కలెక్టరేట్‌.. ప్రక్షాళన

ABN , First Publish Date - 2021-10-07T05:08:50+05:30 IST

కలెక్టరేట్‌లో వివిధ విభాగాలను ప్రక్షాళన చేసేందుకు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ నిర్ణయించారు. దీర్ఘకాలంగా కలెక్టరేట్‌లోనే కొనసాగుతోన్న వారిని సాగనంపాలని జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ), డీఆర్‌వోలను ఆదేశించారు.

కలెక్టరేట్‌.. ప్రక్షాళన

రెండేళ్లు దాటిన వారిని సాగనంపాలి

సబ్జెక్టులో నిష్ణాతులను తీసుకురావాలి

జేసీ, డీఆర్వోలకు వివేక్‌యాదవ్‌ ఆదేశాలు


గుంటూరు, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌లో వివిధ విభాగాలను ప్రక్షాళన చేసేందుకు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ నిర్ణయించారు. దీర్ఘకాలంగా కలెక్టరేట్‌లోనే కొనసాగుతోన్న వారిని సాగనంపాలని జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ), డీఆర్‌వోలను ఆదేశించారు. ఇందుకు రెండేళ్ల సర్వీసుని కొలమానంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. తహసీల్దారు, ఆర్డీవో, పులిచింతల భూసేకరణ, కోనేరు రంగారావు కమిటీ తదితర కార్యాలయాల్లో ఎవరైనా రెవెన్యూ సబ్జెక్టుల్లో నిష్ణాతులైన వారు ఉంటే వారిని కలెక్టరేట్‌లో పోస్టింగ్‌కు సిఫార్సు చేయాలన్నారు. అంతేకాకుండా వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయాలన్నారు. కలెక్టర్‌ తాజా ఆదేశాలతో సంబంధిత అధికారులు సెక్షన్ల ప్రక్షాళనకు కసరత్తు ప్రారంభించారు.


బలహీనంగా కలెక్టరేట్‌

జిల్లాలోని 58 మండలాలకు తలమానికంగా ఉండాల్సిన కలెక్టరేట్‌ ఇటీవల కాలంలో బలహీనపడిపోయింది. తగినంత సిబ్బంది లేరు. ఇదే సమయంలో రాజకీయ నాయకుల సిఫార్సులతో కొంతమంది కలెక్టరేట్‌లో పోస్టింగ్‌లు తెచ్చుకుని కొనసాగుతున్నారు. పరిపాలన, భూసేకరణ, రెవెన్యూ సర్వీసులు, ఎన్నికలు, ప్రొటోకాల్‌ విధులు వంటి సెక్షన్లలో కొంతమంది ఏళ్ల తరబడి పాతుకుపోయి ఉన్నారు. చాలామందికి రెవెన్యూ సబ్జెక్టులపై సరైన అవగాహన కూడా ఉండటం లేదు. కలెక్టరేట్‌లో విధులు నిర్వహించడమంటే కత్తి మీద సాము లాంటిదే. జిల్లాలోని అన్ని మండలాలకు సంబంధించిన రెవెన్యూ వ్యవహారాలు చూసుకోవాలి. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను మండలాలకు పంపించి సకాలంలో వాటిని అమలు జరిగేలా చూడాలి. అలానే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకుని ఉన్నతాధికారులకు నివేదిస్తుండాలి. ఏమాత్రం నిర్లిప్తంగా వ్యవహరించినా అందుకు వారి పై అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కోర్టు ధిక్కరణ పిటిషన్ల సంఖ్య పెరిగిపోతుండటం సిబ్బంది నిర్లిప్తతని స్పష్టం చేస్తున్నది. వీటిని పరిగణనలోకి తీసుకున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ రెండేళ్ల కంటే ఎక్కువ రోజులుగా కొనసాగుతోన్న ఉద్యోగులను మండలాలకు బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్‌లో కొత్త ఉద్యోగులు వస్తే వారంతా బాధ్యతగా విధులు నిర్వహిస్తారని కలెక్టర్‌ భావిస్తున్నారు. ప్రధానంగా సెక్షన్‌ హెడ్‌లు(తహసీల్దారు ర్యాంకు) అధికారుల పోస్టింగ్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. కలెక్టరేట్‌ ఆదేశాలపై కసరత్తు ప్రారంభం కావడంతో ఎంతమంది బదిలీ అవుతారోనన్న చర్చ రెవెన్యూవర్గాల్లో కొనసాగుతున్నది. ప్రస్తుతం ఉద్యోగుల బదిలీలపై నిషేధం కొనసాగుతున్న దృష్ట్యా డిప్యూటేషన్‌ చేస్తారని భావిస్తోన్నారు. 


Updated Date - 2021-10-07T05:08:50+05:30 IST