కాల్వ మాయం

ABN , First Publish Date - 2021-07-27T05:44:41+05:30 IST

కంకిపాడు మండలంలో రెండు వేల ఎకరాల సాగు భూములకు నీరందించే పంట కాల్వ మాయమైంది.

కాల్వ మాయం
కాల్వ స్థానంలో రహదారి నిర్మాణ పనులు

ఆక్రమణలో కోలవెన్ను చానల్‌

వెంచర్‌కు రోడ్డుగా మార్చిన రియల్టర్‌

50 అడుగుల వెడల్పు.. కిలో మీటర్‌ పొడవున ఆక్రమణ

సాగునీటికి అడ్డుకట్ట 

పట్టించుకోని అధికారులు.. ప్రజాప్రతినిధులు 


కంకిపాడు మండలంలో రెండు వేల ఎకరాల సాగు భూములకు నీరందించే పంట కాల్వ మాయమైంది. మచిలీపట్నం రహదారికి ఆనుకొని ఉన్న కోలవెన్ను చానల్‌కు సమీపంలో వెంచర్‌ వేసిన ఓ రియల్టర్‌ దారి కోసం దీన్ని ఆక్రమించాడు. 53 అడుగుల వెడల్పు ఉన్న ఈ కాల్వను 50 అడుగుల మేర కిలో మీటర్‌ పొడవున ఆక్రమించి రోడ్డు నిర్మిస్తున్నాడు. 15 రోజులుగా ఈ పనులు జరుగుతున్నా అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడం సందేహాలకు తావిస్తోంది. 


కంకిపాడు, జూలై 26 : ఖరీఫ్‌ సాగులో రైతులు నిమగ్నమయ్యారు... నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి... అయితే కోలవెన్ను చానల్‌ పరిధిలోని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జూలై నెలాఖరు వచ్చినా వీరి భూములకు సాగునీరు అందలేదు. కోలవెన్ను చానల్‌ను ఓ రియల్టర్‌ ఆక్రమించి రోడ్డు నిర్మించుకోవడమే ఇందుకు కారణం. 


వివరాల్లోకి వెళ్తే పెనమలూరు - కంకిపాడు మండలాల మధ్య విజయవాడ ప్రధాన రహదారిని అనుకొని కోలవెన్ను చానల్‌ ఉంది. దీని ద్వారా కంకిపాడు మండలంలోని పునాదిపాడు, ఈడుపుగల్లు, గొల్లగూడెం గ్రామాల పరిధిలోని రెండు వేల ఎకరాలకు సాగు నీరందుతోంది. 


ఇటీవల ఈ చానల్‌ను ఆనుకొని కిలో మీటర్‌ దూరంలో ఓ రియల్టర్‌ సుమారు 30 ఎకరాల భూమిని కొనుగోలు చేసి వెంచర్‌ పనులు ప్రారంభించాడు. అయితే ఆ వెంచర్‌కు వెళ్లేందుకు అవసరమైన రోడ్డు లేకపోవడంతో ఈ చానల్‌పై అతని కన్నుపడింది. 53 అడుగుల వెడల్పు ఉండాల్సిన ఈ కాలువను 50 అడుగుల మేర ఆక్రమించాడు. అందుకు అధికారులకు ఇవ్వాల్సిన మామూళ్లు ఇచ్చేశాడు. దీంతో ఆక్రమణను అడ్డుకునే వారు లేకపోయారు. ప్రస్తుతం అక్కడ 53 అడుగులు ఉండాల్సిన సాగునీటి కాల్వ మూడు అడుగులకు కుచించుకుపోయింది. 


సాగు నీరందకుండా అడ్డుకట్టలు

కాల్వపై కాంక్రీట్‌ పనులు చేపట్టేందుకు వీలుగా అన్నిచోట్లా అడ్డు కట్టలు వేశాడు. వరినాట్లు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో కోలవెన్ను చానల్‌పై రియల్టర్‌ కాంక్రీట్‌ పనులు ముమ్మరం చేసి, సాగునీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేయడంతో కంకిపాడు మండలంలోని పునాదిపాడు, ఈడుపుగల్లు, గొల్లగూడెం గ్రామాల పరిధిలోని రెండు వేల ఎకరాలకు సాగునీరందక వందలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 


సాగు చేయాలా వద్దా 

జూలై నెలాఖరు వచ్చింది. సాగు నీరు వదల్లేదు. ఆరా తీస్తే కోలవెన్ను చానల్‌పై ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేశారని తెలిసింది. అడిగేందుకు కాల్వ వద్దకు వస్తే ఎవరూ కనిపించడం లేదు. ఇరిగేషన్‌ అధికారులు, సిబ్బంది అందుబాటులో లేరు. ఏం చేయాలో తెలియడం లేదు. - శ్రీనివాసరావు, రైతు


సాగుకు నీరు లేదు

నీరులేక దమ్ము ట్రాక్టర్లు చేలో ఉండి పోయాయి. బందరు రోడ్డులోని బైపాస్‌ నుంచి కోలవెన్ను వరకు సుమారు రెండు వేల ఎకరాలకు నీరందించే ఈ కాల్వ మూడు అడుగులు కూడా లేకుండా పోయింది. సాగు చేయాలో వద్దో చెబితే అదే చేస్తాం. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం లేకపోయింది. - సుగుణ మూర్తి, రైతు




Updated Date - 2021-07-27T05:44:41+05:30 IST