భూగర్భ జలాలను పెంపొందించాలి

ABN , First Publish Date - 2022-06-30T05:14:44+05:30 IST

జిల్లాలో నీటి సంరక్షణ, భూగర్భ జలాలు పెంపొందించేందుకు జలశక్తి అభియాన్‌ పథకాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వ నోడల్‌ అధికారి ఆర్తిసింగ్‌ పరివార్‌ సూచించారు.

భూగర్భ జలాలను పెంపొందించాలి
కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న కేంద్ర జలశక్తి అభియాన్‌ నోడల్‌ అధికారి ఆర్తిసింగ్‌ పరివార్‌, కలెక్టర్‌

జలశక్తి అభియాన్‌ నోడల్‌ ఆఫీసర్‌ ఆర్తిసింగ్‌ పరివార్‌

గుంటూరు, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నీటి సంరక్షణ, భూగర్భ జలాలు పెంపొందించేందుకు జలశక్తి అభియాన్‌ పథకాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వ నోడల్‌ అధికారి ఆర్తిసింగ్‌ పరివార్‌ సూచించారు. బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె తొలుత కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో జలశక్తి అభియాప్‌ పథకం పనులపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆర్తిసింగ్‌ పరివార్‌ మాట్లాడుతూ జిల్లాలో జలశక్తి అభియాన్‌ పథకం ద్వారా చేపట్టిన పనులు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. గత మూడేళ్లకు ముందు భూగర్భ జలాల పరిస్థితితో పోల్చి చూస్తే ఇప్పుడు బాగా పెరిగాయన్నారు. పనులు మంజూరు చేసే సమయంలో అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. 

జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ 2021 మార్చి 22 నుంచి వర్షాన్ని పట్టుకో అనే నినాదంతో ప్రారంభించిన కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలు జలకళని సంతరించుకొంటున్నాయన్నారు. రూ.3.62 కోట్ల వ్యవయంతో కేవలం ఉపాధి హామి పథకం కింద 1.25 లక్షలకు పైగా అటవీ నిర్మాణ పనులతో పాటు 3.24 లక్షలకు పైగా నీటి సంబంధిత పనులు పూర్తయన్నారు. దాదాపు రూ.17.18 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు పూర్తి కావడం, అభివృద్ధి దశలో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం వర్షం ఎక్కడ పడినా వడిసి పడదాం అనే నినాదంతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అంతకుముందు డ్వామా పీడీ యుగంధర్‌కుమార్‌ 2019 నుంచి జలశక్తి అభియాన్‌ పథకం ద్వారా జిల్లాలో చేపట్టిన పనులు, సాధించిన ఫలితాల గురించి వివరించారు. ఆ తర్వాత నోడల్‌ ఆఫీసర్‌ ఆర్తిసింగ్‌ పరివార్‌ చేతుల మీదగా కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరింప చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వవ జలశక్తి టెక్నికల్‌ హెడ్‌ అనీషా, కృషి విజ్ఞాన కేంద్రం ప్రిన్సిపల్‌ సైంటిస్టు డాక్టర్‌ కేవీ సుబ్రహ్మణ్యం, శాస్త్రవేత్త సీహెచ్‌ అనిల్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ఎంవీఎస్‌ సత్యన్నారాయణ రాజు, ఏపీఎంఐపీ పీడీ పద్మావతి, ఉద్యానవన శాఖ డీడీ సుజాత, వ్యవసాయ శాఖ డీడీ రామాంజనేయులు, జిల్లా సెరీకల్చర్‌ అధికారి బి.ప్రసాద్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఈ వెంకటరామయ్య, భూగర్బ జలశాఖ డీడీ లక్ష్మి, పొన్నూరు మునిసిపల్‌ కమిషనర్‌ రాధ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-30T05:14:44+05:30 IST