అధికారులు అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-07-24T05:29:00+05:30 IST

భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్‌ శ్రుతి ఓజా అన్నారు

అధికారులు అప్రమత్తంగా ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రుతి ఓఝా, పాల్గొన్న ఎస్పీ, ఎమ్మెల్యే

- కలెక్టర్‌ శ్రుతి ఓఝా

- అధికారులతో సమీక్షా సమావేశం

- హాజరైన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల క్రైం, జూలై 23 : భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్‌ శ్రుతి ఓజా అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గురువారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. భారీ వర్షాలతో నదులు, చెరువులు ఉప్పొంగు తున్నందున లోతట్లు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రమాదాలు జరుగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వరదలతో జరిగిన నష్టంపై నివేదిక ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పంటలకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్‌ భగీరధ ట్యాంక్‌లను శుభ్రం చేసి, క్లోరినేషన్‌ చేసిన తర్వాతనే నీటిని విడుదల చేయాలని సూచించారు. నీరు కలుషితమై డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ లాంటి వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. పరిసరాలు శుభ్రం గా ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. శానిటేషన్‌ విధిగా చేయించాలని, విద్యుత్‌ తీగలు, స్తంభాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో మురుగునీరు నిలువకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సీజనల్‌ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున, క్యాంపు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ముచ్చోనిపల్లి రిజర్వాయర్లో నీటిమట్టం పెరిగి పరిసర ప్రాంతాల్లోని పొలాల్లోకి నీరు చేరిందన్నారు. రైతులు నష్టపోకుండా రిజర్వాయర్‌కు మరమ్మతు చేయించాలని అధికారులను కోరారు. సమావేశంలో ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌, అదనపు కలెక్టర్లు రఘురామ్‌శర్మ, శ్రీహర్ష, ఇరిగేషన్‌ ఎస్‌ఈ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-24T05:29:00+05:30 IST