నగరంలో మార్పు కనపడాలి

ABN , First Publish Date - 2022-05-22T06:06:22+05:30 IST

జిల్లా కేంద్రమైన ఏలూరులో నగరాభివృద్ధిలో మార్పు కనబడేలా అధికారులు చర్యలు తీసు కోవా లని అందుకు అవసరమైన ప్రతిపాదనలు తన ముందుకు తీసుకు రావాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ వై.ప్రసన్న వెంకటేష్‌ ఆదేశించారు.

నగరంలో మార్పు కనపడాలి
పంపుల చెరువు నీటిని పరిశీలిస్తున్న దృశ్యం

పలు ప్రాంతాల్లో కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ తనిఖీలు.. అధికారులకు సూచనలు

ఏలూరు కలెక్టరేట్‌, మే 21: జిల్లా కేంద్రమైన ఏలూరులో నగరాభివృద్ధిలో మార్పు కనబడేలా అధికారులు చర్యలు తీసు కోవా లని అందుకు అవసరమైన ప్రతిపాదనలు తన ముందుకు తీసుకు రావాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ వై.ప్రసన్న వెంకటేష్‌ ఆదేశించారు. శనివారం కమిషనర్‌ షేక్‌ షాహిద్‌, హెల్త్‌ అధికారి డాక్టర్‌ మాలతీతో కలిసి నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. నగరాభివృద్ధికి చేపట్టాల్సిన పలు అంశాలపై సూచనలు, సలహాలు అందజేశారు. పారిశుధ్య పనులతో పాటు పార్కులు, చెరువులను అభివృద్ధి చేయాలన్నారు. వర్షాకాలంలో ప్లాంటేషన్‌కు అనువైన ప్రదేశాలను గుర్తించాలన్నారు. డ్రైయిన్లలో పూడికతీత పనులు చేపట్టాలని సూచించారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపం నుంచి సందర్శన ప్రారంభించిన కలెక్టర్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. పారిశుధ్యం మరింత మెరుగు పర్చాలని కమిషనర్‌ను ఆదేశించారు. పంట కాలువల్లో పూడికతీసి పరిశుభ్రపర్చడంతో పాటు వ్యర్థాలు పడేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే వన్‌టౌన్‌లోని చేపల మార్కెట్‌ను పరిశీలించారు. చేపల విక్రయ దారులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చేపల వ్యర్ధాలు, కంపోస్టు ప్రోసెస్‌ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిల్‌హౌస్‌ పేట వద్ద మురుగు కాల్వ పూడికతీత పనులు పరిశీలించారు. వెంకన్న చెర్వును సందర్శించారు. అనం తరం అక్కడ నుంచి తాగునీటి సరఫరా చేసే పంపుల చెరువును తనిఖీ చేశారు. ప్రజలకు సరఫరా అవుతున్న తాగునీటికి సంబంధించి ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించారు.  ఆయన వెంట డీఈ సత్యనారాయణ,  కొండలరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-22T06:06:22+05:30 IST