రూ.59 కోట్లతో నిర్మాణం.. మరి ప్రారంభోత్సవం ఎప్పుడో?!

Published: Mon, 08 Nov 2021 23:31:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రూ.59 కోట్లతో నిర్మాణం.. మరి ప్రారంభోత్సవం ఎప్పుడో?!

  • నయా కలెక్టరేట్‌..  ప్రారంభోత్సవం ఎప్పుడో ?!
  •  రూ.59 కోట్లతో నిర్మాణం.. పూర్తయిన పనులు

వికారాబాద్‌ జిల్లా కేంద్రం ఎన్నేపల్లి శివారులో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌)  పనులు పూర్తయ్యాయి. అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ భవన సముదాయానికి తుది మెరుగులు దిద్దారు. అయితే ఈ నెలలో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారా.. లేక మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సి వస్తుందా అనే  విషయమై స్పష్టత రావాల్సిఉంది. 


వికారాబాద్‌, (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. మొత్తం రెండంతస్థుల్లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనంలో వంద వరకు గదులు ఉన్నాయి. ఆహ్లాదకరమైన ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడంతో పాటు కార్యాలయం చుట్టూ విశాలమైన రోడ్ల నిర్మాణం చేపట్టారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభింప జేసేందుకు అధికారులు పనులు వేగవంతం చేసి పూర్తి చేశారు. ఇటీవల వికారాబాద్‌ వచ్చిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ భవనాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో సీఎం కేసీఆర్‌ ప్రారంభించేందుకు ఇక ్కడకు వస్తారంటూ ఆయన సభా వేదికపైన ప్రకటించిన విషయం తెలిసిందే. కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్‌ ఎప్పుడు ముహూర్తం ఖరారు చేయనున్నారనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ భవనాన్ని సీఎంవో అధికారులు పరిశీలించి సంతృప్తి చెందిన తరువాతనే కేసీఆర్‌ పర్యటన ఖరారు కానుంది. 


33 ఎకరాల్లో సమీకృత కలెక్టరేట్‌

జిల్లా కేంద్రంలో ఎన్నేపల్లి శివారులో భృంగీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఎదురుగా సర్వే నెంబర్‌ 243, 244, 245ల్లో 33 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ భవన నిర్మాణానికి 2017, అక్టోబర్‌ 11న జిల్లా తొలి కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ నేతృత్వంలో అప్పటి మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేయగా, కలెక్టరేట్‌ భవన నిర్మాణం పనులు ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీ చేపట్టింది. భూమి పూజ చేసిన తరువాత ఏడాదిలోగా నిర్మాణం పనులు పూర్తి చేయాలనే లక్ష్యం నిర్దేశించుకున్నా... బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, కరోనా ప్రభావం తదితర కారణాలతో నాలుగేళ్ల్లు గడిచిపోయాయి. జిల్లా కలెక్టర్‌గా పనిచేసి ఇటీవల ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిన పౌసుమి బసు సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణం పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.  కాగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ప్రైవేట్‌ ఫార్మసీ కళాశాలలో తాత్కాలికంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఏర్పాటు చేశారు.  ప్రస్తుం ఐదేళ్లుగా ఇదే భవనం నుంచి జిల్లా అధికారులు పాలన కొనసాగిస్తున్నారు.

