జడ్పీకి రాని కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-06-28T05:20:38+05:30 IST

జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశానికి మెదక్‌ కలెక్టర్‌ హరీశ్‌ రాకపోవడంపై సభ్యులు మండిపడ్డారు.

జడ్పీకి రాని కలెక్టర్‌
మెదక్‌ జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న జడ్పీచైర్‌పర్సన్‌ హేమలత, ఎమ్మెల్యేలు పద్మారెడ్డి, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి

సర్వసభ్య సమావేశానికి డుమ్మా

ప్రొటోకాల్‌ పాటించకపోవడంతో సభ్యుల నిరసన

ఇది మమ్మల్ని అవమానించడమే 

నిజాంపేట జడ్పీ సభ్యుడు విజయ్‌ కుమార్‌ ఆవేదన

వాడీవేడిగా జడ్పీ సర్వసభ్య సమావేశం


 ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, జూన్‌ 27: జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశానికి మెదక్‌ కలెక్టర్‌ హరీశ్‌ రాకపోవడంపై సభ్యులు మండిపడ్డారు. మూడు నెలలకు ఒకసారి జరిగే సమావేశానికి కూడా కలెక్టర్‌ రారా..? అంటూ నిజాంపేట టీఆర్‌ఎస్‌ జడ్పీటీసీ సభ్యుడు పంజా విజయ్‌కుమార్‌ ప్రశ్నించారు. సమావేశానికి కలెక్టర్‌ రాకపోవడం ఏంటని నిలదీశారు. సమావేశంలో కీలకపాత్ర పోషించే కలెక్టర్‌ మీటింగ్‌కు రాకుంటే ప్రయోజనం ఏమిటన్నారు. కలెక్టర్‌ రాకపోవడం తమను అవమానించడమేనంటూ తీవ్రంగా ఆక్షోపించారు. సభలో కనీసం ప్రొటోకాల్‌ కూడా పాటించడంలేదని అధికారులు ధ్వజమెత్తారు. సోమవారం మెదక్‌ కలెక్టరేట్‌లో జడ్పీచైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌ గౌడ్‌ అధ్యక్షతన జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి, జిల్లా అధికారులు హాజరయ్యారు. సమావేశంలో పాల్గొన్న జడ్పీటీసీ సభ్యుడు విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ..ప్రతి సమావేశంలో ఎన్నో సమస్యలను సభ దృష్టికి తెస్తున్నా ఒక్క సమస్య కూడా పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. సమస్యల పరిష్కారానికి మూడు నెలలు సరిపోదా అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన జడ్పీ సీఈవో వెంకటశైలేష్‌ మాట్లాడుతూ..చీఫ్‌ సెక్రటరీ వద్ద సమావేశం ఉండడం వల్ల కలెక్టర్‌ జడ్పీ సమావేశానికి రాలేకపోయారని చెప్పారు. సమావేశానికి రావడం లేదని జడ్పీచైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌ గౌడ్‌కు ముందుగానే సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఇక ప్రొటోకాల్‌ సమస్య తలెత్తకుండా చూస్తామని సీఈవో హామీ ఇచ్చారు. వచ్చే సమావేశం నాటికి గత సమావేశంలో ప్రస్తావించిన సమస్యలు వాటి పరిష్కారాలకు సంబంధించిన సమాచారం కూడా ఇస్తామని చెప్పారు. 


డీఎంహెచ్‌వో సమాచారం ఇవ్వడం లేదు : నార్సింగి ఎంపీపీ 

మండల పరిషత్‌ అధ్యక్షులుగా పనిచేస్తున్న తమకు సమాచారం ఇవ్వకుండానే గ్రామాలు, మండల కేంద్రాలకు వచ్చి జిల్లా వైద్యాధికారి సమావేశాలు నిర్వహిస్తున్నారని నార్సింగి ఎంపీపీ సబిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడేమో కరోనా టీకా కోసం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సహకరించాలని డీఎంహెచ్‌వో కోరడం ఏమిటని ప్రశ్నించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆసుపత్రి సలహా సంఘం ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న తమకే సమాచారం ఇవ్వకుంటే ఇక ప్రజలకు ఏం తెలుస్తుందన్నారు. నార్సింగిలో రెండేళ్లుగా నార్మల్‌ డెలివరీలు జరగడం లేదన్నారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పీహెచ్‌సీలకు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఎంపీపీలకు సమాచారం ఇవ్వకుండా అక్కడికి వెళ్లడం ఏంటని డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌రావును ప్రశ్నించారు. తప్పకుండా ఎంపీపీలకు సమాచారం ఇవ్వాలన్నారు. వారి పర్యవేక్షణలోనే ఆసుపత్రి సలహా సంఘం సమావేశాలు నిర్వహించాలని సూచించారు. 


ప్రతి మీటింగ్‌లో ఇవే అంశాలా?  

