చెరువులను చెరిపేసి..

ABN , First Publish Date - 2022-05-19T06:12:46+05:30 IST

చెరువులను చెరిపేసి..

చెరువులను చెరిపేసి..
రంగన్నగూడెం చెరువు వద్ద తవ్వకాలు

రెండు జిల్లాల్లో పేట్రే గిపోతున్న అధికార పార్టీ నేతలు

చెరువుల్లో మట్టి ఇటుక బట్టీలకు తరలింపు

రియల్‌ వెంచర్లకు పెద్ద ఎత్తున..

నిబంధనలు లేవ్‌.. అనుమతులు ఉండవ్‌.. 

ప్రశ్నిస్తే దాడులు.. ఆపై అరెస్టులు.. 

ఫిర్యాదు చేయడానికి సాహసించని స్థానికులు

అడ్డుచెప్పని అధికారులు 


మట్టే కదా.. అని తీసిపారేయొద్దు. ఆ మట్టే ఇప్పుడు అధికార పార్టీ నేతలకు రూ.కోట్లు తెచ్చిపెడుతోంది. చెరువు కనిపిస్తే చాలు.. దానిని చెరపట్టి లారీలకు లారీల మట్టిని తవ్వేసి.. ఇటుక బట్టీలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు తరలించేస్తున్నారు. నిబంధనలు, ప్రమాణాలు గాలికి వదిలేయటంతో చెరువులు నాశనమై ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అధికారులు, పోలీసుల సహకారంతో రెండు జిల్లాల్లో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. - ఆంధ్రజ్యోతి, విజయవాడ/గన్నవరం


కృష్ణాజిల్లాలో..

గన్నవరం మండలం పరిధిలోని కొండపావులూరు గ్రామ సర్వే నెంబర్‌ 144లోని చెరువును మట్టి మాఫియా తెగ తవ్వేస్తోంది. ఈ చెరువు విస్తీర్ణం 24 ఎకరాలు. ఇందులో 18 ఎకరాలు రైతుల ఆధీనంలో ఉంది. మిగతా ఎకరాలను తాటిచెట్ల లోతున తవ్వేశారు. ఇదే గ్రామంలోని సర్వే నెంబర్లు 22, 23లో కూడా అక్రమంగా మట్టి తోలకం జరుగుతోంది. భారీ ఎక్స్‌కవేటర్లతో మట్టిని తీసి, ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. వీరపనేనిగూడెంలోని ములకలమ్మ చెరువు పరిస్థితి కూడా ఇంతే. వందలాది ట్రాక్టర్లు, వేలాది ట్రిప్పులతో మట్టి తరలిపోతోంది. అలాగే, తెంపల్లి, బల్లిపర్రులో పోలవరం కాల్వగట్టును తవ్వేస్తున్నారు. ఇక బాపులపాడు మండలం పరిధిలోని కె.సీతారామపురం బాలాయి చెరువులో మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతు న్నాయి. వందలాది ట్రాక్టర్లు, ఎక్స్‌కవేటర్లతో నిత్యం ఈ తంతు జరుగుతూనే ఉంది.  


ఎన్టీఆర్‌ జిల్లాలో.. 

విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలోని సర్వే నెంబర్‌ 472-1లో ఎలాంటి అనుమతి లేకుండా మల్లయ్యస్వామి గట్టును తవ్వేస్తున్నారని ఓ సామాజిక కార్యకర్త కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. ఇదే గ్రామంలోని తుమ్మెలతిప్ప చానల్‌ గట్టును కూడా తవ్వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే, జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలు మండలంలో బండిపాలెం, కొణకంచి గ్రామాల మధ్యన భారీ చెరువు ఉంది. ఈ చెరువులో నీటిని బయటకు తోడేసి, మట్టిని తరలించేస్తున్నారు. పెనుగంచిప్రోలులోని చెరువులో కూడా పెద్ద ఎత్తున మట్టి తరలించుకుపోతున్నారు. 

అక్రమాలకు అనేక పేర్లు

చెరువులు, గుట్టల మట్టిని తరలించి అమ్ముకోవటానికి అధికార పార్టీ నేతలు అనేక పేర్లు పెడుతున్నారు. జగనన్న కాలనీ లే అవుట్ల మెరక, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, చెరువు పూడిక ఇలాంటి పేర్లతో మభ్య పెడుతున్నారు. కానీ, మట్టి మాత్రం బయటకు తరలిపోతోంది.  

ఇటుక బట్టీలకే ఎక్కువ

రాయలసీమ నుంచి వచ్చిన కొందరు ఇక్కడ ఇటుక బట్టీల వ్యాపారం చేస్తున్నారు. దాదాపు రెండేళ్ల కిందటే పదుల సంఖ్యలో వ్యాపారులు వచ్చి రైతుల దగ్గర నుంచి పొలాలు లీజుకు తీసుకున్నారు. గన్నవరం, మైలవరం మండలాల పరిధిలో పెద్దసంఖ్యలో ఇటుక బట్టీల నిర్వహణ నడుస్తోంది. నాణ్యమైన ఇటుక కావాలంటే సారవంతమైన చెరువుల మట్టి అవసరం. అందులోనూ ఎర్రమట్టి అయితే డిమాండ్‌ ఉంటుంది. ఇటుక కూడా బలిష్టంగా తయారవుతుంది. జగనన్న కాలనీల నిర్మాణంతో పాటు కరోనా సంక్షోభానంతర పరిస్థితుల్లో నిర్మాణరంగం కూడా ఊపందుకోవటంతో ఇటుక బట్టీల వ్యాపారం జోరుగా ఉంది. దీంతో ఇటుక బట్టీలకు మట్టిని ఎక్కువగా సరఫరా చేస్తున్నారు. 

రియల్‌ వెంచర్లకూ..

రెండు జిల్లాల్లో రియల్‌ వెంచర్లకు మట్టి తరలుతోంది. మూడు నెలలుగా రియల్‌ వ్యాపారం ఊపందుకుంది. వెంచర్లలో మెరక, రహదారులు తదితర మౌలిక సదుపాయాల కోసం మట్టికి డిమాండ్‌ ఏర్పడింది. కానూరు, నందిగామ, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, గన్నవరం తదితర ప్రాంతాల్లో రియల్‌ వెంచర్లకు చెరువుల మట్టి తరలుతోంది. 

ప్రశ్నిస్తే దాడులే..

మట్టి అక్రమ తవ్వకాలపై అధికార పార్టీ నేతలను ప్రశ్నించడానికి ఎవరూ సాహసించట్లేదు. ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. పోలీసులను రంగంలోకి దింపుతున్నారు. విస్సన్నపేట మండలం మల్లయ్యస్వామి గట్టును తవ్వుతున్న అక్రమార్కులపై ఓ సామాజిక కార్యకర్త ప్రశ్నిస్తే, అతడిని జైలుకు పంపించారు. గ్రామాల్లో ఎవరైనా ప్రశ్నిస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరిస్తున్నారు. 





Updated Date - 2022-05-19T06:12:46+05:30 IST