కలెక్టరేట్‌ ఎదుట ముస్లిం జేఏసీ నాయకుల దీక్ష

ABN , First Publish Date - 2022-01-25T04:23:54+05:30 IST

వక్ఫ్‌బోర్డు స్థలంలో అక్రమంగా చేపడుతున్న సైన్సు పార్కు నిర్మాణాన్ని ఆపాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ముస్లిం జేఏసీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు.

కలెక్టరేట్‌ ఎదుట ముస్లిం జేఏసీ నాయకుల దీక్ష
దీక్ష చేస్తున్న ముస్లిం జేఏసీ నాయకులు

నెల్లూరు(హరనాథపురం), జనవరి 24: వక్ఫ్‌బోర్డు స్థలంలో అక్రమంగా చేపడుతున్న సైన్సు పార్కు నిర్మాణాన్ని ఆపాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ముస్లిం జేఏసీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షుడు మౌలానా ముస్తాక్‌ మాట్లాడుతూ దాదాపు రూ.250 కోట్ల విలువ చేసే మైనార్టీలకు సంబంధించిన స్థలంలో నెల్లూరు మున్సిపల్‌ కమిషనర్‌ సైన్స్‌ పార్కు నిర్మాణం చేయిస్తున్నారని ఆరోపించారు. ఆ స్థలం గతంలో ముస్లిం మైనార్టీ పెద్దలు అబ్బాస్‌ అలీఖాన్‌ మసీదుకు బహుమతిగా ఇచ్చారన్నారు. ఏ ఆధారాలతో ముస్లిం మైనార్టీలకు చెందిన వక్ఫ్‌బోర్డు ఆస్తులలో సైన్స్‌పార్కు నిర్మాణాలు చేపడుతున్నారని ప్రశ్నించారు. మైనార్టీకు రావాల్సిన సంక్షేమాలు రద్దు చేసింది కాక మైనార్టీల ఆస్తులను కూడా దోచుకొంటున్నారని ఆరోపించారు. ముస్లింల ఆస్తులు అన్యాక్రాంతం అవుతుంటే డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మౌనం పాటించటం సిగ్గుచేటన్నారు. ఆయన కళ్లు మూసుకుపోయాయా అని ప్రశ్నించారు. ఈ దీక్షకు పొద్దుటూరు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మోక్తియర్‌ తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు మైన్‌ ఉద్దీన్‌, నగర పార్టీ అఽధ్యక్షుడు సాబీర్‌ఖాన్‌, జియా ఉల్‌హక్‌, హయత్‌ బాబా, ఆసీఫ్‌పాషా, నౌషాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-25T04:23:54+05:30 IST