-వైద్యాధికారులపై ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆగ్రహం

మూడు నెలలకు ఒకసారి జరిగే జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఎజెండాలో ఆరోగ్యశాఖ అధికారులు ఒకే సమస్యలను పొందుపరుస్తున్నారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సమావేశంలో ఇవే సమస్యలను ప్రస్తావిస్తారా అంటూ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులను ప్రశ్నించారు. ఈ సారి ఎజెండాలో ప్రస్తావించిన అంశాల్లో ఎన్నింటిని పరిష్కరించారో చెప్పండంటే అక్కడే ఉన్న డీఎంఆండ్‌హెచ్‌వో వెంకటేశ్వర్‌రావు, డీసీహెచ్‌ఎ్‌స చంద్రశేఖర్‌ నిమ్మకుండిపోయారు. 


పనుల్లో వేగం పెరగాలి : శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ 

మన ఊరు-మనబడి పనులు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయని ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల పనులు ఇంత డీలే ఎందుకు అవుతున్నాయని డీఈవో రమే్‌షను ప్రశ్నించారు. ఒకే స్కూల్‌ కాంపౌండ్‌లో హైస్కూల్‌, ప్రైమరీ స్కూల్‌ ఉంటే కేవలం ఒకదాని పనులే చేస్తున్నారని తెలిపారు. రెండు స్కూళ్ల పనులు చేయాలి కదా అని ప్రశ్నించారు. ఒక స్కూల్‌కు కలర్‌ వేసి మరో స్కూల్‌కు కలర్‌ వేయకుంటే ఎలాగుంటుందన్నారు. మన ఊరు-మన బడి పనులు ఇతర జిల్లాలో వేగంగా జరిగితే మెదక్‌ జిల్లాలో మాత్రం బాగా డీలే అవుతున్నాయన్నారు. పనులు చేపట్టిన శాఖల మధ్య సమన్వయం లేదన్నారు. 


డీసీహెచ్‌ఎ్‌స పనితీరుపై జడ్పీటీసీ విజయ్‌ అసహనం

జిల్లా ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లు, సిబ్బంది, డ్యూటీ చేస్తున్న వారు ఎంత మంది, తదితర వివరాలు కావాలని మూడేళ్ల నుంచి స్టాండింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో అడుగుతున్నా తనకు సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని డీసీహెచ్‌ఎ్‌స చంద్రశేఖర్‌ను నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్‌ ప్రశ్నించారు.  ఆరోగ్య శ్రీ కింద వచ్చిన నిధులు, చేసిన ఖర్చుకు సంబంధించిన వివరాలను అడిగితే కూడా డీసీహెచ్‌ఎ్‌స చెప్పడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సభ్యుని ఆరోపణలపై డీసీహెచ్‌ఎ్‌స చంద్రశేఖర్‌ స్పందిస్తూ రేడియాలజిస్ట్‌ లేక అన్ని సందర్భాల్లో స్కానింగ్‌ చేయడం వీలు కావడం లేదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో టెస్టుల కోసం బయటకి రాసినా వాటికి బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. 


విద్యుత్‌ అధికారుల తీరు మారాలి  : మదన్‌రెడ్డి ఎమ్మెల్యే

జిల్లాలో విద్యుత్‌ అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు బాగా లేదని పలువురు సభ్యులు ధ్వజమెత్తారు. రామాయంపేటలో తలెత్తిన సమస్యను పరిష్కరించడానికి మూడు, నాలుగు రోజుల సమయం తీసుకోవడం ఏమిటని విద్యుత్‌శాఖ అధికారులను ఎమ్మెల్యే పద్మారెడ్డి నిలదీశారు. సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వివిధ మండలాల్లో పని చేస్తున్న ఏఈలను మార్చాలని జానకీరామ్‌కు సూచించారు. పల్లెప్రగతిలో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని పలువురు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఆరోపించారు. దీనికి స్పందించిన ఎస్పీ జానకీరాం మాట్లాడుతూ.. పల్లెప్రగతిలో చాలా సమస్యలు పరిష్కరించామని, ఇంకా పనులు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్‌శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. కౌడిపల్లి మండలంలో విద్యుత్‌ మీటర్ల కోసం డబ్బు కట్టినా ఇవ్వకుండా కరెంట్‌ వాడుతున్నారని కేసులు చేయడం దారుణమన్నారు. అధికారుల తీరు మారాలన్నారు. 


కోట్ల రూపాయలు పక్కదారి 

చంద్రాగౌడ్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌

మహిళ సంఘాల డబ్బు కోట్లలో పక్కదారి పడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ చంద్రగౌడ్‌ ప్రశ్నించారు. శివ్వంపేట మండలం గోమారం మహిళా సంఘంలో రూ.2.20లక్షలు పక్కదారి పడితే చర్యలు తీసుకోవడం లేదని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి శ్రీనివా్‌సను నిలదీశారు. మహిళ సంఘాలకు కోట్ల రూపాయల నిధులు వస్తున్నా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకపోవడం వలన ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. నిజాంపేట జడ్పీటీసీ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ తమ మండలంలోని మూడు గ్రామాల్లో కోట్లాది రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయని మండిపడ్డారు. సభ్యుల ఆరోపణలపై స్పందించిన డీఆర్‌డీవో శ్రీనివాస్‌ మాట్లాడుతూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు


Updated Date - 2022-06-28T05:20:38+05:30 IST