ఉల్లి కొనుగోలు చేయండి

ABN , First Publish Date - 2020-08-08T09:47:59+05:30 IST

ఉల్లి రైతులు నష్టపోకుండా ఈనాం పద్ధతిలో వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ వ్యాపారులను ..

ఉల్లి కొనుగోలు చేయండి

రైతులు నష్టపోకూడదు

కలెక్టర్‌ వీరపాండియన్‌


కర్నూలు(అగ్రికల్చర్‌), ఆగస్టు 7: ఉల్లి రైతులు నష్టపోకుండా ఈనాం పద్ధతిలో వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ వ్యాపారులను ఆదేశించారు. శుక్రవారం సునయన ఆడిటోరియంలో ఉల్లి వ్యాపారులు, మార్కెటింగ్‌ శాఖ అధికారులు, మార్క్‌ఫెడ్‌ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రైతులు తెచ్చిన ఉల్లిని బహిరంగ వేలం ద్వారా కాకుండా ఈనాం పద్ధతిలో కొనుగోలు చేయాలన్నారు. ఈ విధానం వల్ల తాము నష్టపోతామని, బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేస్తామని వ్యాపారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అయితే అన్ని పంట ఉత్పత్తులను ఈనాం పద్ధతి ద్వారానే కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినందున వ్యాపారులు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్‌ అన్నారు.


మార్కెట్‌ యార్డులు తెరిచే వరకు రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్‌ శాఖ, మార్క్‌ఫెడ్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. గూడూరు, కోడుమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆదోని, కోసిగి, డోన్‌ మార్కెట్‌ యార్డులకు రైతులు తెచ్చిన ఉల్లిని మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం తరపున క్వింటం ఉల్లికి రూ.770 అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో కార్యక్రమంలో మార్కెటింగ్‌ శాఖ ఏడీఎం సత్యనారాయణ చౌదరి, మార్క్‌ఫెడ్‌ మేనేజర్‌ సురేష్‌కుమార్‌, కర్నూలు మార్కెట్‌ కమిటి సెక్రటరీ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 


10 నుంచి కర్నూలు యార్డులో విక్రయాలు 

కర్నూలు(అగ్రికల్చర్‌), ఆగస్టు 7: కర్నూలు మార్కెట్‌ యార్డులో రైతుల పంట ఉత్పత్తులను ఈ నెల 10 నుంచి కొనుగోలు చేస్తామని మార్కెట్‌ కమిటి సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు కర్నూలు యార్డును పునఃప్రారంభిస్తామన్నారు. రైతులకు కేటాయించిన తేదీల్లోనే ఉల్లి కాకుండా వేరుశనగ, వాము తదితర పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని తెలిపారు. 

Updated Date - 2020-08-08T09:47:59+05:30 IST