తెలంగాణ MLC రేసులో కలెక్టర్.. నేడో రేపో రాజీనామా..

ABN , First Publish Date - 2021-11-15T19:14:21+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది....

తెలంగాణ MLC రేసులో కలెక్టర్.. నేడో రేపో రాజీనామా..

హైదరాబాద్ సిటీ/సిద్దిపేట : తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. అటు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇటు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజిబిజీగా గడుపుతున్నారు. ఏపీలో దాదాపు అందరు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించేయగా.. తెలంగాణలో మాత్రం ఇంకా ఫైనల్ చేసే పనిలో కేసీఆర్ నిమగ్నమయ్యారు. ఈ స్థానిక సంస్థల కోటాలో కలెక్టర్ పోటీ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈయన పేరు మాత్రం ఎన్నికలొచ్చిన ప్రతిసారీ తెరపైకి వస్తోంది. ఆయన మరెవరో కాదు.. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి.


ఇన్ని సార్లు ‘సారీ’..!

స్థానిక సంస్థల కోటాలో వెంకట్రామిరెడ్డి పేరును కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇవాళ లేదా రేపే కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేస్తారని కూడా వార్తలు గుప్పుమంటున్నాయి. అటు ప్రగతి భవన్ నుంచి పేరు ఖరారైందనే పిలుపు వచ్చిన మరుక్షణమే వెంకట్రామిరెడ్డి తన కలెక్టర్ పదవికి రాజీనామా చేసేస్తారట. వాస్తవానికి ఈయన పేరు ఇలా ప్రచారంలోకి రావడం ఇదేం మొదటి సారేం కాదు.. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఒకానొక దశలో మల్కాజిగిరి ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ తరఫున వెంకట్రామిరెడ్డికి టిక్కెట్ దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరిగింది. చివరి క్షణంలో అది కూడా చేజారడంతో ఆయన కొంత నిరాశకు లోనయ్యారు. తర్వాత కలెక్టర్‌గా తనపని తాను చేసుకుపోతున్నారు.


ఈసారైనా ఉంటుందా..!?

ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ కలెక్టర్ పేరును కేసీఆర్ పరిశీలించారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమోగానీ.. మళ్లీ ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించకుండా గులాబీ బాస్ మిన్నకుండిపోయారు. అయితే ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి చవిచూడగా.. బీజేపీ తరఫున పోటీ చేసిన రఘునందన్ రావు విజయం సాధించారు. మరి ఈసారైనా కలెక్టర్‌గారు అసెంబ్లీలోకి అడుగుపెడతారో లేదో.. తెలియాలంటే ఒకట్రెండ్రోజులు వేచి చూడాల్సిందే. కాగా.. దేశ వ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకూ పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఎస్ఐలు.. ఆఖరికి కానిస్టేబుల్స్ కూడా అసెంబ్లీ, పార్లమెంట్‌కు వెళ్లిన దాఖలాలు చాలానే ఉన్నాయి.

Updated Date - 2021-11-15T19:14:21+05:30 IST