కాగ్నిజెంట్‌ కొలువుల పండగ

Jul 30 2021 @ 00:27AM

  • ఈ ఏడాది లక్ష మంది నియామకం
  • 30 వేల మంది తాజా గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు
  • భారీగా పెరిగిన ఉద్యోగుల వలసలు


న్యూఢిల్లీ: అమెరికా కేంద్రంగా పని చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం కాగ్నిజెంట్‌ ఈ ఏడాది కొత్తగా లక్ష మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనుంది. జూన్‌ త్రైమాసికంలో అట్రిషన్‌ రేటు (ఉద్యోగవలస) రికార్డు స్థాయిలో 31 శాతానికి చేరిన నేపథ్యంలో ఏర్పడిన నిపుణుల కొరతే ఈ నిర్ణయానికి కారణం. ఐటీ సర్వీసులు, బీపీఓ రెండు విభాగాల్లోనూ ఉద్యోగుల వలస అధికంగానే ఉంది. భారత్‌ సహా కాగ్నిజెంట్‌ కార్యకలాపాలు సాగిస్తున్న దేశాలన్నింటిలోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది.


ఈ ఏడాది జూన్‌ చివరి నాటికి కంపెనీలో 3 లక్షల మందికి పైబడి ఉద్యోగులు పని చేస్తుండగా వారిలో 2 లక్షల మంది భారత్‌లోనే ఉన్నారు. నిపుణుల కొరత తీర్చేందుకు ఈ ఏడాది భారీ స్థాయిలో లక్ష కొత్త నియామకాలు చేపట్టనున్నామని కంపెనీ సీఈఓ బ్రయాన్‌ హంఫ్రీస్‌ కంపెనీ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటిస్తూ తెలిపారు. అదనంగా మరో లక్ష మంది అసోసియేట్లకు శిక్షణ ఇవ్వాలని, 30 వేల మంది తాజా గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని కూడా నిర్ణయించినట్టు చెప్పారు.


2022లో మరో 45 వేల మంది  ఫ్రెషర్లను నియమించుకుంటామన్నారు. క్లయింట్ల డిమాండ్‌ బలంగా ఉన్న కారణంగా నియామకాల్లో జోరు పెంచాలని భావించామని సీఎఫ్‌ఓ జాన్‌ సీగ్మండ్‌ తెలిపారు. భారత్‌లో జూనియర్‌, మిడ్‌ లెవెల్స్‌లో వలసలు అధికంగా ఉన్నాయని, దీన్ని అరికట్టేందుకు జీతభత్యాల్లో సద్దుబాట్లు, ఉద్యోగ రొటేషన్లు, నైపుణ్య శిక్షణ, ప్రమోషన్లు వంటి పలు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ప్రతిభ ఆధారంగా వేతనాల పెంపును ప్రకటించామని, అక్టోబరు 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని జాన్‌ తెలిపారు. అంచనాలను మించిన ఆదాయం


కాగా జూన్‌ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 41.8 శాతం పెరిగి 51.2 కోట్ల డాలర్లుగా (రూ.3,801.7 కోట్లు) నమోదైంది. గత ఏడాదిలో ఇదే త్రైమాసికంలో ఆర్జించిన ఆదాయం 36.1 కోట్ల డాలర్లతో పోల్చితే ఇది 41.8 శాతం అధికం. 2021 సంవత్సరం మొత్తంలో కంపెనీ ఆదాయం 10.2-11.2 శాతం మధ్యన పెరిగి 184-185 కోట్ల డాలర్లుంటుందని అంచనా వేస్తోంది. జూన్‌ త్రైమాసికంలో కూడా తాము ప్రకటించిన అంచనాకు మించి ఆదాయం పొందినట్టు తెలిపింది.


సెప్టెంబరు త్రైమాసికంలో తమ ఆదాయం 469 కోట్ల డాలర్ల నుంచి 474 కోట్ల డాలర్ల మధ్యన ఉంటుందని భావిస్తున్నామని సీఈఓ హంఫ్రీస్‌ చెప్పారు. తమ క్లయింట్ల ఆధునిక వ్యాపారాల నిర్మాణానికి భాగస్వామ్యాలు కుదుర్చుకుంటూనే త్వరితగతిన వృద్ధి చెందుతున్న మార్కెట్లకు తాము విస్తరించాలనుకుంటున్నట్టు తెలిపారు. తమ డిజిటల్‌ ఆదాయాలు 20 శాతం పెరిగినట్టు చెప్పారు. డిజిటల్‌ విభాగాన్ని పటిష్ఠం చేసేందుకు ఆ రంగంలో బలం ఉన్న కంపెనీల కొనుగోళ్లు, విలీనాలపై 2019 నుంచి 200 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు హంఫ్రీస్‌ తెలిపారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.