రీతిలో సమాచారం అందించే ఇనిషియేటివ్స్, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ విధానం, సామాజిక జవాబుదారీతనం చట్టం కోసం- పౌర సమాజం సమష్టిగా ఉద్యమించాలి. సహ చట్టం అమలు సమీక్ష కోసం హై పవర్ కమిటీ, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.


‘పారదర్శకత, జవాబుదారీతనం’ ఎన్నికల ఎజెండాలో ముఖ్యమైన అంశాలుగా మార్చగలిగినపుడు మాత్రమే కావాల్సిన ఫలితాలు రాబట్టగలమని పౌర సమాజం గుర్తించాలి, రాజస్థాన్ అనుభవం నేర్పిస్తున్నది అదే!!

చక్రధర్ బుద్ధ 

డి. ఇమ్మానియేలు

Updated Date - 2022-01-22T06:08:44+05:30 IST