తలుపు తట్టడం కాదు.. బద్దలు కొట్టాలి !

ABN , First Publish Date - 2022-06-21T09:27:24+05:30 IST

టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో చోటు ఆశిస్తున్న భారత ఆటగాళ్లకు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్పష్టమైన సందేశాన్నిచ్చాడు.

తలుపు తట్టడం కాదు.. బద్దలు కొట్టాలి !

వరల్డ్‌కప్‌ ఆశావహులకు ద్రవిడ్‌ సూచన

బెంగళూరు: టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో చోటు ఆశిస్తున్న భారత ఆటగాళ్లకు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్పష్టమైన సందేశాన్నిచ్చాడు. టీమిండియాలో చోటు కావాలంటే.. ‘తలుపు తట్టడం కాదు.. బద్దలు కొట్టే ప్రదర్శన’ చేయాలన్నాడు. తనకు అందివచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న దినేష్‌ కార్తీక్‌.. పొట్టి వరల్డ్‌కప్‌ ముందు జట్టు ఎంపికకు ఎన్నో ప్రత్యామ్నాయాలు సృష్టించాడని కితాబిచ్చాడు. ఇంగ్లండ్‌ టూర్‌ ముగిసే లోపు జట్టులో చోటు ఖరారు చేసుకోగల దాదాపు 20 మంది ప్రధాన ఆటగాళ్లపై అవగాహనకు రావాలనుకుంటున్నట్టు ద్రవిడ్‌ తెలిపాడు.


‘ఎందుకోసమైతే కార్తీక్‌ను ఎంపిక చేశామో.. ఆ బాధ్యతలను అతడు సమర్థంగా నిర్వర్తించాడు. రాజ్‌కోట్‌లో భారీ ఇన్నింగ్స్‌ అవసరమైన తరుణంలో రెచ్చిపోయాడు. హార్దిక్‌ పాండ్యాతో కలసి డెత్‌ ఓవర్లలో ఉతికి ఆరేశాడు. ఆశించిన స్కోరును అందుకోవాలంటే చివరి ఓవర్లలో విరుచుపడి ఆడే ఆటగాళ్ల అవసరముంది. కార్తీక్‌, పాండ్యా ఆ పాత్రను సమర్థంగా పోషించార’ని రాహుల్‌ చెప్పాడు.


టీ20 వరల్డ్‌కప్‌ టీమ్‌ ఎంపికలో తన పేరును తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలనే పరిస్థితిని కార్తీక్‌ కల్పించాడని అన్నాడు. అవకాశాలు కావాలంటే దినేష్‌ తరహా ఇన్నింగ్స్‌తో విరుచుకుపడాలని స్పష్టం చేశాడు. వరుసగా విఫలమైన రుతురాజ్‌ గైక్వాడ్‌, శ్రేయాస్‌ అయ్యర్‌లకు కోచ్‌ అండగా నిలిచాడు. ఇక, ఇంగ్లండ్‌తో ఆడనున్న టెస్ట్‌ మ్యాచ్‌ గురించి మాట్లాడుతూ.. ‘గతేడాదితో పోల్చితే ఇంగ్లిష్‌ టీమ్‌ భిన్నంగా ఉంది. ఇటీవలి కాలంలో వారి ఆట బాగుంది. మన జట్టు కూడా బలంగా ఉంద’ని రాహల్‌ పేర్కొన్నాడు.


పంత్‌.. జట్టులో అంతర్భాగం..

సౌతాఫ్రికాతో సిరీస్‌లో బ్యాటింగ్‌లో రిషభ్‌ పంత్‌ విఫలం కావడంతో అతడిపై విమర్శల దాడి పెరిగింది. వరల్డ్‌కప్‌ జట్టులో అతడు ఉంటాడా? అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. కానీ, రాబోయే కొన్ని నెలలు పంత్‌ జట్టులో అంతర్భాగమని ద్రవిడ్‌ తేల్చి చెప్పాడు. ‘దూకుడుగా ఆడే క్రమంలో విఫలమై ఉండొచ్చు. కానీ, అతడి శక్తిసామర్థ్యాలను తక్కువగా అంచనా వేయలేం. అలాగే ఎడమచేతి వాటం బ్యాటర్‌ కావడంతో మధ్య ఓవర్లలో ఎంతో కీలకమైన ఆటగాడవుతాడు. ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓ సిరీ్‌సతో పంత్‌ కెప్టెన్సీని అంచనా వేయలేం. వెనుకబడినా సిరీ్‌సను సమం చేయడం గొప్ప విషయమ’ని ద్రవిడ్‌ అన్నాడు. 

Updated Date - 2022-06-21T09:27:24+05:30 IST