అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Jul 23 2021 @ 00:56AM

జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు

టెలీకాన్ఫరెన్స్‌లో అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు

హెల్ప్‌లైన్‌ నంబర్లు : 9154252937/ 1800-4253424

వరంగల్‌ రూరల్‌ కలెక్టరేట్‌, జూలై 22: జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో అన్ని శాఖల అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఎం.హరిత కోరారు. జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాలను, ప్రమాదాలను నివారించడానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి కలెక్టరేట్‌ నుంచి గురువారం ఆర్‌డీవో, తహసీల్దార్లు, ఎంపీడీవో, ఇరిగేషన్‌ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా పలు ఆదేశాలు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చూడాలన్నారు. రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ తదితర శాఖలకు సంబంధించిన మండల స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండి ఏమైనా సమస్యలు ఎదురైతే యుద్ధ ప్రతిపాదికన స్పందించాలన్నారు. ఎక్కడైన కాలనీలు జలమయమైతే బాధితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. కరెంట్‌ స్తంభాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. చెరువులకు గండి పడితే రహదారులు ధ్వంసమయ్యే ప్రమాదం ఉన్నందున ఇరిగేషన్‌ అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చర్యలు చేపట్టాలన్నారు. వర్షాల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా చూడాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కూలిపోయే ప్రమాదం ఉన్న ఇళ్లల్లో నివసించే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ప్రజలు తమకు ఏమైనా ఇబ్బందులెదురైతే 9154252937/1800-4253424 నంబర్లలో సంప్రదించాలని కలెక్టర్‌ ఎం.హరిత పేర్కొన్నారు.

Follow Us on: