కలిసికట్టుగా కరోనా నియంత్రణ

ABN , First Publish Date - 2021-04-18T06:00:42+05:30 IST

‘కరోనా సెకండ్‌ వేవ్‌ వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు యాక్షన్‌ ప్లాన్‌తో ముందుకు వెళ్లాలి. కరోనా వచ్చిన సమయంలో తీసుకున్న ప్రణాళికలను పూర్తిస్థాయిలో మరొకసారి అమలు చేయాలి.

కలిసికట్టుగా కరోనా నియంత్రణ

సెకండ్‌ వేవ్‌పై యాక్షన్‌ ప్లాన్‌ 

పటిష్టంగా కొవిడ్‌ కేర్‌ సెంటర్లు, పరీక్షా కేంద్రాల నిర్వహణ  

నోడల్‌ అధికారులుగా  ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారులు 

జిల్లా ఉన్నతాధికారులతో సమావేశంలో కలెక్టర్‌ ఇంతియాజ్‌ దిశానిర్దేశం

విజయవాడ, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి)

‘కరోనా సెకండ్‌ వేవ్‌ వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు యాక్షన్‌ ప్లాన్‌తో ముందుకు వెళ్లాలి. కరోనా వచ్చిన సమయంలో తీసుకున్న ప్రణాళికలను పూర్తిస్థాయిలో మరొకసారి అమలు చేయాలి. కొవిడ్‌ ఆసుపత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లు, కొవిడ్‌ పరీక్షా కేంద్రాల నిర్వహణ వంటివి యథాతథంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలి. జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ హాస్పిటల్స్‌, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో మేలైన వైద్య సేవలు అందించాలి.  హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండే వారికి ట్రై ఏజ్‌ సెంటర్‌ ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు వెళుతూ ఉండాలి. సెకండ్‌ వేవ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవడం కోసం, మరింత పర్యవేక్షణ కోసం ఉన్నతస్థాయి అధికారులతో నోడల్‌ అధికారులను నియమిస్తున్నాం’ అని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టర్‌ ఇంతియాజ్‌, జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌తో కలిసి జిల్లాలోని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ను జిల్లా వ్యాప్తంగా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సంయుక్తంగా పనిచేయడానికి, క్షేత్రస్థాయిలో మొదటిదశలో అవలంబించిన విధానాలను మళ్లీ అమలు చేయడానికి క్యాంపు కార్యాలయంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఇంతియాజ్‌ మాట్లాడుతూ తొలిసారి కరోనా వచ్చిన సమయంలో తీసుకున్న ప్రణాళికలను పూర్తిస్థాయిలో మరోసారి అమలు చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం అధికారులు సమాయత్తం కావాలని, ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ ఆసుపత్రులను గుర్తించామని అన్నారు. గతంలో నియమించుకున్న కాంట్రాక్టు మెడికల్‌ అధికారులు, సిబ్బంది సేవలను కొనసాగించి ప్రజలకు మేలైన వైద్య సదుపాయాలు అందించాలన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేశామని వీటికి సంబంధించి ప్రతిపాదనలను సమర్పించాల్సి ఉండగా డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ)కు సిఫార్సు చేశామన్నారు. ప్రజలు 104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌చేస్తే కేసుల లక్షణాలను బట్టి మూడు గంటలలోగా వైద్యసేవలను అందించే పరిస్థితి ఉండాలన్నారు. జిల్లా కొవిడ్‌ ఆసుపత్రిగా నిమ్రా హాస్పిటల్‌ను గతంలో నిర్వహించామన్నారు. సోమవారం నుంచి పిన్నమనేని సిద్ధార్థ హాస్పిటల్‌లో కూడా కరోనా వైద్యసేవలు అందించేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉందన్నారు. కరోనా బారినపడిన వారిని గుర్తించి వైద్యసేవలు అందించి డిశార్చి చేసేవరకు కొవిడ్‌ మార్గదర్శకాల ప్రొటోకాల్‌ ప్రకారం పకడ్బందీగా అమలు చేయాల్సి ఉందన్నారు. హోమ్‌ ఐసోలేషన్లలో ఉండేవారికి మందుల కిట్‌లను ఉచితంగా అందించాలన్నారు. దీనికోసం ఇప్పటికే యన్‌టిఆర్‌ డెంటల్‌ ఆసుపత్రి ప్రాంగణంలో ట్రైఏజ్‌ సెంటర్‌ను అందుబాటులోనికి తీసుకువచ్చామన్నారు. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ హెల్త్‌ మార్గదర్శకాల మేరకు జిల్లా ఉన్నతస్థాయి అధికారులు నోడల్‌ అధికారులుగా ప్రతి ఒక్క అంశాన్నీ పర్యవేక్షించాలన్నారు. కొవిడ్‌ కేర్‌ కేంద్రాలను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కొవిడ్‌ నియంత్రణ, వైద్యసేవలను అందించేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు. కొవిడ్‌ బారిన పడిన వారిని గుర్తించి పూర్తిస్థాయి వైద్యచికిత్సలు అందించేందుకు వైద్యఆరోగ్యశాఖతో సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. వైద్య పరీక్షలు, ల్యాబ్‌, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, కంటైన్‌మెంట్‌ జోన్‌ల నిర్వహణ, ట్రైఏజ్‌ కేంద్రం, హోమ్‌ క్వారంటైన్‌, 104 కాల్‌ సెంటర్‌, కొవిడ్‌ హాస్పిటల్‌ నిర్వహణ, హెల్ప్‌డెస్క్‌ నిర్వహణ, ఆక్సిజన్‌, మందుల నిర్వహణ, కొవిడ్‌ మెటీరియల్‌, ఆత్యవసర మెడికల్‌ మందులు, ఇతర సేవల నిర్వహణ వంటి అంశాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా జిల్లాస్థాయి అధికారులను నియమిస్తున్నామన్నారు. వీటితో పాటు అంబులెన్స్‌ వివరాలు, మృతిచెందినవారి వివరాలను సేకరించి సమన్వయం చేసుకునేందుకు కూడా అధికారులను నియమిస్తున్నామన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ పరిస్థితులను అంచనావేసి కరోనా వ్యాప్తిని మరింత సమర్ధవంతంగా నివారించేందుకు అధికారులు పనిచేయాల్సి ఉందన్నారు. 


Updated Date - 2021-04-18T06:00:42+05:30 IST