కోనసీమలో కలకలం!

ABN , First Publish Date - 2022-05-21T09:11:15+05:30 IST

: కోనసీమ జిల్లా పేరును ‘డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ’ జిల్లాగా మారుస్తామంటూ ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌ తీవ్ర కలకలం రేపింది.

కోనసీమలో కలకలం!

జిల్లా పేరు మార్పుపై నిరసనలు

‘అంబేడ్కర్‌’ పేరు జోడించడంపై అమలాపురం కలెక్టరేట్‌ ముట్టడి

వైసీపీ నేత ఆధ్వర్యంలో ర్యాలీ, ఆందోళన

యువకుడి ఆత్మహత్యాయత్నం.. ఉద్రిక్తత


అమలాపురం, విజయవాడ మే 20(ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లా పేరును ‘డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ’ జిల్లాగా మారుస్తామంటూ ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌ తీవ్ర కలకలం రేపింది. జిల్లా పేరును మార్చడానికి వీల్లేదంటూ.. అమలాపురంలో వైసీపీ కీలక నేత ఆధ్వర్యంలో వేల మంది ఆందోళనకారులు నిరసనకు దిగారు. శుక్రవారం చేపట్టిన ఈ ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనకారులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఓ యువకుడు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో పరిస్థితి అదుపు తప్పింది. అంబాజీపేట మండలానికి చెందిన వివిధ సామాజికవర్గాల ప్రజలు కోనసీమ జిల్లా పేరు మార్చద్దంటూ అంబాజీపేటలో రాస్తారోకో నిర్వహించి అక్కడి నుంచి ర్యాలీగా జిల్లా కేంద్రమైన అమలాపురం వచ్చారు. అమలాపురంలోని కోనసీమ జిల్లా ఉద్యమ సమితి నాయకుల ఆధ్వర్యంలో మరో ర్యాలీ నల్లవంతెన వద్దకు చేరుకుంది.


వీరంతా కలిసి భారీ ర్యాలీగా కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఓ యువకుడు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడేందుకు సిద్ధమవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. ఆ తర్వాత ఆందోళనకారుల నుంచి వినతిపత్రాలను సేకరించి డీఆర్వో సత్తిబాబుకు అందజేశారు. కాగా.. రాజోలు ప్రాంతానికి తెన్నేటి మోజెష్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో కొందరు దళితులు జిల్లాకు కోనసీమ పేరునే కొనసాగించాలంటూ కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేశారు. 


ఎన్టీఆర్‌ పేరు పెట్టొదన్నామా?: బొండా 

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సాయిరెడ్డీ.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు వద్దని నీకు చెప్పామా? లేక నీ అమ్మ మొగుడికి చెప్పామా? చెప్పు ఏ2’’ అంటూ బొండా ఉమా శుక్రవారం ట్విటర్‌ వేదికగా ప్రశిం్నంచారు. 

Updated Date - 2022-05-21T09:11:15+05:30 IST