ఇళ్ల నిర్మాణాల వేగం పెంచండి

ABN , First Publish Date - 2022-05-22T06:19:38+05:30 IST

ఇళ్ల నిర్మాణాల వేగం పెంచండి

ఇళ్ల నిర్మాణాల వేగం పెంచండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా

అధికారులకు కలెక్టర్‌ రంజిత్‌ బాషా ఆదేశాలు


ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాలో గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రంజిత్‌ బాషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాల్లో శనివారం ఆర్డీవోలు, తహసీల్దార్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలెక్టర్‌ సమావేశమయ్యారు. గృహ నిర్మాణ పురోగతి, లే అవుట్ల అభివృద్ధి, ఓటీఎస్‌ అమలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. జగనన్న లే అవుట్ల కోసం సేకరించిన భూమి, సేకరించాల్సిన భూమి, సేకరించిన భూమికి నగదు చెల్లింపులు చేశారా, సీఎఫ్‌ఎంఎస్‌లో పెండింగ్‌లో ఉన్న నగదు వివరాలు, మండలాలు, గ్రామాలవారీగా నివేదికలు తనకు ఇవ్వాలన్నారు. లే అవుట్లను మెరక చేయడంతో పాటు రోడ్ల నిర్మాణానికి, తాగునీటి వసతి కల్పించేందుకు అంచనాలు రూపొందించాలని చెప్పారు. ప్రైవేట్‌ లే అవుట్ల మాదిరిగా జగనన్న లే అవుట్లలోనూ సోలార్‌ విద్యుత్‌, ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటుచేసే దిశగా అధికారులు ఆలోచన చేయాలన్నారు. 

లబ్ధిదారులతో మాట్లాడండి

జగనన్న లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు అధికారులు లబ్ధిదారులతో నేరుగా మాట్లాడాలని, వారిని ఒప్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. వర్షాకాలం వస్తే నిర్మాణ పనులు ఆలస్యమవుతాయని, జూన్‌ మొదటి వారంలోపు అధిక శాతం మంది లబ్ధిదారులు ఇళ్లు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 97,363 ఇళ్లు మంజూరు చేశామని, త్వరితగతిన వీటి నిర్మాణం జరిగేలా చూడాలని చెప్పారు. ఓటీఎస్‌ ద్వారా రిజిస్ర్టేషన్లు వేగవంతం చేయాలన్నారు. అర్హత లేని వారిని గుర్తించి తుది జాబితాలను రూపొందించాలని చెప్పారు. ఈ సమావేశంలో జేసీ మహేష్‌కుమార్‌, డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, హౌసింగ్‌ పీడీ కె.రామచంద్రన్‌, మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు ఆర్డీవోలు ఐ.కిషోర్‌, పద్మావతి, విజయకుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-22T06:19:38+05:30 IST