ఉపాధి డిమాండ్‌ ఉన్న రంగాల్లో శిక్షణ ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-11-27T05:52:48+05:30 IST

ఉపాధి డిమాండ్‌ ఉన్న రంగాల్లో నిరుద్యోగ యువతకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు.

ఉపాధి డిమాండ్‌ ఉన్న రంగాల్లో శిక్షణ ఇవ్వాలి
కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌

కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌

గుంటూరు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఉపాధి డిమాండ్‌ ఉన్న రంగాల్లో నిరుద్యోగ యువతకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన 3.0 కార్యక్రమంపై కలెక్టరేట్‌లో గురువారం జిల్లా నైపుణ్య కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. శిక్షణ వల్ల ఆయా రంగాల్లో 100 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు. స్థానిక అవసరాలు గుర్తించడంతో పాటు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్నారు. జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి షేక్‌ బాబ్జీబాబు మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నాలుగు నెలల మాత్రమే ఉన్నందున నిరుద్యోగ యువతకు శిక్షణ తరగతులు నిర్వహించడానికి సెక్టార్‌ వారీగా గుర్తిస్తామన్నారు. 

- జిల్లాలో పరిశ్రమలపై జరుగుతున్న ఏపీ సమగ్ర సర్వే 2020ని నవంబరు 30కి పూర్తి చేసేలా చూడాలని కలెక్టర్‌ తెలిపారు. పెట్టుబడి రాయితీ, వడ్డీ, విద్యుత్‌, వాణిజ్య పన్నులు, స్టాంప్‌ డ్యూటీ రీయింబర్స్‌మెంట్‌లకు సంబంధించి జిల్లాలోని 154 పరిశ్రమలకు రూ.982.01 లక్షలు మంజూరు చేస్తోన్నట్లు చెప్పారు. సమావేశంలో జేసీలు పీ ప్రశాంతి,  కే శ్రీదర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఆనంద్‌నాయక్‌, మెప్మా పీడీ బాలయ్య, స్టెప్‌ సీఈవో వీ శ్రీనివాసరావు, పరిశ్రమల శాఖ జీఎం ఏవీ పటేల్‌ పాల్గొన్నారు. 

వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం


పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే కలిగే లాభాలపై అవగాహన కల్పించడమే వ్యర్థాలపై వ్యతిరేక పోరాట కార్యక్రమం అని కలెక్టర్‌  ఆనంద్‌కుమార్‌ తెలిపారు. వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం కార్యక్రమం నిర్వహణపై గురువారం జరిగిన సమీక్షలో ఆయన ప్రసంగించారు.   వ్యర్థాల నిర్వహణ, తడి, పొడి చెత్త వేరు చేసి అందించడం అంశాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజలను భాగాస్వామ్యం చేసి స్వచ్ఛమైన పరిశుభ్రతని సాధించాలని సూచించారు. మనం, మన పరిశుభ్రత కార్యక్రమానికి కొనసాగింపుగా వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం డిసెంబరు 2 నుంచి 21వ తేదీ వరకు 20 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా నిబద్ధతతో నిర్వహించాలన్నారు. డిసెంబరు 21న సీఎం జగన్‌ జన్మదినోత్సవం సందర్భంగా ఈ డ్రైవ్‌ ముగుస్తుందన్నారు. సమావేశంలో జేసీ పీ ప్రశాంతి, జడ్పీ సీఈవో చైతన్య, టెరిటోరియల్‌ డీఎఫ్‌వో శివప్రసాద్‌, డీఆర్‌డీఏ పీడీ ఆనంద్‌నాయక్‌, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-27T05:52:48+05:30 IST