ఒకే ఆవరణలో అన్ని  ప్రభుత్వ శాఖల కార్యాలయాలు

జిల్లా కేంద్రంలో 60 ప్రభుత్వ శాఖలు ఒకే  ఆవరణలో ఉండే విధంగా సమీకృత కలెక్టరేట్‌ భవనం నిర్మించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ ఛాంబర్లు, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి ఛాంబర్‌, మీటింగ్‌ హాళ్లు, కలెక్టరేట్‌కు సంబంధించిన సెక్షన్లు, జిల్లా సంక్షేమాధికారి, పౌర సంబంధాలు, భూగర్భ జలవనరులు, రవాణా, వ్యవసాయ, ఐటీఈ అండ్‌ సీ శాఖల అధికారుల కార్యాలయాలు, ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌, డిస్పెన్సరీ అండ్‌ ఆరోగ్యశ్రీ, డీఐవో/ఆడియో అండ్‌ సర్వర్‌ రూం, ఏటీఎం/ఎల్‌డీఎం, రికార్డులకు గదులు కేటాయించారు. ఫస్ట్‌ఫ్లోర్‌లో సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ, పశు సంవర్ధక, విద్యా. ఉద్యాన పట్టు పరిశ్రమ, ఎస్సీ అభివృద్ధి, ముఖ్య ప్రణాళిక, సహకార, మత్స్య, పౌర సరఫరాలు, జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీ శాఖల అధికారులు ఛాంబర్లు, కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ఇదే అంతస్తులో మంత్రి కోసం ప్రత్యేక ఛాంబర్‌ ఏర్పాటు చేశారు. సెకెండ్‌ఫ్లోర్‌లో ఆడిట్‌, వయోజన విద్య, కార్మిక, యువజన, క్రీడలు, జాతీయ బాలకార్మిక పథకం శాఖలు, జూనియర్‌ ఉపాధి కల్పనాధికారి, గిరిజన, మైనార్టీ, బీసీ, సంక్షేమ శాఖల అధికారులు, కార్యాలయాలు, జిల్లా సంక్షేమాధికారి, పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ,  కార్యాల యాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి అంతస్తులో డైనింగ్‌ హాల్‌, కాన్ఫరెన్స్‌ హాల్‌ సదుపాయం కల్పించారు. మొదటి, రెండవ అంతస్థుల్లో ఖాళీగా ఉన్న గదులను మిగిలిన శాఖలకు కేటాయించనున్నారు. 


ఇబ్బందులు ఎప్పుడు తీరేనో?

ప్రస్తుతం బూర్గుపల్లి వద్ద కొనసాగుతున్న జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చేందుకు కొన్ని ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల ప్రజలకు ఇక్కడకు రావడం అంతగా ఇబ్బందికరంగా లేకున్నా వికారాబాద్‌, తాండూరు నియోజక వర్గాల ప్రజలకు మాత్రం ఇబ్బందికరంగా మారింది. ఈ ప్రాంతాల నుంచి వచ్చే పేద ప్రజలు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు రావాలంటే వికారాబాద్‌కు వచ్చి అక్కడి నుంచి బూర్గుపల్లి వద్ద ఉన్న కలెక్టరేట్‌కు వచ్చేందుకు ఆర్టీసీ బస్సులు, లేదా ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఎన్నేపల్లి శివారులో కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ అందుబాటులోకి వస్తే వారి ఇబ్బందులు కొంత వరకు తీరే అవకాశం ఉంది.


అత్యాధునిక హంగులతో నిర్మాణం

సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని అత్యాధునిక హంగులతో నిర్మించారు. ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ భవన నిర్మాణం పనులకు రాష్ట్ర ప్రభుత్వం మొదట రూ.32 కోట్లు కేటాయించింది. నిర్మాణం ప్రతిపాదనల్లో మార్పులు, చేర్పులు చేయాల్సి రావడంతో నిర్మాణం వ్యయం రూ.59 కోట్లకు పెరిగింది. నిధులు విడుదలై నిర్మాణం పనులు పూర్తి కావడంలో చాలా జాప్యం చోటు చేసుకుంది. కలెక్టరేట్‌ ఆవరణలో పార్కులు, పారింగ్‌ స్థలాలు, విశాలమైన రోడ్లు, హెలీప్యాడ్‌ ఏర్పాటు చేశారు. జీ ప్లస్‌ టూ భవనంలో వంద గదులు ఉన్నాయి. కలెక్టర్‌, ఇద్దరు అదనపు కలెక్టర్ల కార్యాలయాలు, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి, సీసీల కార్యాలయాలు, సమావేశాల హాళ్లతో పాటు వివిధ శాఖలకు ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఒక్కోశాఖకు కేటాయించిన కార్యాలయంలో జిల్లా అధికారికి ప్రత్యేకంగా ఛాంబర్‌ ఉంది. ప్రతి అంతస్థులోనూ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌, కాన్ఫరెన్స్‌హాల్‌ ఏర్పాటు చేశారు. 300 మందితో సమావేశం నిర్వహించే విధంగా కాన్ఫరెన్స్‌ హాల్‌ ఉంది. కార్యాలయాలు,  రూ.3.50 కోట్లతో కలెక్టరేట్‌ భవనంలో ఫర్నిఛర్‌ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌ ఆవరణలోనే జిల్లా కలెక్టర్‌, ఇద్దరు అదనపు కలెక్టర్లతో పాటు మరో నలుగురు జిల్లా అధికారుల కోసం క్యాంప్‌ కార్యాలయాలు నిర్మించారు.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.