నీ ఇల్లు.. ఇలాగే ఉంటుందా?

ABN , First Publish Date - 2020-11-28T04:16:12+05:30 IST

‘నీ ఇల్లు అయితే ఇలాగే ఉంటుందా? ఫ్లోరింగ్‌ పరిశుభ్రత ఇదేనా? ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. నాడు-నేడు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని ఇద్దరు ఇంజినీరింగ్‌ అధికారులను సస్పెండ్‌ చేశాను. అయినా మీరు మారరా?’ అంటూ కలెక్టర్‌ జె.నివాస్‌ సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారి గణేష్‌, సచివాలయ ఇంజినీర్‌ ప్రశాంతిపై అసహనం వ్యక్తం చేశారు.

నీ ఇల్లు..   ఇలాగే ఉంటుందా?
ఇంజినీరింగ్‌ అధికారిపై అసహనం వ్యక్తం చేస్తున్న కలెక్టర్‌ నివాస్‌




ఇంజనీరింగ్‌ అధికారిపై కలెక్టర్‌ అసహనం

నాడు-నేడు పనుల్లో నాణ్యతా లోపంపై ఆగ్రహం

టెక్కలి, నవంబరు 27: ‘నీ ఇల్లు అయితే ఇలాగే ఉంటుందా? ఫ్లోరింగ్‌ పరిశుభ్రత ఇదేనా? ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. నాడు-నేడు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని ఇద్దరు ఇంజినీరింగ్‌ అధికారులను సస్పెండ్‌ చేశాను. అయినా మీరు మారరా?’ అంటూ కలెక్టర్‌ జె.నివాస్‌ సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారి గణేష్‌, సచివాలయ ఇంజినీర్‌ ప్రశాంతిపై అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం టెక్కలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.27లక్షలతో చేపడుతున్న ‘నాడు-నేడు’ పనులను ఆయన పరిశీలించారు. పనుల్లో నాణ్యతా లోపంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రానైట్‌ గచ్చులు పరిశుభ్రంగా లేవని, ఫుట్‌పాత్‌ నిర్మాణాలు సరిగ్గా నిర్మించాలని, వాష్‌రూం నాణ్యతగా ఉండాలని అధికారులకు సూచించారు. అంతకుముందు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని మినీస్టేడియం పరిశీలించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని డీఎస్‌బీవో శ్రీనివాస్‌కు సూచించారు. అక్కడ మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న మౌలిక సమస్యలను గుర్తించారు. రన్నింగ్‌ వాటర్‌ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు జిమ్‌ సౌకర్యం కల్పించాలని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.గోవిందమ్మ కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం పోటీపరీక్షలకు వెళ్లే విద్యార్థులకు  అవసరమైన పుస్తకాలను కలెక్టర్‌ పంపిణీ చేశారు. అవకాశాలు అందిపుచ్చుకోవాలని, పోటీపరీక్షకు యువత సిద్ధమవ్వాలని కలెక్టర్‌ తెలిపారు. అనంతరం తలగాం గ్రామ సచివాలయాన్ని పరిశీలించారు. కరోనా వైరస్‌ రెండోదశ వ్యాప్తి ఉండే అవకాశం ఉన్నందున ఫీవర్‌ సర్వే పక్కాగా ఉండాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. వీరితో పాటు సబ్‌కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌, సెట్‌శ్రీ సీఈవో జి.శ్రీనివాసరావు, పర్యటక శాఖ అధికారి ఎన్‌.నారాయణరావు, హెచ్‌ఎం రాజేశ్వరరావు ఆచారి, తహసీల్దార్‌ శిర్ల గణపతిరావు, మండల ప్రత్యేకాధికారి డాక్టర్‌ మంచు కరుణాకరరావు, ఎంపీడీవో నారాయణమూర్తి, సిబ్బంది ఉన్నారు.



Updated Date - 2020-11-28T04:16:12+05:30 IST