మరో బాదుడు

ABN , First Publish Date - 2022-04-21T07:08:13+05:30 IST

వేసవి కాలంలో ఇళ్లు, వ్యవసాయం, పరిశ్రమలు తదితర అవసరాలకు తగినట్టు విద్యుత్‌ సరఫరా చేయడం లేదు. కరెంటు చార్జీలను మాత్రం ఇటీవల భారీగా పెంచేశారు. అంతలోనే మరోసారి ప్రజలపై

మరో బాదుడు

ట్రూఅప్‌ చార్జీల వసూలుకు డిస్కంలు సన్నద్ధం

గత అక్టోబరు నుంచి డిసెంబరు దాకా

విద్యుత్‌ కొనుగోలు భారం ప్రజలపైనే

అనుమతించాలని ఏపీఈఆర్‌సీకి వినతి

జూన్‌ 15న ప్రజాభిప్రాయం 

సేకరించాలని ఈఆర్‌సీ నిర్ణయం


ఇది బాపట్ల ఏరియా ఆస్పత్రి! బుధవారం రాత్రి కరెంటు పోవడంతో గర్భిణులు, చంటిబిడ్డల తల్లులు ఉక్కపోతతో అల్లాడిపోయారు. గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో చీకట్లు అలుముకున్నాయి. గుంటూరు నగరం మినహా... మిగిలిన అన్ని ప్రాంతాల్లో 9 గంటల నుంచి కరెంటు ‘కోతలు’ మొదలయ్యాయి. అర్ధరాత్రి దాకా సరఫరాను పునరుద్ధరించలేదు. కరెంటు ఎందుకు పోయిందో కూడా అధికారులు చెప్పలేదు.


గుంటూరు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వేసవి కాలంలో ఇళ్లు, వ్యవసాయం, పరిశ్రమలు తదితర అవసరాలకు తగినట్టు విద్యుత్‌ సరఫరా చేయడం లేదు. కరెంటు చార్జీలను మాత్రం ఇటీవల భారీగా పెంచేశారు. అంతలోనే మరోసారి ప్రజలపై భారం మోపేందుకు విద్యుత్‌ పంపిణీ సంస్థలు(డిస్కంలు) సిద్ధమవుతున్నాయి. విద్యుత్‌ కొనుగోలు ధరల సవరణల పేరిట ప్రత్యేక రుసుము వసూలు చేయాలని నిర్ణయించాయి. అక్టోబరు 2021 నుంచి డిసెంబరు 2021 దాకా త్రైమాసికంలో కొనుగోలు చేసిన విద్యుత్‌ యూనిట్‌ ధరల్లో వ్యత్యాసాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకు ఆమోదం తెలపాలంటూ ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)ని కోరాయి. విద్యుత్‌ కొనుగోలు ధరలకూ, వాస్తవ వ్యయానికీ మధ్య అంతరాన్ని సవరించుకునేందుకు వీలుగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఈఆర్‌సీ నిర్ణయించింది. జూన్‌ 15వ తేదీన జూమ్‌ విధానంలో ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టనుంది. యూనిట్‌కు రూ.0.4208 నష్టం వచ్చిందని దక్షిణ ప్రాంతీయ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎ్‌సపీడీసీఎల్‌) ఈఆర్‌సీకి నివేదించింది. అదేవిధంగా తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ యూనిట్‌కు రూ.0.3300 నష్టం వాటిల్లిందని వెల్లడించింది.


