అమరావతి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ‘‘పట్టణ ప్రాంతాల్లో భూ పరిమితి చట్టం 2008లో రద్దయింది. అప్పటి ప్రభుత్వం 747 జీవో జారీ చేసి ఈ భూముల్లో ఇళ్లు కట్టుకొనే పేదల నుంచి నామ మాత్రంగా కొంత మొత్తం తీసుకొని అవసరమైన మినహాయింపులు ఇచ్చే వెసులుబాటు కల్పించింది. పధ్నాలుగు సంవత్సరాల తర్వాత వైసీపీ ప్రభుత్వం కొత్తగా జీవో నంబరు 36 తెచ్చింది. గరిష్ఠ భూ పరిమితి భూముల్లో ఏనాడో ఇళ్లు కట్టుకొన్న వారిని ఇప్పుడు రూ.లక్షలు చెల్లించాలని నోటీసులు ఇస్తోంది. రద్దయిన చట్టంపై మళ్లీ జీవో ఎలా జారీ చేస్తారు?’’ అని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ఈ జీవోను ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో దీనిపై టీడీపీ ఆందోళన చేపడుతుందని రఫీ హెచ్చరించారు.