జిల్లాలో పోక్సో ఫాస్ట్‌ ట్రాక్‌ స్పెషల్‌ కోర్టు

ABN , First Publish Date - 2021-03-07T03:49:21+05:30 IST

అత్యాచారం, పోక్సో యాక్ట్‌ కేసులు బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు జిల్లా కేంద్రంలో పోక్సో ఫాస్ట్‌ ట్రాక్‌ స్పెషల్‌ కోర్టు నిర్మాణ, ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్‌ ఎంవీ. రెడ్డి తెలిపారు.

జిల్లాలో పోక్సో ఫాస్ట్‌ ట్రాక్‌ స్పెషల్‌ కోర్టు
ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఎంవీ రెడ్డి

కలెక్టర్‌ ఎంవీ రెడ్డి వెల్లడి

చుంచుపల్లి, మార్చి 6: అత్యాచారం, పోక్సో యాక్ట్‌ కేసులు బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు జిల్లా కేంద్రంలో పోక్సో ఫాస్ట్‌ ట్రాక్‌ స్పెషల్‌ కోర్టు నిర్మాణ, ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్‌ ఎంవీ. రెడ్డి తెలిపారు. శనివారం చుంచుపల్లి మండల పరిధిలోని రాంనగర్‌ ప్రాం తంలోగల తహసీల్దార్‌ కార్యాలయం వద్ద అత్యాచారం, పోక్సో యాక్ట్‌ కేసులు సత్వరం పరిష్కరించేందుకు నూతనం గా ఈ నెల 8వ తేదీ సోమవారం ప్రారంభించనున్న ఈ కోర్టును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ కేసులను కాలయాపన చేయకుండా తక్షణం పరిష్కరించడంతోపాటు బాధితులు ఖమ్మం వెళ్లకుండా మన జిల్లా కేంద్రంలోనే కోర్టు ఏర్పాటు చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కోర్టు పరిసరాలు, భవనాన్ని పరిశీలించారు. జిల్లా కేంద్రంలో దాదాపు 25 ఎకరాల్లో కోర్టు భవనం నిర్మాణానికి స్థల కేటాయింపు చేశామని, అట్టి భవన నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నామని, భవన నిర్మాణం పూర్తి కాగానే ఇక్కడి నుంచి తరలించడం జరుగుతుందని ఆయన తెలిపారు. సోమవారం ఉదయం 9.45 గంటలకు హైకోర్టు న్యాయమూర్తి అభినంద్‌ కుమార్‌ షావిలి చేతుల మీదుగా డిజిటల్‌ ప్రక్రియ ద్వారా కోర్టు ప్రారంభోత్సవం నిర్వహించనున్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని డీఆర్వోను ఆదేశించారు. కోర్టు ప్రాంగణాన్ని అందంగా ము స్తాబు చేయాలని సూచించారు. కోర్టు పరిసరాలతోపాటు ప్రధాన రహదారి వరకు అందమైన వివిధ రకాల పూల మొక్కలు నాటాలని మునిసిపల్‌ కమిషనర్‌కు సూచిం చారు. వాటి పెంపుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. పోక్సో కేసుల్లో సత్వర న్యాయం ఈ కోర్టుల ద్వారా లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమంలో అదనపు కలెక్టర్‌ అనుదీప్‌, బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ లక్కినేని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జే. గోపీకృష్ణ, వైస్‌ ప్రెసిడెంట్‌ కే. నాగేశ్వరరావు, అసోసియేషన్‌ సభ్యులు గడిపల్లి మహేష్‌, మారపాక రమేష్‌, డీఆర్వో అశోక చక్రవర్తి, మునిసిపల్‌ కమిషనర్‌ సంపత్‌ కుమార్‌, కొత్తగూడెం, చుంచుపల్లి మండలాల తహసీల్దార్లు పీవీ. రామకృష్ణ, కే. నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-07T03:49:21+05:30 IST