ఇక సీపీడీసీఎల్‌ యూనిట్‌కు రూ.0.4521 నష్టం వచ్చిందని తెలిపింది. వాస్తవానికి డిస్కంల వారీగా ఎంత నష్టం వాటిల్లిందో వెల్లడించాలి. కానీ యూనిట్‌కు వాటిల్లిన నష్టమెంతో చెప్పడం ద్వారా వినియోగదారులపై భారం వేసేందుకు వాస్తవాలను తొక్కి పెట్టే ప్రయత్నం చేశాయి. దీనిని ఈఆర్‌సీ ఎందుకు ప్రశ్నించలేదని ఇంధన రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్‌ కొనుగోలు సమయంలోనే ప్రజాభిప్రాయ సేకరణ చేపడితే, అధిక ధరలకు కరెంటును కొనుగోలు చేయడం, ఆ తర్వాత వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సిన అవసరం రాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విద్యుత్‌ పంపిణీ సంస్థలు చేసే తప్పుల వల్ల వినియోగదారులపై భారం పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. డిమాండ్‌, విద్యుత్‌ సేకరణ, సరఫరాపై ముందస్తు ప్రణాళికలు లేవన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వాస్తవ విద్యుత్‌ వినియోగ చార్జీల వసూలు పేరిట ఎప్పుటికప్పడు వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేసే విధానం అమలు చేయాలని ఇంధన శాఖ నిర్ణయించింది. కొత్త టారిఫ్‌ విధానంలోనూ ఇదే సూత్రాన్ని అమలు చేశారు. ఈ విధానమే డిస్కంలు ప్రజలపై భారం మోపేందుకు వీలు కల్పిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు పాత లెక్కలను బయటకు తీసి నష్టాన్ని వసూలు చేసుకునేందుకు డిస్కంలు సిద్ధమవుతున్నాయి. గతంలో ఒకసారి బిల్లులను వసూలు చేశాక, ఖర్చులు పెరిగాయంటూ మరోసారి వినియోగదారుల నుంచి వసూలు చేసే పద్ధతి ఉండేది కాదు.


ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖర రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఫ్యూయల్‌ సర్‌ చార్జి పేరిట బాదుడును ప్రారంభించారు. నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి హయాంలో ఇది తీవ్రస్థాయికి చేరింది. 2014 తర్వాత ఇలా ఫ్యూయల్‌ సర్‌ చార్జి పేరిట వసూలు చేయడం మందగించింది. ఇప్పుడు మళ్లీ బాదుడు మొదలైంది. గతంలో బకాయిలు వసూలు చేయలేదంటూ వినియోగదారుల నుంచి ‘ట్రూఅప్‌’ పేరిట వసూలు చేసే విధానాన్ని డిస్కంలు ప్రారంభించాయి. ఏటా ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమలయ్యే కొత్త టారి్‌ఫలో పాత బకాయిలను చేర్చకుండా, టారిఫ్‌ అమల్లోకి  వచ్చాక గత ఏడాది వ్యయాలంటూ బిల్లులు వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. గత ఏడాది అక్టోబరు నుంచి డిసెంబరు దాకా విద్యుత్‌ కొనుగోలు చార్జీల భారాన్ని మోపేందుకు డిస్కంలు సిద్ధంకావడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 


పెనాల్టీలపైనే ఆధారపడొద్దు

డిస్కంలకు ఈఆర్‌సీ ఆదేశం

అమరావతి, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): వినియోగదారుల నుంచి పెనాల్టీలు వసూలు చేయడంపైనే ఆధారపడకుండా, నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ అందించడంపై దృష్టిసారించాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలను ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి ఆదేశించారు. పెనాల్టీలను ఆదాయ వనరుగా చూడడం సరికాదన్నారు. హైదరాబాద్‌ ఏపీఈఆర్‌సీ కార్యాలయంలో విద్యుత్‌ డిమాండ్‌, సరఫరా, నియంత్రణపై సమీక్షించారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల నుంచి రావాల్సిన బకాయిల వసూలుకు ప్రాధాన్యం ఇవ్వాలని డిస్కంలను ఆదేశించారు. అందుబాటులో ఉన్న విద్యుత్‌ను రాష్ట్రంలోని అందరికీ అందించాలని సూచించారు. పరిమితికి మించి విద్యుత్‌ వినియోగంపై పెనాల్టీ వసూలు చేయడంపై వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యంతరాలను డిస్కంల దృష్టికి తీసుకువచ్చారు. 

Updated Date - 2022-04-21T07:08:13+05:30 IST