16 నెలలు తరువాత.. స్పందన

ABN , First Publish Date - 2021-07-27T04:13:41+05:30 IST

స్ధానిక సంస్థల ఎన్నికలు, కొవిడ్‌ మొదటి, రెండవ దశల కారణంగా గత ఏడాది మార్చి నెల రెండవవారం నుంచి నిలిచిపోయిన స్పందన కార్యక్రమం సోమవారం పునఃప్రారంభమైంది.

16 నెలలు తరువాత..  స్పందన
అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, జేసీలు

పునఃప్రారంభమైన కార్యక్రమం

అర్జీలను స్వయంగా స్వీకరించిన కలెక్టర్‌, జేసీలు

గుంటూరు (తూర్పు), జూలై 26: స్ధానిక సంస్థల ఎన్నికలు, కొవిడ్‌ మొదటి, రెండవ దశల కారణంగా గత ఏడాది మార్చి నెల రెండవవారం నుంచి నిలిచిపోయిన స్పందన కార్యక్రమం సోమవారం పునఃప్రారంభమైంది. ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు కిందిస్థాయి ఉద్యోగులు ప్రతి సోమవారం అర్జీలను స్వీకరించినప్పటికి, కలెక్టర్‌ సమక్షంలో పూర్తిస్తాయిగా 16 నెలలు తరువాత స్పందన ప్రారంభమయ్యింది. కలెక్టర్‌, జాయింట్‌కలెక్టర్లు స్వయంగా అర్జీలను స్వీకరించడంతో ఫిర్యాదుదారులు తమ సంత్పప్తిని వ్యక్తం చేశారు. స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీదారుల కోసం అధికారుల తగు ఏర్పాట్లు చేశారు. వారి కోసం టెంట్లు, మంచినీటి సౌకర్యం, అర్జీలను రాసేందుకు ప్రత్యేక సిబ్బందిని శంకరన్‌ సమావేశ మందిరం ఎదుట ఏర్పాటుచేశారు. ఇంతకుముందు జడ్పీ కార్యాలయం వద్ద జరిగే సమయంలో అక్కడ విశాల ప్రాగంణం ఉండటంతో అర్జీదారులకు సమస్యలు ఎదురుకాలేదు. శంకరన్‌ సమావేశ మందిరం ఎదుట కాస్త ఇరుకుగా ఉండటంతో పార్కింగ్‌, కూర్చువడానికి స్ధలం లేకపోవడం వంటి ఇబ్బందులను అర్జీదారులు ఎదుర్కున్నారు. మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు లేకపోవడంతో మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా అర్జీదారుల కు తగినఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. ఈసారి నిర్వహించే స్పందనలో ఇటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అర్జీదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పునఃప్రారంభం తరువాత స్పందనకు 26శాఖలకు సంబంధించి 210 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులను కలెక్టర్‌, జేసీలు, డీఆర్వో స్వయంగా స్వీకరించారు.  ఫిర్యాదుల్లో ఎక్కువశాతం నవరత్నాలు పథకాలు అందడం లేదని రావడంతో వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ గతంలో వచ్చిన ప్రజాసమస్యలను ఎంత మేర పరిష్కరించారో వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్పందనలో వచ్చే సమస్యలను పరిష్కారం జీరో శాతానికి తీసుకురావాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్లు ఏఎస్‌ దినేష్‌కుమార్‌, పి.ప్రశాంతి,  కె.శ్రీధర్‌రెడ్డి, అనుపమ అంజలి, పులిచింతల స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వినాయకం. డీఆర్వో కొండయ్య, జడ్పీ సీఈవో చైతన్య, డీపీవో కేశవరెడ్డి, హౌసింగ్‌ పీడీ వేణుగోపాలరావు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జె.యాస్మిన్‌, డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవాని ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-27T04:13:41+05:30 IST