కలెక్టర్‌ దంపతులకు ఘన వీడ్కోలు

Jul 25 2021 @ 01:14AM
కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, హేమ దంపతులను సత్కరిస్తున్న దృశ్యం

కాకినాడ సిటీ, జూలై 24: రెండేళ్లపాటు జిల్లాకు కలెక్టర్‌గా సేవలందించి పదోన్నతిపై రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీగా బదిలీపై వెళ్తున్న డి.మురళీధర్‌రెడ్డి, హేమ దంపతులకు అధికారులు, సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు పలికారు. కలెక్టరేట్‌లోని వివే కానంద సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో కలెక్టర్‌ దంపతులను జిల్లా, డివిజనల్‌, మండల స్థాయి అధికారులు సత్కరించారు. విశిష్ట అతిథులుగా హాజరైన జిల్లా ఎస్‌పీ ఎం.రవీంద్రనాధ్‌బాబు, జేసీ డాక్టర్‌ జి.లక్ష్మీశ వారిని శాలువలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. రెండేళ్ల కాలంలో ఆయన జిల్లాకు అందించిన సేవలను కొనియాడారు. జిల్లా అత్యున్నత అధికారితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనాన్ని లాగుతూ పోలీస్‌ బ్యాండ్‌తో కలెక్టరేట్‌నుంచి కలెక్టర్‌ దంపతులకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి అధికారి అఖిల భారత సర్వీస్‌ అధికారేనన్నారు. విధి నిర్వహణలో దీక్షాదక్షతతో కష్టపడి పనిచేసి జిల్లాను ముందు వరుసలో నిలిపారన్నారు. ఎస్‌పీ రవీంద్రనాధ్‌బాబు మాట్లాడుతూ రెండేళ్లకాలంలో మురళీధర్‌రెడ్డి పోలీస్‌శాఖకు ఎంతో మేలు చేశారన్నారు. కారుణ్య నియామకాల్లో ఎక్కడా పెండింగ్‌ లేకుండా చూశారన్నారు. జేసీ లక్ష్మీశ మాట్లాడుతూ నిరాడంబరతతో, ఆదర్వనీయ లక్షణాలతో పనితీరులో అత్యున్నత ఫలితాలు సాధించిన మురళీధర్‌రెడ్డి తనకు గురుసమానులన్నారు. రెండేళ్ల కాలంలో ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నారన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి మాట్లాడుతూ ఈ జిల్లాలో పనిచేయడాన్ని అదృష్టంగా భావిస్తారన్నారు. కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి హయాంలో పనిచేయడం మరింత అదృష్టమన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో సీహెచ్‌.సత్తిబాబు, కాకినాడ, రాజమహేంద్రవరం కమిషనర్లు స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌, అభిషిక్త్‌ కిషోర్‌, చింతూరు, రంపచోడవరం ఐటీడీఏ పీవోలు ఎ.వెంకటరమణ, సీవీ.ప్రవీణ్‌ ఆదిత్య, రాజమహేంద్రవరం, రంపచోడవరం సబ్‌కలెక్టర్లు ఇలాక్కియా, కట్టా సింహాచలం, అదనపు ఎస్‌పీ కరణం కుమార్‌, ఏపీఎస్‌పీ థర్డ్‌ బెటాలియన్‌ కమాండెంట్‌ సుమిత్‌ గరుడ్‌, ట్రైనీ కలెక్టర్‌ గీతాంజలిశర్మ, జడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ.సత్యనారాయణ, డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాధ్‌, డీపీవో ఎస్‌వీ, నాగేశ్వర్‌నాయక్‌, డీఎంహెచ్‌వో కేవీఎస్‌ గౌరీశ్వరరావు, సాంఘిక సంక్షేమశాఖ జేడీ జె.రంగలక్ష్మీదేవి, ట్రెజరీ డీడీ శర్మ, సివిల్‌ సప్లయిస్‌ జడ్‌ఎం డి.పుష్పమణి, ఆర్‌డీవోలు ఏజీ.చిన్నికృష్ణ, ఎస్‌.మల్లిబాబు, ఎస్‌.వసంతరాయుడు పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.