‘ఎన్నికల విధులకు గైర్హాజరైతే షోకాజ్‌ నోటీసులు’

ABN , First Publish Date - 2021-03-06T05:42:13+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల సిబ్బంది ట్రైనింగ్‌కు, పోలింగ్‌ విధులకు గైర్హాజరైతే షోకాజ్‌ నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌, ఎన్నికల అథారిటీ జి.వీర పాండియన్‌ హెచ్చరించారు.

‘ఎన్నికల విధులకు గైర్హాజరైతే షోకాజ్‌ నోటీసులు’

కర్నూలు, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల సిబ్బంది ట్రైనింగ్‌కు, పోలింగ్‌ విధులకు గైర్హాజరైతే షోకాజ్‌ నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌, ఎన్నికల అథారిటీ జి.వీర పాండియన్‌ హెచ్చరించారు.  మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లపై శుక్రవారం రాత్రి క్యాంప్‌ కార్యాలయం నుంచి కలెక్టర్‌ టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శుక్రవారం రాష్ట్ర బంద్‌ వల్ల బస్సులు లేకపోవడం వల్ల ట్రైనింగ్‌కు గైర్హాజరైన పీవోలు, ఏపీవోలకు శనివారం చివరి చాన్స్‌ ఇన్ఫర్మేషన్‌ ఇచ్చి ట్రైనింగ్‌కు మరోసారి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం కూడా గైర్హాజరైతే షోకాజ్‌ నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లను ఆదేశించారు.  ఈ కాన్ఫరెన్స్‌లో జేసీలు రామసుందర్‌ రెడ్డి, సయ్యద్‌ ఖాజా మొహిద్దీన్‌, కర్నూలు మున్సిపల్‌ కమిషనర్‌ డీకే బాలాజి, నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి, డీఆర్వో పుల్లయ్య, ఆర్డీవోలు జిల్లా నోడల్‌ కమిటీల అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు. బీఎల్‌వోల ద్వారా ఫొటో ఓటరు స్లిప్పులు పంపిణీ, సర్వీసు ఓటర్లకు ఎన్నికల సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్స్‌ను పోస్టు ద్వారా డిస్‌పాచ్‌, అభ్యర్థుల పేర్లు, గుర్తులలో తప్పులు లేకుండా బ్యాలెట్‌ పేపర్‌ ప్రింటింగ్‌, నెంబరింగ్‌ పనులను మరుసటి రోజులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటరు అవగాహన కార్యక్రమాలను, వెబ్‌సైట్‌, హెల్ప్‌లైన్ల్‌ ద్వారా ‘నౌ యువర్‌ పోలింగ్‌ స్టేషన్‌’లపై ఓటర్లుకు అన్ని మున్సిపాలిటీలలో ర్యాలీల ద్వారా, ఆటోలకు, వాహనాలకు, ఫ్లెక్సీలను, మైక్‌ను కట్టించి ప్రతి వీదిలో, ప్రతి కాలేజీలో ఓటుహక్కు వినియోగంపై అవగాహన చేపట్టి, ఓటరు జాబితాలో పేరు ఉన్న ప్రతి ఓటరు తనకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్వేచ్ఛగా నిర్భయంగా వినియోగించుకోవడానికి ఓటింగ్‌ శాతాన్ని పెంచడానికి చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్‌ రోజు అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద బీఎల్‌వోల ద్వారా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటర్లు స్లిప్పులను పంపిణీ చేయించాలన్నారు. ప్రతి బ్యాలెట్‌ బాక్స్‌, వర్కింగ్‌ కండీషన్‌ను పోలింగ్‌ సామగ్రిని అధికారుల టీమ్‌ ద్వారా వ్యక్తిగత తనిఖీని వెంటనే పూర్తి చేసి నివేదికను ఇవ్వాలని సూచించారు. మోడల్‌ కోడ్‌ అమలుపై, అభ్యర్థుల ఖర్చులపై ఓటర్లకు తాయిలాల పంపిణీపై గట్టి నిఘా పెట్టాలని పోలీసు అధికారులకు, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, మున్సిపల్‌ కమిషనర్లకు, ఎస్‌ఎస్‌టీలకు సూచించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను లోకల్‌ సీఐలతో కలిసి మున్సిపల్‌ కమిషనర్లు తనిఖీని వెంటనే పూర్తి చేయాలన్నారు. వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాట్లు, పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు సిబ్బందికి అన్ని సదుపాయాలు కొవిడ్‌ నిబంధనల మేరకు మాస్క్‌, శానిటైజర్‌, వృద్ధులకు, దివ్యాంగులకు వీల్‌ చైర్స్‌, సహాయకులను ఏర్పాటు చేయాలన్నారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా రెఫర్‌ చేసే ఎన్నికల ఫిర్యాదులను, మీడియాలో వచ్చే మోడల్‌ కోడ్‌ ఉల్లంఘనలపై ఎటువంటి ఆలస్యం, నిర్లక్ష్యం లేకుండా వెంటనే చర్యలు  చేపట్టి నివేధికలను పంపాలని నోడల్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్‌లకు సూచించారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఒక టేబుల్‌ను ఏర్పాటు చేయాలని, త్వరగా పారదర్శకంగా కౌంటింగ్‌ను పూర్తి చేయడానికి ఏర్పాట్లు, చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి మున్సిపాలిటీ కౌంటింగ్‌ కేంద్రంలో ఒక మీడియా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రతి రౌండ్‌ ఫలితాలను మీడియాకు తెలిసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. 

Updated Date - 2021-03-06T05:42:13+05:30 IST