వ్యవస్థ గాడితప్పింది

ABN , First Publish Date - 2021-07-25T06:21:41+05:30 IST

జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ గాడి తప్పిందని, పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ హెచ్చరించారు.

వ్యవస్థ గాడితప్పింది
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, వేదికపై జేసీలు వెంకటమురళి, చేతన్‌, ఇతర అధికారులు

రెవెన్యూ అధికారుల తీరుపై కలెక్టర్‌ ఆగ్రహం

పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక

సమావేశానికి గైర్హాజరైన సర్వేయర్లపై అసంతృప్తి 

ఒంగోలు (కలెక్టరేట్‌), జూలై 24 : జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ గాడి తప్పిందని, పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు నియమ నిబంధనలు విస్మరించడంపై ఆగ్రహించారు. నిబంధనలకు విరుద్ధంగా కొందరు పనిచేస్తున్నారని అసంతృప్తి వ్యక్తంచేశారు. స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో శనివారం జిల్లాస్థాయి రెవెన్యూ అధికారుల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. పరిపాలన విధివిధానాలను రెవెన్యూ అధికారులు విస్మరించడం ఏమిటని ప్రశ్నించారు.  ప్రజల కోసం పనిచేసినందుకే ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కార్యాలయాలు ఎలా పనిచేస్తున్నాయనే విషయం తహసీల్దార్ల వ్యవహరశైలిపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ భూములకు వీఆర్‌వోలు, తహసీల్దార్లు కస్టోడియన్లుగా వ్యవహరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అవి ఆక్రమణలకు గురవుతుంటే రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములపై తక్షణమే ఆడిట్‌ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా వెబ్‌ల్యాండ్‌లో భూమి వివరాల నమోదు, మార్పు చేస్తే నేరంగా పరిగణించి రెవెన్యూ అధికారులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెద్దారవీడు మండలానికి చెందిన బాధితుడు జనవరిలో అర్జీ పెట్టుకుంటే ఇంతవరకూ సమస్యను పరిష్కరించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. 70 శాతానికిపైగా రెవెన్యూ సమస్యలపైనే అర్జీలు వస్తున్నాయని, స్పందన పోర్టల్‌లో గడువు తీరిన అర్జీలు పెండింగ్‌లో ఉండరాదన్నారు. జేసీలు వెంకటమురళి, టీఎస్‌చేతన్‌, కేఎస్‌ విశ్వనాథన్‌, కృష్ణవేణి, సబ్‌కలెక్టర్‌ అపరాజిత్‌, డీఆర్వో తిప్పేనాయక్‌, ఆర్డీవోలు ప్రభాకర్‌రెడ్డి, లక్ష్మీశివజ్యోతి పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-25T06:21:41+05:30 IST